సాక్షి, సికింద్రాబాద్: అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే సికింద్రాబాద్ మద్రాస్ రెజిమెంట్‌లో భారీగా ఆయుధాలు చోరీ కావడం తీవ్ర కలకలం రేపుతోంది. రెజిమెంట్‌లోని ఓ గది తాళం పగులగొట్టి 12 అత్యాధునిక ఆయుధాలను దుండగులు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. వీటిలో నాలుగు ఏకే-47 రైఫిళ్లు, ఆరు పిస్టల్స్, ఒక ఇన్సాస్ రైఫిల్ ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా పెద్ద మొత్తంలో మందుగుండు సామగ్రి కూడా మాయమైనట్లు గుర్తించారు.
ఆర్మీ అధికారి ఫిర్యాదు మేరకు బొల్లారం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇంతటి కట్టుదిట్టమైన భద్రత ఉన్న రెజిమెంట్‌లోకి దుండగులు ఎలా ప్రవేశించారు? ఆయుధాలు భద్రపరిచిన గదికి ఎలా చేరుకున్నారు? తాళం ఎలా పగులగొట్టారు? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన అత్యంత సున్నితమైనది కావడంతో పోలీసులు రహస్యంగా దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. చోరీ జరిగిన ఆయుధాలు, మందుగుండు సామగ్రి ఎక్కడికి తరలించారు? ఈ ఘటన వెనుక ఎవరున్నారు? రెజిమెంట్‌లోని అంతర్గత వ్యక్తుల ప్రమేయం ఏమైనా ఉందా? అనే కోణాల్లోనూ విచారణ సాగుతోంది.
మరోవైపు.. ఆర్మీకి చెందిన అత్యాధునిక ఆయుధాలు భారీగా మాయమవడం భద్రతా వర్గాల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది. పోలీసులు, ఆర్మీ అధికారులు కలిసి చోరీకి సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నారు. దర్యాప్తు పూర్తయితే మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: నల్లగొండలో హైటెన్షన్.. నేడు ఏం జరుగనుంది?


