హైదరాబాద్‌ ఆస్పత్రుల్లో తీవ్రమైన రక్తం కొరత

Blood Shortage in Hyderabad Hospitals: Niloufer Hospital Postponed Surgeries - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగరంలోని ఏ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లోని బ్లడ్‌బ్యాంకుల్లో రక్తం కొరత తీవ్రంగా ఉంది. నగరంలోని అన్ని ప్రధానాస్పత్రులతో పాటు బ్లడ్‌ బ్యాంకులలోనూ ప్రస్తుతం సరిపడా రక్త నిల్వలు లేకపోవడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. పలు కారణాలతో దాతలు రక్తం దానం చేయడానికి ముందుకు రావడం లేదు.

► అన్ని స్థాయిల విద్యార్థులకు పరీక్షలు సమీపిస్తుండడం, ఎండలు పెరగడం, వైరస్‌ భయాల వంటి కారణాలతో ఇప్పుడు రక్తదానం చేసే వారు కరువయ్యారు.

► ఫలితంగా అత్యవసర పరిస్థితుల్లో ఆయా ఆస్పత్రుల్లోని బ్లడ్‌ బ్యాంకులకు చేరుకున్న క్షతగాత్రులకు, సర్జరీ బాధితులకు, తలసేమియా రోగులకు ప్రాణసంకటం ఏర్పడింది.

► బంధువుల్లో ఎవరైనా రక్తదానం చేసేందుకు ముందుకు వస్తే కానీ...ఆయా బాధితులకు అవసరమైన గ్రూప్‌ రక్తం దొరకని దుస్థితి నెలకొంది.

నిలోఫర్‌లో సర్జరీలు వాయిదా 
నాంపల్లి: నిలోఫర్‌ ఆస్పత్రి బ్లడ్‌బ్యాంక్‌లో రక్తం లేని కారణంగా శుక్రవారం అత్యవసర విభాగంలో నిర్వహించాల్సిన సర్జరీలు వాయిదా పడ్డాయి. సకాలంలో  రోగులకు అవసరమైన రక్తం దొరక్క అటు రోగి బంధువులు, ఇటు వైద్యాధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరకు గాంధీ ఆసుపత్రికి పరుగులు పెట్టాల్సిన దుస్థితి నెలకొంది. బి పాజిటివ్‌ 4 ప్యాక్డ్‌ సెల్స్, ఏడు ప్లాటింగ్‌ ప్యాక్చర్స్‌ (క్రయోన్స్‌) పాకెట్లను ఒక్కొక్కటి రూ.650 వెచ్చించి గాంధీ ఆసుపత్రి నుంచి తీసుకువచ్చారు. రక్తాన్ని తెచ్చేంత వరకు రోగి, వైద్యులు ఆపరేషన్‌ థియేటర్‌లో వేచి చూశారు. నిత్యం నిలోఫర్‌ ఆసుపత్రిలో ఏదో ఒక రకమైన బ్లడ్‌ గ్రూపు కొరత ఉంటోంది. రోగులు బ్లడ్‌ బ్యాంక్‌కు వెళ్లడం, అక్కడ రక్తం దొరక్క ఇబ్బందులు పడటం సర్వసాధారణమైపోతోంది.   

దాతలు ముందుకు రావడం లేదు 
కోవిడ్‌ కారణంగా గత రెండేళ్ల నుంచి రక్తదాన శిబిరాలు నిర్వహించలేక పోయాం. ఇటీవల నిర్వహిస్తున్నా..ఒకరిద్దరికి మించి ముందుకు రావడం లేదు. ఎండలకు భయపడి దాతలు కూడా ముందుకు రావడం లేదు. పరీక్షల సమయం కావడంతో కాలేజీ విద్యార్థులు కూడా రక్తదానానికి ఇష్టపడటం లేదు. ముఖ్యంగా ‘ఒ’ నెగిటివ్‌ బ్లడ్‌ గ్రూప్‌ దొరకడం లేదు. అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన వారికి కూడా కనీస సేవలు అందించ లేకపోతున్నాం.      
– లక్ష్మీరెడ్డి, అధ్యక్షురాలు, బ్లడ్‌బ్యాంక్స్‌ అసోసియేషన్‌

బ్లడ్‌ బ్యాంక్‌లన్నీ తిరిగాను 
మాకు తెలిసిన వ్యక్తి ఒకరు ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆయన్ను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించాం. పరీక్షించిన వైద్యులు ఐదు యూనిట్ల రక్తం ఎక్కించాలని చెప్పారు. వైద్యులు రాసిచ్చిన చీటి పట్టుకుని నగరంలోని ప్రముఖ బ్లడ్‌ బ్యాంకులన్నీ తిరిగాం. అయినా దొరకలేదు. చివరకు మా బంధువుల్లో అదే గ్రూప్‌కు చెందిన వ్యక్తిని తీసుకొచ్చి రక్తం తీసుకోవాల్సి వచ్చింది. 
– సీహెచ్‌.లక్ష్మి, బడంగ్‌పేట్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top