మందుల మాఫియా: రెమిడెసివిర్‌ రూ.75 వేలు

Black Market Of Covid Drugs; Remdesivir Sold 75,000 - Sakshi

తుసిలిజుమాబ్‌ ధర ఏకంగా రూ. రెండు లక్షలు 

నల్లబజారులో మందుల మాఫియా భారీ దందా 

కరోనా రోగుల అవసరాన్ని క్యాష్‌ చేసుకుని అక్రమాలు 

ఖమ్మం సహా పలు జిల్లాల్లో ఇష్టారాజ్యంగా విక్రయం 

అధికారుల చేతినుంచే మాఫియాకు అందుతున్న మందులు? 

ఇందులో కొందరు వైద్యారోగ్య అధికారుల హస్తమున్నట్టు ఆరోపణలు 

ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లే మందులూ పక్కదారి పడుతున్న వైనం

ఆయన పేరు రమణ (పేరు మార్చాం). తన తల్లికి కరోనా రావడంతో ఖమ్మంలోని ఒక ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్చారు. పరిస్థితి విషమంగా ఉందని, రెమిడెసివిర్‌ ఇంజక్షన్‌ ఇస్తే కోలుకునే అవకాశముందని డాక్టర్లు చెప్పారు. ఇంజక్షన్‌ తెచ్చి ఇస్తే వేస్తామన్నారు. ఏం చేయాలో అర్థంగాక రమణ కొందరు దళారులను ఆశ్రయించాడు. వారు ఒక్కో రెమిడెసివిర్‌ ఇంజక్షన్‌ను రూ.75 వేల చొప్పున ఇచ్చారు. రమణ గత్యంతరం లేక అప్పుచేసి ఆరు ఇంజక్షన్లను రూ.4.5 లక్షలు పెట్టి కొనుగోలు చేశాడు. 

ఆయన పేరు కృష్ణ (పేరు మార్చాం). వయసు 35 ఏళ్లు. హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. తుసిలిజుమాబ్‌ ఇస్తే గట్టెక్కే సూచనలు ఉన్నాయని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. తమ వద్ద లేవని, బయట తెచ్చుకోవాలని చెప్పాయి. కృష్ణ కుటుంబ సభ్యులు ఆ ఔషధం కోసం అనేకచోట్ల ప్రయత్నించారు. ప్రభుత్వ వర్గాలను సంప్రదించినా ప్రయోజనం లేదు. చివరికి కోఠిలోని ఒక వైద్యారోగ్య శాఖ ఉద్యోగిని కలిశారు. అతడి నుంచి ఒక్కో తుసిలిజుమాబ్‌ ఇంజక్షన్‌కు రూ.2 లక్షల చొప్పున.. రెండు ఇంజక్షన్లు తీసుకుని ఏకంగా రూ.4 లక్షలు ఇచ్చాడు.

సాక్షి, హైదరాబాద్‌: కరోనా పేషెంట్లకు ఉపయోగించే యాంటీ వైరల్‌ ఔషధాల విషయంలో రాష్ట్రంలో సాగుతున్న దందా ఇది. రెమిడిసివిర్‌ ఇంజక్షన్‌ ధరలు కంపెనీని బట్టి రూ.899 నుంచి రూ.3,490 వరకు ఉన్నాయి. తుసిలిజుమాబ్‌ ఇంజక్షన్‌ ధర రూ.30 వేల వరకు ఉంది. కానీ ఈ తరహా ఔషధాలకు కొరత ఏర్పడటంతో మందుల మాఫియా దందాకు తెరలేపింది. ఈ ముఠాలు కరోనా రోగుల అవసరాన్ని అడ్డంపెట్టుకుని విచ్చలవిడిగా దోచుకుంటున్నాయి. కొన్ని ప్రైవేట్‌ ఆస్పత్రులు, మాఫియా ముఠాలతోపాటు కొందరు వైద్యారోగ్యశాఖ అధికారులు, సిబ్బందికి కూడా ఈ దందాలో భాగస్వామ్యం ఉన్నట్టు సమాచారం. డిమాండ్‌ను బట్టి రెమిడిసివిర్‌ను రూ.25 వేల నుంచి రూ.75 వేల వరకు, తుసిలిజుమాబ్‌ను రూ.70 వేల నుంచి రూ.2 లక్షల వరకు విక్రయిస్తున్నారు. ప్రాణాలు కాపాడుకునేందుకు ఎంతైనా ఖర్చుపెట్టేందుకు సిద్ధమనే వారి నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నారు. 

అత్యవసరమైతేనే వాడాలి.. 
రెమిడెసివిర్, తుసిలిజుమాబ్‌ వంటి యాంటీ వైరల్‌ మందులు సాధారణ మార్కెట్లో విక్రయించడం లేదు. అత్యవసర సమయంలో వాడకానికి మాత్రమే వాటికి అనుమతి ఉంది. పైగా ట్రయల్స్‌ జరుగుతున్నాయి. వీటికి కరోనా మరణాలను ఆపగలిగే సామర్థ్యం లేదని, రోగి ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారకుండా కాపాడుతాయని డాక్టర్లు ఇప్పటికే స్పష్టం చేశారు. రక్తంలో ఆక్సిజన్‌ శాచురేషన్‌ 90 శాతం వరకు ఉండి, వెంటిలేటర్‌ లేదా ఆక్సిజన్‌పై చికిత్స చేస్తున్నప్పుడు, ఇన్ఫెక్షన్లు తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రమే రెమిడిసివిర్‌ను వాడాలి. పైగా కరోనా పాజిటివ్‌గా గుర్తించిన మొదటి 9 రోజుల్లోనే ఇవ్వాలి. అప్పుడే రోగి కోలుకునే అవకాశం ఉంటుందని వైద్యారోగ్యశాఖ ప్రకటించింది కూడా. ఇక తుసిలిజుమాబ్‌ను కూడా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న రోగులకు అది కూడా అత్యంత జాగ్రత్తగా వాడాలి. ఇష్టమొచ్చినట్టు వాడితే రోగి పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందన్న హెచ్చరికలు కూడా ఉన్నాయి. కానీ కొందరు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లోని డాక్టర్లు డబ్బుల కోసం ఈ ఔషధాలను విరివిగా వాడేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. 

దళారుల చేతికి ఎలా వస్తున్నాయంటే? 
ప్రైవేట్‌ ఆస్పత్రుల్లోని కరోనా కేసుల వారీగా రాష్ట్ర ఔషధ నియంత్రణ శాఖ ఈ యాంటీ వైరల్‌ ఔషధాలను కేటాయిస్తుంది. రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) ప్రభుత్వ ఆస్పత్రులకు ఇదే పద్ధతిలో సరఫరా చేస్తుంది. ఈ రెండు ప్రభుత్వ సంస్థల ద్వారా మాత్రమే ఈ రెండు ఔషధాలు బయటకు వెళ్లాలి. అయినా ఇవి మాఫియా చేతికి చిక్కుతున్నాయి. దీనిలో కొందరు ప్రభుత్వ ఉద్యోగుల హస్తం ఉందని, వారే దళారులకు ఇచ్చి బ్లాక్‌ మార్కెట్లో విక్రయిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. వైద్యారోగ్యశాఖలో ముఖ్య స్థానంలో ఉన్న కొందరు నల్లబజారును ప్రోత్సహిస్తున్నారన్న ప్రచారం ఉంది. కొందరు అధికారులు తమకు తెలిసిన వారికి ఈ ఔషధాలు ఇచ్చుకుంటున్నారని, దళారుల ద్వారా బ్లాక్‌ మార్కెట్లో అమ్మించి వాటా తీసుకుంటున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. నిజానికి అవసరం ఉన్నా లేకున్నా కూడా కొన్ని ఆస్పత్రులు రోగుల బంధువులపై ఒత్తిడి తెచ్చి ఈ ఔషధాలను తెప్పిస్తున్నాయని.. వాటిని సదరు రోగికి వాడుతున్నారా లేదా కూడా తెలియడం లేదని ఒక ముఖ్య అధికారి పేర్కొనడం గమనార్హం. మరోవైపు ప్రభుత్వ ఆస్పత్రులకు కరోనా రోగులు పెద్దగా రావడం లేదు. వచ్చిన రోగులను బట్టి ఆయా ఆస్పత్రులకు రెమిడిసివిర్‌ను సరఫరా చేస్తున్నారు. కానీ వాటిని రోగులకు వాడేసినట్టు రాసి, బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. 

ఎవరికీ దొరక్కుండా.. 
మాఫియా ముఠాలు హైదరాబాద్‌ సహా జిల్లాల్లో రెమిడెసివిర్, తుసిలిజుమాబ్‌ మందులను అడ్డగోలు రేటుకు విక్రయించే పనిలో పడ్డాయి. ఇందులో ఎవరికీ పట్టుబడకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. ముఠా సభ్యుల ద్వారానే, నగదు తీసుకుని వచ్చినవారికి మాత్రమే విక్రయిస్తున్నారు. కాగా.. అసలు రాష్ట్రంలో రెమిడెసివిర్, తుసిలిజుమాబ్‌ మందుల కొరత ఉన్నప్పుడు.. అసలు అవి ఏ మేర రాష్ట్రానికి వచ్చాయి, వాటిని ఎలా పంపిణీ చేశారన్న విషయాన్ని వైద్యారోగ్యశాఖ బయటికి వెల్లడించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top