Black Fungus: రోగికి  అడ్మిషన్‌ నిరాకరించిన ఈఎన్‌టీ ఆస్పత్రి

Black Fungus: ENT Hospital Not Give Admission Of Black Fungus Patient - Sakshi

సుల్తాన్‌బజార్‌: వరంగల్‌లో కరోనా నుంచి కోలుకున్న ఓ రోగి ‘బ్లాక్‌ ఫంగస్‌’బారిన పడింది. దీంతో హైదరాబాద్‌ లోని ఈఎన్‌టీ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అప్పటికే రోగికి కళ్లు పోయి, ముక్కు నుంచి రక్తస్రావం అవుతోంది. ఈ దశలో చికిత్స చేయకుండా ఆర్టీపీసీఆర్‌ రిపోర్టు లేదన్న కారణంగా ఆస్పత్రిలో అడ్మిషన్‌ నిరాకరించారు. వరంగల్‌కు చెందిన మల్లమ్మ(65)కు గత 20 రోజుల క్రితం కోవిడ్‌ సోకగా వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకుంది. అనంతరం ఆమెకు బ్లాక్‌ ఫంగస్‌ సోకడంతో వైద్యులు హైదరాబాద్‌లోని ఈఎన్‌టీ ఆసుపత్రికి పంపించారు.

సీటీస్కాన్, ఎంఆర్‌ఐ తదితర రిపోర్ట్‌లతో ఆమె మనవడు శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఈఎన్‌టీ ఆసుపత్రికి తీసుకువచ్చాడు. అయితే ఆర్‌టీపీసీఆర్‌ రిపోర్ట్‌ లేదని వైద్యులు అడ్మిషన్‌ నిరాకరించారు. తన అవ్వకు కోవిడ్‌ తగ్గిందని ఆమె మనవడు చెప్పినా ఆస్పత్రిలో చేర్చుకునేందుకు వైద్యులు ఒప్పుకోలేదు. దీంతో మల్లమ్మ కటిక నేలపైనే 19 గంటల పాటు ఆసుపత్రి క్యాజువాలిటీ ముందు వైద్యం కోసం నిరీక్షించాల్సి వచ్చింది.

అవ్వ పరిస్థితి విషమంగా మారిందని.. దయచేసి చేర్చుకోండంటూ ఆమె మనవడు ఎంత బతిమాలినా వినలేదు. చివరకు ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో ఆమెను గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. వివిధ జిల్లాల నుంచి వస్తున్న బ్లాక్‌ ఫంగస్‌ రోగులకు ఆర్టీపీసీఆర్‌ రిపోర్ట్‌ ఇబ్బందిగా మారింది. కోఠి ఈఎన్‌టీ ఆసుపత్రిలో ఉదయం వేళలో కోవిడ్‌ పరీక్షలు చేస్తున్నా సకాలంలో రిపోర్ట్‌లు రావడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పరీక్షలు నిర్వహించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.
చదవండి: Black Fungus: మందులు తక్కువ.. బాధితులెక్కువ..!

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top