
హైదరాబాద్: తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు లీగల్ నోటీసులు పంపించారు. రోహిత్ వేముల ఆత్మహత్యకు సంబంధించిన అంశంపై తనపై వ్యాఖ్యలు చేసిన భట్టి విక్రమార్కపై లీగల్‌గా చర్యలు తీసుకునే క్రమంలో నోటీసులు పంపించారు రామచందర్‌రావు. తన అడ్వకేట్ విజయ్ కాంత్‌తో నోటీసుల పంపించారు రామచందర్‌రావు.
బేషరుతగా మూడు రోజుల్లో భట్టి విక్రమార్క క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మూడు రోజల్లో క్షమాపణ చెప్పని పక్షంలో రూ. 25 కోట్ల పరువు నష్టం దావా వేస్తానని నోటీసుల్లో హెచ్చరించారు. దీనిపై క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని నోటీసుల్లో పేర్కొన్నారు.
కాగా, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచందర్ రావు నియామకాన్ని పునరాలోచన చేయాలని ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. దళితులు, గిరిజనులను వేధించిన వారికి బీజేపీ ఉన్నత పదవులు ఇస్తుందనే దానికి తెలంగాణ అధ్యక్షుడిగా రామచందర్ రావు నియామకమే ఉదాహరణ అంటూ భట్టి విమర్శలు చేశారు.
హెచ్‌సీయూలో రోహిత్ వేముల ఆత్మహత్యకు రామచందర్ రావు కారణమంటూ వ్యాఖ్యానించారు.. ఆయనకు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవితో రివార్డు ఇచ్చారని. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచందర్ రావు నియామకాన్ని పునరాలోచన చేయాలని వ్యాఖ్యానించారు.