ఆసియాలోనే అతిపెద్ద వేదిక.. జీవశాస్త్రాలకు నెపుణ్యపు రెక్కలు | Sakshi
Sakshi News home page

ఆసియాలోనే అతిపెద్ద వేదిక.. జీవశాస్త్రాలకు నెపుణ్యపు రెక్కలు

Published Fri, Feb 24 2023 1:31 AM

Bio Asia 2023 conference at Hyderabad from 24th Feb 2023 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జీవశాస్త్ర, ఆరోగ్య రక్షణ రంగాలకు సంబంధించి ఆసియాలోనే అతిపెద్ద వేదిక.. ‘బయో ఆసియా’20వ వార్షిక సదస్సుకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. ‘బయో ఆసియా 2023’పేరిట, నాణ్యమైన వైద్యం..అందరికీ ఆరోగ్యం లక్ష్యంగా.. శుక్రవారం నుంచి మూడురోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ (హెచ్‌ఐసీసీ) ప్రాంగణంలో ఉదయం 10.30కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు దీనిని ప్రారంభిస్తారు.

‘అడ్వాన్సింగ్‌ ఫర్‌ వన్‌.. షేపింగ్‌ ది నెక్ట్స్‌ జనరేషన్‌ హ్యూమనైజ్డ్‌ హెల్త్‌కేర్‌’అనే నినాదంతో నిర్వహిస్తున్న సదస్సులో ఆరోగ్య రంగాన్ని మరింత మానవీయంగా మార్చడం అనే అంశంపై సుదీర్ఘ చర్చలు, ఉపన్యాసాలు, ప్రదర్శనలు, ప్రజెంటేషన్లు చోటు చేసుకోనున్నాయి. ఆయా రంగాలకు చెందిన శాస్త్రవేత్తలు, పరిశోధకులు, వ్యాపార, వాణిజ్య రంగాలకు చెందిన ప్రముఖులు 70 మందికి పైగా ప్రసంగించనున్నారు.

50కి పైగా దేశాల నుంచి సుమారు 2,500 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యే ఈ సదస్సులో సుమారు 800 కార్పొరేట్‌ సంస్థలు పాల్గొంటున్నాయి. వివిధ దేశాల ప్రతినిధుల మధ్య వేయికి పైగా భాగస్వామ్య సమావేశాలు జరిగేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ప్రతి ఏటా ఇస్తున్న ‘జీనోమ్‌ వ్యాలీ ఎక్స్‌లెన్స్‌’పురస్కారాన్ని ఈసారి ఎంఆర్‌ఎన్‌ఏ టెక్నాలజీపై కృషి చేసిన ప్రొఫెసర్‌ రాబర్ట్‌ లాంగర్‌కు అందజేయనున్నారు.

సదస్సు నిర్వహణలో బ్రిటన్‌ భాగస్వామ్యం వహిస్తుండగా, స్థానిక పార్ట్‌నర్‌గా ప్లాండర్స్‌ వ్యవహరిస్తోంది. ప్రముఖ సంస్థ ‘ఆపిల్‌’తొలిసారిగా బయో ఆసియా సదస్సులో పాల్గొంటోంది. నోవార్టిస్‌ సీఈఓ వాస్‌ నరసింహన్‌ కీలకోపన్యాసం చేస్తారు. ప్లీనరీ టాక్‌లో యూకేకి చెందిన డా.రిచర్డ్‌ హాచెట్‌ ప్రసంగిస్తారు.

5 ఆవిష్కరణలు వివరించనున్న సార్టప్‌లు
జీవ శాస్త్ర (లైఫ్‌ సైన్సెస్‌) రంగం విలువ, ఉద్యోగాల సంఖ్యను వచ్చే ఐదేళ్లలో రెట్టింపు చేయడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం బయో ఆసియా సదస్సును నిర్వహిస్తోంది. 2021 నాటికి హైదరాబాద్‌ సహా తెలంగాణలో లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో పనిచేస్తున్న కంపెనీల నికర విలువ రూ.50 బిలియన్‌ డాలర్లు కాగా.. 2028 నాటికి 100 బిలియన్‌ డాలర్లకు చేర్చేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

ఈ రంగంలో ప్రస్తుతం 4 లక్షలుగా ఉన్న ఉద్యోగుల సంఖ్యను వచ్చే ఐదేళ్లలో రెట్టింపు చేసి 8 లక్షలకు చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కాగా ఈ సదస్సులో బయోటెక్, లైఫ్‌సైన్సెస్‌ విభాగంలో స్టార్టప్‌లకు పోటీలు నిర్వహిస్తున్నారు.

సుమారు 400 స్టార్టప్‌లు బయో ఆసియాలో తమ ఆవిష్కరణలను ప్రదర్శించేందుకు దరఖాస్తు చేసుకోగా ఇందులో 75 స్టార్టప్‌లను ఎంపిక చేశారు. వీటి నుంచి ఐదింటిని ఎంపిక చేసి నగదు పురస్కారం ఇవ్వడంతో పాటు వాటి ఆవిష్కరణలను వివరించేందుకు అవకాశం ఇస్తారు.

ఇప్పటివరకు రూ.25 వేల కోట్ల పెట్టుబడులు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 19 ఏళ్ల క్రితం ప్రారంభమైన బయో ఆసియా సదస్సు రాష్ట్ర విభజన తర్వాత కూడా కొనసాగుతోంది. ఇటీవలి కాలంలో జరిగిన బయో ఆసియా సదస్సుల్లో సత్య నాదెళ్ల వంటి ప్రముఖ కంపెనీల సీఈఓలు, శాస్త్రవేత్తలు, నోబెల్‌ గ్రహీతలు ప్రసంగించగా, 20 వేలకు పైగా భాగస్వామ్య సమావేశాలు జరిగాయి. 250కి పైగా ద్వైపాక్షిక ఒప్పందాలు కుదరగా, రూ.25 వేల కోట్ల పెట్టుబడులు లైఫ్‌ సైన్సెస్, అనుబంధ రంగాల్లోకి వచ్చాయి. 

లైఫ్‌సైన్సెస్‌పై సర్కారు కీలక ప్రకటన!
20వ సదస్సులోనూ ప్రాధాన్యత కలిగిన ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరే అవకాశముందని భావిస్తున్నారు. ఫార్మా సిటీలో లైఫ్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ ఏర్పాటు, లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో యువతకు నైపుణ్య శిక్షణ, మౌలిక వసతుల కల్పన వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశముంది.  

Advertisement

తప్పక చదవండి

Advertisement