నాలుగుగంటలపాటు అఘోరి విచారణ | BIG Twist In Lady Aghori Bail Issue | Sakshi
Sakshi News home page

నాలుగుగంటలపాటు అఘోరి విచారణ

May 3 2025 7:43 AM | Updated on May 3 2025 7:43 AM

BIG Twist In Lady Aghori Bail Issue

ఒకరోజు కస్టడీకి తీసుకున్న మోకిల పోలీసులు  

ప్రగతి రిసార్ట్స్‌లో గంటన్నర పాటు సీన్‌ రికన్‌స్ట్రక్షన్‌ 

కస్టడీ అనంతరం షాద్‌నగర్‌ కోర్టుకు..  

అక్కడి నుంచి చంచల్‌గూడ జైలుకు తరలింపు  

శంకర్‌పల్లి/షాద్‌నగర్‌: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అఘోరి అలియాస్‌ శ్రీనివాస్‌ను శుక్రవారం మోకిల పోలీసులు విచారించారు. మంచిర్యాల జిల్లా, కృష్ణపల్లికి చెందిన అఘోరి శంకర్‌పల్లి మండలం ప్రొద్దుటూరులోని ప్రగతి రిసార్ట్‌లో ఉంటున్న ఓ మహిళా సినీ నిర్మాతను పూజల పేరుతో మోసి చేసి, చంపుతానని బెదిరించి రూ.9.80 లక్షలు వసూలు చేసిన వ్యవహారంలో ఫిబ్రవరి 25న మోకిల పోలీస్‌స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గత నెల 22న అతడిని ఉత్తరప్రదేశ్‌లో అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. 23న చేవెళ్ల జూనియర్‌ ఫస్ట్‌క్లాస్‌ జడ్జి ఎదుట హాజరు పరచగా 14 రోజుల రిమాండ్‌ విధించారు. అప్పటి నుంచి చంచల్‌గూడ జైలులో ఉన్న అఘోరిని మూడు రోజుల కస్టడీకి అనుమతించాలని మోకిల పోలీసులు చేవెళ్ల కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడంతో.. కోర్టు ఒకరోజు కస్టడీకి అనుమతించింది.   

ప్రశ్నల పరంపర.. 
కోర్టు ఒకరోజు మాత్రమే అనుమతి ఇవ్వడంతో అఘోరి పోలీస్‌స్టేషన్‌కు వస్తున్న విషయం, సీన్‌ రీకన్‌స్ట్రక్షన్, రిమాండ్‌ తరలింపు తదితర అంశాలను చివరి నిమిషం వరకు పోలీసులు గోప్యంగా ఉంచారు. మోకిల సీఐ వీరబాబు సుమారు నాలుగు గంటల పాటు అఘోరిని విచారించారు. సదరు మహిళా సినీ నిర్మాత ఎలా పరిచయం అయ్యారు? మొదటిసారి ఎక్కడ కలుసుకున్నారు? ఎన్ని రోజులు వాళ్లతో ఉన్నావు? పూజలు ఎక్కడ చేశారు? ఆమె వద్ద నుంచి ఎన్ని లక్షలు తీసుకున్నావు? తీసుకున్న డబ్బుతో ఏం కొనుగోలు చేశావుŒ ? మిగిలిన డబ్బు ఇప్పుడు ఎక్కడుంది? ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు? నీ వెనకాల ఎవరన్నా ఉండి చేయిస్తున్నారా? అని ప్రశ్నల వర్షం కురిపించారు.  అడిగిన ప్రశ్నలకు అఘోరి ఓపిగ్గా సమాధానం చెబుతూ సహకరించినట్లు పోలీసులు తెలిపారు.  

షాద్‌నగర్‌ కోర్టుకు అఘోరి 
కస్టడీ సమయం ముగిసిన అనంతరం చేవెళ్ల కోర్టులో ప్రవేశపెట్టాల్సి ఉండగా జడ్జి సెలవులో ఉండడటంతో షాద్‌నగర్‌ కోర్టుకు తీసుకొచ్చి జడ్జి ఎదుట హాజరుపరిచారు. అఘోరి తరపు న్యాయవాదులు బెయిల్‌ పిటీషన్‌ దాఖలు చేసి వాదనలు వినిపించారు. బెయిల్‌ పిటీషన్‌ను సోమవారానికి వాయిదా వేసినట్లు అఘోరి తరపు న్యాయవాది కుమార్‌ తెలిపారు. అనంతరం న్యాయమూర్తి ఆదేశాల మేరకు పోలీసులు అఘోరిని చంచల్‌గూడ జైలుకి తరలించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement