పోస్టులు పంచుకున్న టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు.. ఒక్కో పోస్టు రూ.50 వేలు?

Bhuvanagiri Municipality Outsourcing Jobs Political Parties Internal Deal - Sakshi

రాజకీయ పార్టీల వారీగా అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు

టీఆర్‌ఎస్‌కు 18, బీజేపీ, కాంగ్రెస్‌లు  ఐదు చొప్పున పంపకం

ఒక్కో పోస్టుకు రూ.50 వేలు.. విషయం బయటకు పొక్కడంతో హడావుడిగా ప్రకటన విడుదల

సాక్షి, యాదాద్రి: టీఆర్‌ఎస్‌ 18, బీజేపీ 5, కాంగ్రెస్‌ 5 ఇవేవో ఎన్నికల ఫలితాలు అనుకుంటే పొరపాటే.. భువనగిరి మున్సిపాలిటీలో అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో నియమించనున్న పారిశుద్ధ్య సిబ్బంది ఉద్యోగాలను ఆయా పార్టీలు పంచుకున్నాయి. నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు పొరుగుసేవల ఉద్యోగుల భర్తీ కోసం ఒక్కటయ్యారు.

అధికార పార్టీకి ఉన్న 18 మంది కౌన్సిలర్లు ఒక్కొక్కరు చొప్పున, బీజేపీ, కాంగ్రెస్‌లు కౌన్సిలర్లతో సంబంధం లేకుండా ఐదుగురు చొప్పున తమకు నచ్చిన వారిని నియమించుకోవాలని అంతర్గత ఒప్పందం చేసుకున్నారు. అయితే ఇందులో కొందరు కౌన్సిలర్లు ఉద్యోగాలు పెట్టిస్తామని సదరు నిరుద్యోగుల వద్ద డబ్బులు వసూలు చేసిన విషయం బయటకు పొక్కడంతో సోమవారం హడావుడిగా ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్‌ జారీ చేశారు. 

చేయాల్సిన పనులు: మున్సిపాలిటీలో రోడ్లు ఊడ్చడం, డ్రెయినేజీలను శుభ్రం చేయుట, చెత్త సేకరణ ఇతరత్రా పారిశుద్ధ్య పనులు చేయడానికి అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన 9 మంది మహిళలు,  19 మంది పురుషులు  మొ త్తం 28  మందిని నియమించుకోవాలని ఇటీవల ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అర్హత కలిగినవారు ధరఖాస్తు చేసుకోవా లని  ఉపాధి కల్పన అధికారి  శాంతిశ్రీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
(చదవండి: వీళ్లు మనుషులేనా.. ప్రేమ పెళ్లి చేసుకుందని.. కూతురుని కిడ్నాప్‌ చేసి గుండుకొట్టించి)

నియామక ప్రకటన ఇదీ
పారిశుద్ధ్య పోస్టుల్లో నియామకం కోసం ఎలాంటి విద్యార్హతలు అవసరం లేదు. 21 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వయస్సున్నవారు అర్హులు. అనుభవం అవసరం లేదు. అరోగ్యవంతులై ఉండాలి. అభ్యర్థులు భువనగిరికి చెందిన వారే అర్హులు. నెలకు రూ.15,600 పారి తోషకం చెల్లిస్తారు. అభ్యర్థులు  తమ దరఖాస్తులను ఉపాధి కల్పనాధికారి కార్యాలయం, కలెక్టరేట్‌లోని తెలంగాణ ఎంప్లాయిమెంట్‌ అసిస్టెంట్‌ మిషన్‌ (టీమ్‌) ఆఫీస్‌లో ఈనెల 23వ తేదీ సాయంత్రం 5 లోపు అందజేయాలి. 

బయటకు పొక్కకుండా జాగ్రత్తలు
మున్సిపాలిటీలో పొరుగు సేవల ఉద్యోగం ఇప్పిస్తామని కొందరు కౌన్సిలర్లు ఇప్పటికే డబ్బుల వసూళ్లు ప్రారంభించారు. 28 పోస్టులను పార్టీల వారీగా పంచుకున్న వెంటనే కొందరు కౌన్సిలర్లు  అశావహుల నుంచి రూ.50 వేల వరకు డిమాండ్‌ చేసినట్లు సమాచారం. అయితే ఈ విషయం బయటకు పొక్కనీయకుండా  జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరో పక్క ఉద్యోగాల కోసం వసూళ్లు అంటూ ప్రచారం జరగడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమై సోమవారం నోటిఫికేషన్‌ జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.  
(చదవండి: ఆ విద్యార్థులకే నిజాం కాలేజీ కొత్త హాస్టల్‌: మంత్రి సబితా)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top