
ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు అమ్ముకొంటున్న దళారులు
పెద్ద దేవాలయాల్లో భారీ దందా
శానిటేషన్‌కు వారే.. ప్రసాదాల తయారీకి వారే
వీలునుబట్టి సిబ్బందిని అటూ ఇటూ మారుస్తున్న ఏజెన్సీల ప్రతినిధులు
ప్రసాదాల తయారీలో పరిశుభ్రత లోపిస్తోందన్న ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: దేవాదాయ శాఖ పరిధిలోని పలు పెద్ద దేవాలయాల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు అంగడి సరుకుగా మారాయి. రేటుగట్టి మరీ అమ్మేసుకుంటున్నారు. ఆయా దేవాలయాలకు ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని సరఫరా చేసే ఏజెన్సీల ప్రతినిధులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. శానిటేషన్, ప్రసాదాల తయారీ, ప్రసాద విక్రయ కౌంటర్లు, గోశాలల నిర్వహణ, క్యూలైన్ల పర్యవేక్షణ.. ఇలా పలు రకాల పనుల కోసం దేవాదాయశాఖ ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో సిబ్బందిని తీసుకుంటోంది. నేరుగా ఆ బాధ్యతను తనే నిర్వహించకుండా జిల్లా కలెక్టర్ల ద్వారా టెండర్ పద్ధతిలో మ్యాన్‌పవర్ సప్లయింగ్ సంస్థలకు కట్టబెట్టి చేతులు దులుపుకొంటోంది.
ఆ ఏజెన్సీలు సిబ్బందిని నియమించే విషయంపై అధికారులు దృష్టి సారించకపోవటంతో అంతా అస్తవ్యస్తంగా తయారైంది. దేవాలయాల వారీగా ఈ వ్యవహారాన్ని పర్యవేక్షించేందుకు ఆయా ఏజెన్సీలు కొందరు ప్రతినిధులను నియమిస్తున్నాయి. ఆ ప్రతినిధులు కూడా ఔట్‌సోర్సింగ్ ఖాతాలోనే నియమితులవుతూ నెలవారీ జీతాన్ని పొందుతున్నారు. కానీ, వారిలో చాలామంది అసలు దందా మాత్రం..పోస్టులను బేరానికి పెట్టి డబ్బులు వసూలు చేయటమే.
ప్రసాద తయారీ కౌంటర్ పోస్టు కావాలంటే 2.25 లక్షలు, ప్రసాద తయారీ పోస్టు అయితే రూ.2 లక్షలు, శానిటేషన్ విభాగంలో అయితే రూ.1.80 లక్షలు.. ఇలా ధరల పట్టిక తయారు చేసి వసూళ్లకు దిగుతున్నారు. ఆ మొత్తం చెల్లించేందుకు సిద్ధమైన వారిని పిలిచి మాట్లాడి ఉద్యోగాలు కేటాయిస్తున్నారు. అదంతా ఏజెన్సీలకు సంబంధించిన వ్యవహారం కావటంతో దేవాదాయశాఖ అధికారులు పట్టించుకోవటం లేదు.
ఇటీవల కొన్ని దేవాలయాలకు సంబంధించి ఏజెన్సీ ప్రతినిధులు, నిరుద్యోగుల మధ్య సాగిన బేరసారాలకు సంబంధించిన ఫోన్‌కాల్ రికార్డులు వెలుగులోకి రావటంతో మరోసారి ఈ అంశం పెద్ద చర్చకు దారితీసింది. పెద్ద దేవాలయాలకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో..అక్కడ సేవలను విస్తరిస్తున్నారు. ఈ క్రమంలో సిబ్బంది అవసరం పెరుగుతోంది. ప్రస్తుతం దేవాదాయశాఖలో నియామకాలు లేనందున, అవసరమైన సిబ్బందిని ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో తీసుకుంటున్నారు. ఫలితంగా అన్ని పెద్ద దేవాలయాల్లో వీరి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.
ప్రసాదాల తయారీపై ఏదీ శ్రద్ధ..
దేవాలయాల్లో ప్రసాదాల విక్రయానికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. దర్శన అనంతరం ప్రసాదం స్వీకరించడం భక్తులు తప్పనిసరి అని భావిస్తారు. తినే పదార్థాలు అయినందున ప్రసాదాల తయారీలో పరిశుభ్రత చర్యలు అత్యవసరం. కానీ, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది నియామకంలో నిర్వాహకులు దీనిని పట్టించుకోవటం లేదు. శానిటేషన్ విధుల్లో ఉండే సిబ్బందిని ఇటు ప్రసాదాల తయారీకి పురమాయిస్తున్నారు. ప్రసాదాల తయారీ సమయంలో తలపై క్యాప్ (జుట్టు రాలిపడకుండా), చేతులకు గ్లౌవ్స్ ధరించటంతోపాటు చేతి గోళ్లు పెరిగి ఉండకూడదని, రోజూ పరిశుభ్రమైన వ్రస్తాలు ధరించాలనే నిబంధనలుంటాయి.
కానీ, సిబ్బందిని సర్దుబాటు చేసే క్రమంలో గోశాలల్లో పేడ ఎత్తే విధుల్లో ఉండేవారిని ప్రసాదాల తయారీకి మారుస్తున్నారు. వారి చేతి గోళ్లలో పేడ ఇరుక్కొని ఉంటే ప్రసాదం కలుషితమయ్యే ప్రమాదం ఉంటుందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శానిటేషన్ విధుల్లో ఉండే వారిని ప్రసాదాల తయారీ, ప్రసాదాల కౌంటర్లకు ఎలా మారుస్తారని ప్రశ్నిస్తున్నారు. విధుల్లోకి ఎంపిక చేసే వారికి సంబంధించి ఆయా ప్రాంతాల్లో కచ్చితంగా విచారణ జరపాలన్న నిబంధన అపహాస్యమవుతోంది. ఆ వ్యక్తి ఎలాంటి వాడో వాకబు చేయకుండానే దేవాలయాల్లో కీలక బాధ్యత అప్పగిస్తున్నారు. ఈ క్రమంలో అన్యమతస్తులు కూడా దేవాలయ విధుల్లోకి వస్తున్నారని, ఇది భక్తుల మనోభావాలు దెబ్బతినే పరిస్థితికి వెళుతున్నాయన్న ఆరోపణలున్నాయి.