వనరులను బాధ్యతాయుతంగా నిర్వహిస్తున్నాం
పరిశ్రమలు స్వచ్ఛమైన ఇంధనాన్నే వాడాలి
గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్‌లో భట్టి విక్రమార్క
సాక్షి, హైదరాబాద్: కేవలం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా పర్యావ రణ పరిరక్షణ, సామాజిక ప్ర యోజనాలను జోడించి తెలంగాణ ఏఐ ప్రమాణా లకు దిక్సూచిగా నిలుస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్‌ను పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ఆయన మంగళవారం ప్రారంభించారు.
‘ఏఐ అంటే కేవలం క్లౌడ్ కంప్యూటింగ్, సర్వర్లు మాత్రమే కాదు. దీని వెనుక విద్యుత్, నీరు, భూమి, మానవ వనరుల భాగస్వామ్యం ఉంటుందని ప్రభుత్వం గుర్తించింది. నీరు, విద్యుత్తును హరిస్తూ ఏఐని నిర్మించడం కాకుండా, పునరుత్పాదక ఇంధనం, వనరులను బాధ్యతాయుతంగా నిర్వహి స్తున్నాం’ అని భట్టి తెలిపారు. పెట్టుబడులను ఆహ్వా నించడంలో తెలంగాణ దూకుడుగా ఉన్నప్పటికీ, అది పర్యావరణానికి, స్థానిక ప్రజలకు మేలు చేసేలా ఉండాలని అన్నారు.
కంపెనీలు ఉద్గారాలు తగ్గించాలి
పరిశ్రమలు స్వచ్ఛమైన ఇంధనాన్ని వాడాలని, రీసైకిల్ చేసిన నీటిని మాత్రమే వినియోగించాలని భట్టి పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా కార్బన్ క్రెడిట్స్ గురించి చర్చిస్తున్న సమయంలో, తెలంగాణ ’పీపుల్స్ క్రెడిట్’ అనే కొత్త భావన తెరపైకి తెచ్చిందన్నారు. ఏఐ పెట్టుబడులు కేవలం డేటా సెంటర్లకే పరిమితం కాకుండా, స్థానిక ఉపాధిని పెంపొందించడం, గ్రామీణ యువతకు నైపుణ్యాలను అందించడం వంటి అంశాలకు ప్రాధాన్యతనివ్వాలని చెప్పారు. పెట్టుబడులు రావాలి, కానీ అవి స్వచ్ఛమైన ఇంధనంతో, పారదర్శకతతో, ప్రజల పట్ల గౌరవంతో రావాలని స్పష్టం చేశారు. కంపెనీలు ఉద్గారాలను తగ్గించడమే కాకుండా, స్థానిక మేధో సంపత్తిని మెరుగుపరిచే బాధ్యత తీసుకోవాలని అన్నారు.
సాగు నీటితో పోటీ వద్దు
వ్యవసాయానికి, సామాన్యులకు దక్కాల్సిన నీటితో సాంకేతికత ఎప్పుడూ పోటీ పడకూడదని భట్టి విక్రమార్క నొక్కి చెప్పారు. నీటి వినియోగంలో అత్యంత బాధ్యతాయుతమైన విధానాలను అనుసరించే ఏఐ వ్యవస్థలకే తెలంగాణ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఏఐ సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండాలని, భాషా అడ్డంకులను తొలగించి, మహబూబాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు ఉన్న గ్రామీణ యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వివరించారు. తెలంగాణ అంటే కేవలం డేటా సెంటర్ల కేంద్రం మాత్రమే కాదు. ఆ డేటా సెంటర్లు ఎలా నిర్మించాలో ప్రపంచానికి నేర్పే ’రోల్ మోడల్’ అని తెలిపారు.
తాడిచర్ల–2 గని కేటాయింపుపై భట్టి హర్షం
సాక్షి, హైదరాబాద్: తాడిచర్ల–2 బొగ్గు గని కేటాయింపు నిర్ణయం పట్ల కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్‌రెడ్డికి రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క కృతజ్ఞతలు తెలిపారు. తాడిచర్ల –2 బ్లాక్‌ను సింగరేణికి కేటాయించాలని కోరుతూ మార్చి 7, 2024న అప్పటి కేంద్ర బొగ్గు, గనుల శాఖను తాను కోరినట్టు తెలిపారు. మంత్రి కిషన్‌రెడ్డికి కూడా తాను ఈ విషయమై విజ్ఞప్తి చేశానని తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో అనుమతులు సాధించకుండా మూలనపడిన ఒడిశా నైనీ బొగ్గు బ్లాకు తమ ప్రత్యేక చొరవతో పూర్తి అనుమతులు సాధించామని, అక్కడకు వెళ్లి స్థానికులను ఒప్పించి బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించామన్నారు. ఇప్పుడు తాడిచర్ల–2 బ్లాక్‌ను కూడా సాధించామని చెప్పారు. స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి న్యూఢిల్లీలో దేశ ప్రధానిని కలిసి తాడిచర్ల బ్లాక్, ఇతర బొగ్గు బ్లాక్‌లను సింగరేణికి కేటాయించాలని కోరినట్టు భట్టి గుర్తు చేశారు.


