
విద్యార్థులకు కార్పొరేట్ ఆస్పత్రుల ద్వారా వైద్యం
హాస్టళ్లను సందర్శించే క్యాలెండర్ రూపొందించండి
సమీక్షలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి హెల్త్‌కార్డులు సిద్ధం చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు, జిల్లా మెడికల్, హెల్త్ అధికారులను సమన్వయం చేసుకొని హెల్త్‌కార్డులను వేగంగా సిద్ధం చేయాలని సూచించారు.
మంగళవారం ప్రజాభవన్‌లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో కలిసి సంక్షేమ హాస్టళ్లపై భట్టి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు ఏదైనా అనారోగ్య సమస్య వస్తే ఆన్‌లైన్ ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు కార్పొరేట్ ఆస్పత్రులు సిద్ధంగా ఉన్నాయని, వారి సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
హాస్టళ్ల సందర్శనపై లెక్కలుండాలి
సంక్షేమ హాస్టళ్లను అధికారులు, ప్రజాప్రతినిధులు విధిగా సందర్శించాలని.. అందుకోసం పకడ్బందీ క్యాలెండర్ రూపొందించాలని భట్టి విక్రమార్క ఆదేశించారు. ఏ అధికారి, ఏ రోజు హాస్టల్‌ను సందర్శించారు? హాస్టల్‌లో వారు పరిశీలించిన అంశాలేమిటి అన్నదానిపై నివేదికలు రూపొందించాలని సూచించారు. మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలను సైతం హాస్టళ్ల సందర్శనకు ఆహ్వానించాలని కోరారు. హాస్టళ్లు ఉన్న అద్దె భవనాల్లో వసతులు ఎలా ఉన్నాయి? ఆయా భవనాల యజమానులెవరు? అనే వివరాలతో నివేదిక రూపొందించాలని సూచించారు. అన్ని వసతి గృహాల్లో దోమతెరలు ఏర్పాటు చేయాలని తెలిపారు.
రెసిడెన్షియల్ పాఠశాలల భవనాలన్నిటిపై సోలార్ ప్యానల్స్ ఏర్పాటుచేసి విద్యుత్ అవసరాలు తీర్చుకునేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులకు తెలిపారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిని, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ క్షితిజ, మైనార్టీ వెల్ఫేర్ శాఖ కమిషనర్ షఫీ, బీసీ గురుకుల సెక్రటరీ సైదులు, ఎస్టీ గురుకుల సెక్రటరీ సీతాలక్ష్మి, గిరిజన వెల్ఫేర్ అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ శాఖ ఆధునిక టెక్నాలజీ వాడాలి
విద్యుత్ వినియోగదారుల అవసరాలు తీర్చేందుకు ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకోవాలని విద్యుత్ ఉన్న తాధికారులకు భట్టి విక్రమార్క సూచించారు. ప్రజాభవన్ లో ఆయన దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్) సీఎండీ ముషారఫ్, డైరెక్టర్లతో మంగళవారం సమావేశమయ్యారు. ఎస్పీడీసీఎల్ పరిధిలో 6,500 ఫీడర్లు ఉండగా, 5,500 ఫీడర్ల పరిధిలో ఔటర్ మేనేజ్‌మెంట్ సిస్టం అమలులోకి తెచి్చనట్లు అధికారులు వివరించారు. దీంతో మిగతా వాటి పరిధిలోనూ తేవాలని భట్టి సూచించారు.
మెరుగైన సేవలందించి ఐఎస్‌ఓ 9000 సర్టిఫికెట్ పొందిన డిస్కంను అభినందించారు. విద్యుత్ సిబ్బంది కోసం రూపొందించిన ప్రత్యేక డ్రెస్ కోడ్‌ను ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు. సమావేశంలో ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ తదితరులు పాల్గొన్నారు.