హైదరాబాద్‌లో అమలుకు చర్యలు షురూ
డ్రైవర్ల ఎన్‌రోల్‌మెంట్ మొదలు.. ఇప్పటికే 15 వేల మంది చేరిక...
డైనమిక్ ఫేర్ బదులు స్థిరమైన చార్జీలు
రాత్రి 11 నుంచి ఉదయం 6 వరకు 50 శాతం అదనపు చార్జి... చార్జి మొత్తం డ్రైవర్లకే... కొన్ని నెలల తర్వాత నామమాత్రపు కమీషన్ కోత
సాక్షి, హైదరాబాద్: క్యాబ్ బుక్ చేద్దామంటే ఒకసారి ఒకలా.. మరోసారి మరోలా కనిపించే చార్జీలు..టిప్ ఓకే చేస్తేనే వేగంగా బుక్ అయ్యేలా అల్గారిథమ్ మాయాజాలం... వర్షం కురిస్తే, పీక్ అవర్స్‌లో ఒక్కసారిగా పెరిగే డైనమిక్ ఫేర్‌లతో ప్రయాణికుల జేబులకు చిల్లు పెడుతున్న పలు రవాణా అగ్రిగేటర్లకు సవాల్ విసురుతూ ‘భారత్ ట్యాక్సీ’హైదరాబాద్‌లో ప్రారంభం కాబోతోంది. నవంబరు నెలాఖరుకు దీన్ని ప్రారంభించే యోచనలో నిర్వాహకులున్నారు.
నగరంలో క్యాబ్, ఆటో డ్రైవర్ల ఎన్‌రోల్‌మెంట్ ప్రక్రియ కూడా జరుగుతోంది. ఇప్పటికే 15 వేల మంది డ్రైవర్లు పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ నెలాఖరునాటికి లక్షన్నర మంది చేరతారని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి క్యాబ్‌లు, ఆటోలను తిప్పనున్నారు. రాష్ట్రంలో అగ్రిగేటర్ పాలసీ రూపొందించిన తర్వాత, టూ వీలర్ ట్యాక్సీ విషయంలో నిర్ణయం తీసుకోనున్నారు.
పీక్ అవర్‌లోనూ స్థిరమైన చార్జీ
డైనమిక్ ఫేర్ విధానం కాకుండా, ప్రభుత్వ నియంత్రణలో ఖరారయ్యే చార్జీలు అమలులో ఉంటాయి. గతంలో రవాణా శాఖ ఆటోల కోసం చార్జీలు ఖరారు చేసి అమలు చేసిన తరహాలోనే ఇది కొనసాగనుంది. అప్పట్లో ఆటోలకు రాత్రి 11 వరకు మీటర్ చార్జీ, రాత్రి 11 నుంచి ఉదయం 6 వరకు 50 శాతం అదనపు చార్జీ విధానం ఉండేది. ఇప్పుడు అదే తరహాలో భారత్ ట్యాక్సీ క్యాబ్‌లు, ఆటోలకు కూడా చార్జీల విధానం ఉంటుందని సమాచారం. రాష్ట్రంలో అగ్రిగేటర్ పాలసీ రూపొందిన తర్వాత ఈ విధానం ఉంటుంది. అప్పటి వరకు, క్యాబ్, ఆటో డ్రైవర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేసి చార్జీలను తాత్కాలికంగా నిర్ధారించి అమలు చేస్తారు.
మొత్తం చార్జి డ్రైవర్లకే...
ప్రసుత్తం అగ్రిగేటర్‌లు ప్రతి రైడ్ నుంచి నిర్ధారిత మొత్తాన్ని కమీషన్‌గా తీసుకుంటున్నారు. మిగతాది డ్రైవర్లకు చెల్లిస్తున్నారు. కానీ, భారత్ ట్యాక్సీలో చార్జి మొత్తం డ్రైవర్‌కే చెందుతుంది. కొన్ని నెలల పాటు ఈ విధానం కొనసాగిన తర్వాత, ఒక్కో రైడ్ నుంచి రూ.20 (ఖరారు కావాల్సి ఉంది) నామమాత్రపు మొత్తాన్ని నిర్వహణ ఖర్చులకు డ్రైవర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఆ మొత్తాన్ని నిధిగా మార్చి ఈ వ్యవస్థ నిర్వహణకు వినియోగిస్తారు.
డ్రైవర్లే యజమానులు
భారత్ ట్యాక్సీని కేవలం మరో క్యాబ్ యాప్‌గా కాకుండా, సహకార సూత్రాలపై పనిచేసే డిజిటల్ మొబిలిటీ వేదికగా అమలు కానుంది. డ్రైవర్లను సహకార సంస్థలో సభ్యులు, యజమానులుగా భాగస్వామ్యం చేయడం దీని ప్రత్యేకత. 2026 ఫిబ్రవరి 5న కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా భారత్ ట్యాక్సీని అధికారికంగా ప్రారంభించారు.
ఒక్క రైడ్‌కు వెళ్లినా రూ.5 లక్షల ప్రమాద బీమా
హైదరాబాద్‌లో చేరే డ్రైవర్లకు రోజులో కనీసం ఒక రైడ్ పూర్తి చేసినా రూ.5 లక్షల బీమా రక్షణ వర్తించనుంది. ఒకే సమయంలో భారత్ ట్యాక్సీతోపాటు ఇతర అగ్రిగేటర్ యాప్‌లను కూడా కొనసాగించే వెసులుబాటు ఇస్తున్నారు. ఏ యాప్ ఆధారంగా రైడ్ చేసినా బీమా వర్తించేలా చర్యలు తీసుకుంటున్నారు.
నగరంలో ఏ మేరకు ఆదరణ?
ఐటీ కారిడార్లు, విమానాశ్రయం, రైల్వే స్టేషన్లు, వ్యాపార ప్రాంతాల్లో యాప్ ఆధారిత ప్రయాణాలకు హైదరాబాద్‌లో గణనీయమైన డిమాండ్ ఉంది. పీక్ అవర్‌లో ధరలు పెరగడం, డ్రైవర్లకు వచ్చే నికర ఆదాయం, రైడ్ రద్దులు వంటి అంశాలపై ప్రయాణికులు, డ్రైవర్లు తరచూ అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో స్థిరమైన చార్జీలు, కమీషన్ కోతల్లేని ఆదాయం, బీమా వంటి ప్రయోజనాలు భారత్ ట్యాక్సీకి ఆకర్షణగా మారొచ్చు.


