భార్య ఫుల్‌ సపోర్ట్‌తో భర్త చోరీలు

Auto Driver Turns As A Thief In Rangareddy District - Sakshi

భార్య అండతో ఆటో డ్రైవర్‌ చోరీలు

జైలుకు వెళ్లినా మారని తీరు   

జల్సా జీవితం కోసం దొంగతనాలు 

కేసు వివరాలు వెల్లడించిన డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌  

అనుమానాస్పద వ్యక్తి అరెస్టుతో గుట్టురట్టు  

రూ. 12.45 లక్షల విలువైన నగలు స్వాధీనం  

నిందితుడిపై పీడీ యాక్టు  

యాచారం: జల్సాలకు అలవాటుపడిన ఓ వ్యక్తి తన భార్య సహకారంతో చోరీల బాటపట్టాడు. జైలుకు వెళ్లివచ్చినా అతడి తీరు మారలేదు. మండల కేంద్రంలో అనుమానాస్పదంగా తిరు గుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేయగా గుట్టురట్టయింది. శనివారం యాచారం ఠాణాలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎల్బీనగర్‌ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌ కేసు వివరాలను ఇబ్రహీంపట్నం ఏసీపీ యాదగిరిరెడ్డి, సీఐ లింగయ్యతో కలిసి వెల్లడించారు. సులువుగా డబ్బు సంపాదించేందుకు కడ్తాల్‌ మండలం మైసిగండి తండాకు చెందిన సభావత్‌ పాండు, గుజ్రి దంపతులు కొంతకాలంగా నగరంలోని చంపాపేట్‌ మారుతీనగర్‌లో నివాసముంటున్నారు.

వృత్తిరీత్యా ఆటో డ్రైవరైన పాండు చోరీలను ప్రవృత్తిగా మార్చుకున్నాడు. సులువుగా డబ్బు సంపాదించేందుకు చోరీలబాటపట్టాడు. నాగార్జునసాగర్‌–హైదరాబాద్‌ రహదారిపై చౌదర్‌పల్లి గేట్‌ వద్ద అతడు శుక్రవారం అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు గమనించి అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. అతడు జిల్లాలోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడినట్లు గుర్తించి అతడి నుంచి రూ. 12.45 లక్షల విలువచేసే బంగారు, వెండి నగలతోపాటు రూ. 30 నగదు, ఒక టీవీని స్వాధీనం చేసుకున్నారు.  

చోరీల చిట్టా ఇదీ..  
వృత్తిరీత్యా ఆటో డ్రైవర్‌ అయిన పాండు 2001లో ఆమనగల్లులో రెండు చోరీలు, 2009లో వనస్థలిపురంలో రెండు చోరీలు, 2012లో మళ్లీ ఆమనగల్లులో రెండు చోరీలు, 2014లో యాచారం మండల కేంద్రంలో ఒక చోరీ, 2018లో మరోమారు, 2020లో కంచన్‌బాగ్, కందుకూరులో మరో రెండు చోరీలకు ప్పాడ్డాడు. పలు చోరీల్లో అరెస్టు అయి జైలుకు వెళ్లి వచ్చినా పాండు తీరు మారలేదు.   

భార్య పూర్తి సహకారం... 
జల్సాలకు అలవాటుపడిన పాండుకు చోరీల్లో అతని భార్య గుజ్రి పూర్తి సహకారం అందిస్తూ వచ్చింది. నగలను విక్రయించి ఆమె భర్తకు డబ్బు లు ఇచ్చేది. అదేవిధంగా కొట్టేసిన బంగారు నగలను కొనుగోలు చేస్తూ శాలిబండలోని శాంతిలాల్‌ జ్యువెలర్స్‌ యజమాని ఉత్తమచంద్‌ కోటరీ, చంపాపేట్‌లోలోని నంది జ్యువెలర్స్‌ యజమాని ప్రకాశ్‌చౌదరి కూడా పాండుకు సహకరించారని పోలీసుల విచా రణలో తెలిసింది. పాండును అరెస్టు చేసి శనివారం రిమాండ్‌కు పంపించగా.. చోరీలకు సహకరించిన అతడి భా ర్య గుజ్రితో పాటు వ్యాపారులు ఉత్తమచంద్‌ కోటరీ, ప్రకాశ్‌చౌదరిపైనా కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం వీరు ముగ్గురు పరారీలో ఉన్నట్లు సీఐ లింగయ్య తెలిపారు. నిందితుడిపై పీడీ యాక్టు ప్రయోగించినట్లు డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎస్‌ఐ ప్రభాకర్, సిబ్బంది ఉన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top