Ashada Masam 2022: ఆషాఢమాసం ఆరంభం.. శుభముహూర్తాలకు బ్రేక్‌.. అప్పటి వరకు ఆగాల్సిందే!

Auspicious Occasion Wedding Stopped As Ashada Masam Starts - Sakshi

మళ్లీ ఆగస్టు 3 నుంచి శుభగడియలు

సాక్షి, కరీంనగర్‌: మూఢాలు వచ్చేశాయి.. శుభ మహూర్తాలకు బ్రేక్‌ పడింది. మంగళవారం నుంచి ఆషాఢమాసం ప్రవేశించడంతో ముహూర్తాలు లేవు. మూడు నెలలుగా జిల్లాలో కొనుగోలు దారులతో కళకళలాడిన పెళ్లి సామగ్రి దుకాణాలు బోసిపోనున్నాయి. పెళ్లి మండపాలు, ప్రింటింగ్‌ప్రెస్‌లు, ఈవెంట్‌ ఆర్గనైజర్లు, వంటవారు, భజాభజంత్రీలు, నాదస్వరం, పురోహితులు నెల రోజుల పాటు ఆగస్టు 3వ తేదీ వరకు వేచి ఉండాల్సిందే.

వ్యాపార వర్గాల్లో గుబులు
ఆషాఢ మాసంతో శుభముహూర్తాలు లేక తమ వ్యాపారాలు ఎలా సాగుతాయోనని వ్యాపారవర్గాల్లో గుబులు పట్టుకుంది. వానాకాలం రైతుల సీజన్‌ కూడా కావడంతో రైతులు పొలం పనుల్లో ఉండి తమ అవసరాలను వాయిదా వేసుకుంటారని, అత్యవసరమైతే అది కూడా నిత్యావసరలకే తప్పా అనవసరంగా ఏమి కొనుగోలు చేయరని వ్యాపార వర్గాలు వాపోతున్నాయి.

నెల రోజులు ఉపాధి బంద్‌
పెళ్లిళ్లు, ఇతర శుభకార్యక్రమాలపై ఆధారపడిన వారు ఆందోళన చెందుతున్నారు. పెళ్లిళ్ల సీజన్‌లో సంపాదించుకున్న వాటిలో నుంచే నిత్యావసరాలకు ఖర్చు చేయాల్సిందేనని వాపోతున్నారు. 
చదవండి: Hyderabad: అజయ్‌తో పరిచయం.. సహజీవనం ముసుగులో చిన్నారుల కిడ్నాప్‌ 

ఆగస్టు 3 నుంచి ముహూర్తాలు
ఆషాఢ మాసంతో జూలైలో ముహూర్తాలు లేవు. తిరిగి ఆగస్టు 3 నుంచి శుభముహూర్తాలున్నాయి. అవి కూడా కేవలం 10 రోజులే. తర్వాత సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్‌ నెలల్లో శుక్రమూఢం ఉంటుంది. ఈ మూడు నెలలు శుభముహూర్తాలు ఉండవు. మళ్లీ డిసెంబర్‌లో 10 మంచి రోజులు తర్వాత ధనుర్మాసం ప్రారంభమవుతుంది.
– పవనకృష్ణశర్మ, ప్రధానార్చకులు, దుర్గాభవానీ ఆలయం, నగునూర్, కరీంనగర్‌

ఉపాధి ఉండదు
శుభకార్యక్రమాలపై ఆధారపడ్డ వారికి ఆషాఢంలో ఉపాధి ఉండదు. మొన్నటి వరకు జరిగిన శుభకార్యక్రమాల్లో అంతో ఇంతో సంపాదించుకుంటే వాటి నుంచి అత్యవసరాలకు ఖర్చు చేసుకుని ముహూర్తాల కోసం వేచి ఉండాలి. 
– గోగుల ప్రసాద్, ఈవెంట్‌ ఆర్గనైజర్, కరీంనగర్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top