Hyderabad: అజయ్‌తో పరిచయం.. సహజీవనం ముసుగులో ఇద్దరు చిన్నారుల కిడ్నాప్‌ 

Hyderabad: Man Kidnapped Woman Childrens In The Name Of Live In Relationship - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మహిళతో సహజీవనం చేస్తున్న ఓ వ్యక్తి ఆమె ఇద్దరు పిల్లలను ఎత్తుకెళ్లిన సంఘటన పహాడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై కె.మధుసూదన్‌ కథనం ప్రకారం.. బిహార్‌ రాష్ట్రానికి చెందిన లీలం యాదవ్‌ భర్త జితేందర్‌ యాదవ్‌ ఏడాది క్రితం మృతి చెందగా ముగ్గురు పిల్లలతో కలిసి హైదరాబాద్‌లో కూలీనాలీ చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో ఏడు నెలల క్రితం బిహార్‌కే చెందిన అజయ్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి సహజీవనం చేయసాగారు.

రెండు నెలల క్రితం వీరు జల్‌పల్లి శ్రీరాం కాలనీలోకి మకాం మార్చగా.. లీలం యాదవ్‌ స్థానికంగా ఉన్న ఓ కంపెనీలో పని చేస్తోంది. ఆదివారం సాయంత్రం ఆమె ఇంట్లో పని చేస్తుండగా ఆమె కుమార్తె ప్రీతి (2.5 సంవత్సరాలు), కుమారుడు రితేష్‌ (16 నెలలు) ఇంటి ముందు ఆడుకుంటున్నారు. ఆ సమయంలో తాగిన మైకంలో ఇంటికి వచ్చిన అజయ్‌ లీలంతో గొడవపడి చేయిచేసుకున్నాడు. అనంతరం ఇద్దరు పిల్లలను తీసుకొని వెళ్లిపోయాడు. కొద్ది సేపటి అనంతరం గమనించిన ఆమె స్థానికంగా వెతికినా లాభం లేకపోవడంతో సోమవారం పహాడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.  
చదవండి: కుల పంచాయితీలో మహిళపై దాడి.. నిండు ప్రాణం తీసిన వాట్సాప్‌ ప్రచారం

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top