ప్రకృతి నియమాలతో పనిచేసే 'ఏఐ'! | Artificial intelligence predicts climate change | Sakshi
Sakshi News home page

ప్రకృతి నియమాలతో పనిచేసే 'ఏఐ'!

Oct 8 2026 5:53 AM | Updated on Oct 8 2026 5:59 AM

Artificial intelligence predicts climate change

కంప్యూటర్‌ తెరపైనే సైన్స్‌ ప్రయోగాలు

పరిశోధనలను సులభం చేసే వర్చువల్‌ ప్రయోగశాల

వాతావరణ మార్పులను ముందే చెప్పేస్తుంది 

మైసూరు శాస్త్రవేత్త అనిమా ఆనంద్‌కుమార్‌ ఆవిష్కరణ

సాక్షి, హైదరాబాద్‌ :  ప్రస్తుతం అందుబాటులో ఉన్న కృత్రిమ మేధ (ఏఐ) కేవలం మనుషులు రాసిన అక్షరాలను, మాటలనే అర్థం చేసుకోగలదు. దానికి మన భౌతిక ప్రపంచం గురించి, ప్రకృతి నియమాల గురించి అవగాహన లేదు. ఈ లోటును భర్తీ చేస్తూ మైసూరుకు చెందిన శాస్త్రవేత్త అనిమా ఆనంద్‌కుమార్, ఆమె భర్త బెనెడిక్ట్‌ జెనిక్‌ కలిసి ప్రపంచం ఆశ్చర్యపోయేలా సరికొత్త సాంకేతికతను రూపొందించారు. దీనికి వారు ప్రకృతి ఆధారిత కృత్రిమ మేధస్సు అని పేరు పెట్టారు. సాధారణ ఏఐ మాదిరిగా మాటలకే పరిమితం కాకుండా ఈ కొత్త సాంకేతికత ప్రకృతి నియమాలను, భౌతికశాస్త్ర సూత్రాలను అర్థం చేసుకోగలగడం విశేషం.

నిజజీవితంలో మార్పులను ముందే ఊహించి.. 
ప్రస్తుత సాంకేతికత కేవలం కంప్యూటర్లలోని సమాచారాన్ని, పుస్తకాల్లోని మాటలను చదివి నేర్చుకుంటుంది. ఉదాహరణకు, ఒక వస్తువు పైనుంచి కింద పడిపోతుందని అది మాటల్లో చెప్పగలదు. కానీ, గురుత్వాకర్షణ శక్తి ఎలా పనిచేస్తుంది? ఆ వస్తువు ఎంత వేగంతో కింద పడుతుంది? గాలి వల్ల దాని వేగం ఎలా మారుతుంది? అనే భౌతిక విషయాలను అది కచి్చతంగా లెక్కించలేదు. చిన్న పొరపాటు జరిగినా అది ఇచ్చే సమాధానం పూర్తిగా మారిపోతుంది. కానీ అనిమా ఆనంద్‌కుమార్‌ తయారుచేసిన కొత్త సాంకేతికత భౌతిక ప్రపంచంలోని నియమాలను నేరుగా నేర్చుకుంటుంది. ఇది కేవలం సమాచారాన్ని మాత్రమే కాకుండా భూమిపై ఉన్న విజ్ఞాన సూత్రాలను తు.చ. తప్పకుండా పాటిస్తుంది. దీనివల్ల నిజ జీవితంలో జరిగే మార్పులను ఇది ముందే ఊహించి చెప్పగలదు. 

ఈ కొత్త సాంకేతికత వల్ల కలిగే ఉపయోగాలు.. 
» రాబోయే కాలంలో తుపాన్లు, వరదలు లేదా తీవ్ర ఎండలు ఎప్పుడు వస్తాయో ఈ సాంకేతికత చాలా కచ్చితంగా చెప్పగలదు. సాధారణ పద్ధతుల కంటే ఇది ఎంతో వేగంగా వాతావరణ మార్పులను అంచనా వేస్తుంది. దీనివల్ల వేలాది మంది ప్రాణాలను, ఆస్తులను కాపాడవచ్చు. 
» ఆస్పత్రుల్లో వాడే రకరకాల వైద్య పరికరాలను మరింత సురక్షితంగా మార్చడానికి ఇది ఉపయోగపడుతుంది. ఉదాహరణకు రోగులకు వాడే కొన్ని రకాల క్యాథిటర్స్‌ డిజైన్‌ను ఈ మేధస్సు సహాయంతో మార్చడం ద్వారా బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. 
» మొబైల్‌ ఫోన్లు, కంప్యూటర్లలోని చిప్‌లు పనిచేసేటప్పుడు విపరీతంగా వేడెక్కుతాయి. ఆ వేడి ఎలా ప్రసరిస్తుందోఈ సాంకేతికత ముందే గుర్తించి, చిప్‌లు పాడవకుండా మెరుగైన డిజైన్లను రూపొందించడానికి సహాయపడుతుంది. 
» రాకెట్‌ ఇంజన్లలో ఇంధనం ఎలా మండుతుంది, అంతరిక్షంలో గ్రహాల కదలికలు ఎలా ఉంటాయనే విషయాలను ఇది ముందే ప్రయోగశాలలో పరీక్షించినట్లుగా కంప్యూటర్‌ తెరపై చూపిస్తుంది. 
» భవిష్యత్తులో వచ్చే రోబోలు భూమిపై నడిచేటప్పుడు లేదా బరువైన పనులు చేసేటప్పుడు ప్రకృతి శక్తులను (గాలి, ఒత్తిడి, గురుత్వాకర్షణ) ఎలా తట్టుకోవాలో ఈ సాంకేతికత ద్వారా నేర్చుకోవచ్చు.

సమయం, డబ్బు ఆదా చేసే అద్భుతం..
శాస్త్రవేత్తలు ఏదైనా కొత్త వస్తువును లేదా మందును కనిపెట్టాలంటే ప్రయోగశాలలో ఎన్నో ఏళ్లపాటు పరిశోధనలు చేయాలి. దానికి భారీ ఖర్చవుతుంది. ఎన్నోసార్లు విఫలమయ్యాకే విజయం లభిస్తుంది. కానీ ప్రకృతి ఆధారిత ఏఐ వల్ల ఆ ప్రయోగాలన్నింటినీ వర్చువల్‌ ప్రపంచంలో వేగంగా చేసి చూడొచ్చు. ఏ ఆలోచన నిజజీవితంలో పనిచేస్తుంది, ఏది పనిచేయదో ఈ సాంకేతికత క్షణాల్లో తేల్చిచెబుతుంది. దీనివల్ల శాస్త్రవేత్తల సమయం, దేశాల సంపద ఆదా అవుతాయి. ప్రస్తుతం ఈ సాంకేతికత గురించి ప్రపంచానికి పూర్తిగా తెలియకపోవచ్చు. కానీ రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ దీని ప్రాధాన్యాన్ని గుర్తిస్తారు.      – అనిమా ఆనంద్‌కుమార్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement