
నిధులుండి ఖర్చు చేయని స్మార్ట్ సిటీలకు మరో చాన్స్
మార్చి 31తో ముగిసిన ‘స్మార్ట్ సిటీ మిషన్’
అసంపూర్తిగా ఉన్న పనులను కొనసాగించేందుకు అనుమతి
25 స్మార్ట్ సిటీలకు అవకాశం.. అందులో గ్రేటర్ వరంగల్, కరీంనగర్
స్మార్ట్ సిటీ లక్ష్యాలు చేరని నగరాలకు కూడా..
సాక్షి ప్రతినిధి, వరంగల్: స్మార్ట్ సిటీ మిషన్ (ఎస్‌సీఎం) నిధులుండీ.. అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మూడు నెలల్లోగా ఆ పనులను పూర్తి చేయాల్సి ఉంటుందని, అయితే ఈ పథకం కొనసాగింపు, నిధుల కేటాయింపు ఉండదని సూచించినట్లు తెలిసింది. ఈ మేరకు పురపాలక శాఖ స్మార్ట్ సిటీ మిషన్ ఇన్‌చార్జ్‌లకు సమాచారం అందించింది. గడువు పూర్తయినా అసంపూర్తి పనులున్న గ్రేటర్ వరంగల్, కరీంనగర్‌లతోపాటు స్మార్ట్‌సిటీల జాబితాలో ఉన్న 25 నగరాలకు ఈ అవకాశం ఉంది.
మార్చి 31న ముగిసిన గడువు..
దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 100 నగరాలను ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వం.. 2015, ఆగస్టు 27న ఈ పథకాన్ని ప్రారంభించింది. మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, ఆర్థిక వృద్ధిని పెంచడం.. తద్వారా సుందర నగరాలుగా తీర్చిదిద్దడం ఈ పథకం లక్ష్యం. నిధుల వెసులుబాటు లేక ప్రాజెక్టులు పూర్తి కాకపో వడం వల్ల రెండుసార్లు గడువు పొడిగించిన ప్రభుత్వం.. ఈ ఏడాది మార్చి 31 వరకు మిషన్ పూర్తవుతుందని పేర్కొంది.
అయినప్పటికీ 100 నగరాల్లో 25 మాత్రమే నూరు శాతం పూర్తి చేయగా, 50 నగరాల్లో 95 నుంచి 99 శాతంలో ఉన్నాయి. 25 నగరాల్లో ప్రాజెక్టులు వివిధ స్థాయిల్లో ఉండగా, మరోసారి పొడిగిస్తారని భావించినా స్పష్టమైన ప్రకటన చేయలేదు. నిధులుండీ అసంపూర్తి పనులు పూర్తి చేసేందుకు అవకాశం ఇవ్వడంతో ‘మిషన్’నూరుశాతం లక్ష్యం నెరవేరనుంది.
గ్రేటర్ వరంగల్‌లో పనుల పూర్తికి చాన్స్..
స్మార్ట్ సిటీ మిషన్ ముగింపు నాటికి తెలంగాణలో 87.2 శాతం పనులు పూర్తయ్యాయి. వరంగల్, కరీంనగర్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్‌లలో ఎస్‌సీఎం కింద రూ.2,918 కోట్ల వ్యయం కాగల 169 ప్రాజెక్టులు 87.2 శాతమే పూర్తయినట్లు పేర్కొన్నారు. ఇందులో వరంగల్ కార్పొరేషన్‌లో రూ.1,800 కోట్లతో చేపట్టిన 119 ప్రాజెక్టుల్లో 84.9 శాతం, కరీంనగర్‌లో రూ.1,117 కోట్లతో చేపట్టిన 50 ప్రాజెక్టులు 89 శాతం పూర్తయ్యాయి.
మార్చి 31 తర్వాత నిధులుండీ.. పనులు అసంపూర్తిగా ఉండటంతో స్మార్ట్ సిటీ మిషన్ గడువు పెంచాలని తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శితో పాటు వెనుకబడిన ఇతర రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులు ఏప్రిల్ 11న కేంద్రానికి లేఖ రాశారు. ఆ రోజు నాటికి దేశంలోని నగరాల్లో నిధులు, పనుల వివరాలను కూడా నివేదించారు.
ఈ నేపథ్యంలో నిధులుండీ, అసంపూర్తిగా పనులు పూర్తి చేసేందుకు అనుమతిచ్చిందని, పనులు కూడా సాగుతున్నాయని ఎస్‌సీఎంకు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. తెలంగాణలో వరంగల్, కరీంనగర్‌లతో పాటు దేశంలోని మరో 25 నగరాలకు ఈ అవకాశం కలిగిందని చెప్పారు.
రూ. కోట్లలో
100 స్మార్ట్‌సిటీ మిషన్ నగరాలు
8,067 చేపట్టిన మొత్తం ప్రాజెక్టులు
1,64,400 ప్రాజెక్టుల ఖర్చు అంచనా
7,549 2025, మార్చి 31 వరకు పూర్తయిన ప్రాజెక్టులు
1,51,258 పూర్తయిన ప్రాజెక్టుల ఖర్చు
518 అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు
13,142 అసంపూర్తి ప్రాజెక్టుల అంచనా