అది బర్డ్‌ఫ్లూ కాదు..

Animal Husbandry Department Clarity Chickens Deceased Statewide - Sakshi

పెద్దపల్లి జిల్లాలో కోళ్ల మృతిపై పశుసంవర్థక శాఖ వివరణ

రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ లేదు: మంత్రి తలసాని

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఇటీవల కోళ్లు చనిపోయిన ఘటనలపై పశు సంవర్థక శాఖ స్పందించింది. కోళ్లు చనిపోయింది బర్డ్‌ఫ్లూ వల్ల కాదని స్పష్టం చేసింది. వారం రోజుల కిందట పెద్దపల్లి జిల్లాలోని ఓదెల మండలంలో 35 కోళ్లు చనిపోయాయని, అయితే పోస్టుమార్టంలో అవి రానికేట్‌ వ్యాధి వల్ల చనిపోయినట్టు తేలిందని రాష్ట్ర పశుసంవర్థక శాఖ అదనపు డైరెక్టర్‌ రాంచందర్‌ శుక్రవారం ‘సాక్షి’కి వెల్లడించారు. అవి కూడా ఒకే రోజు చనిపోలేదని, వారం రోజుల పాటు రోజుకు 5–10 చొప్పున చనిపోయినట్లు తేలిందని చెప్పారు. దీంతోపాటు వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని ఓ కోళ్లఫారంలో వ్యక్తిగత కారణాలతో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కొన్ని కోళ్లను చంపేశారని, పోస్టుమార్టంలో కూడా వాటిని చంపినట్లు తేలిందని ఆయన చెప్పారు. అసలు రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ ఆనవాళ్లు లేవని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని వెల్లడించారు. (చదవండి: వేటగాళ్ల పాపమా?.. బర్డ్‌ఫ్లూ శాపమా?)

అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా వైద్య బృందాలు విస్తృతంగా పర్యటిస్తున్నాయని, శాంపిళ్లు సేకరించి పరీక్షలు జరుపుతున్నాయని స్పష్టం చేశారు. ఇక సంగారెడ్డి జిల్లా బుదేరా గ్రామంలో కొన్ని కోళ్లు చనిపోయిన సంఘటనపై విచారణ చేయగా విష ప్రయోగం వల్ల అవి చనిపోయాయని, ఈ మేరకు పోలీసు కేసు కూడా నమోదయినట్లు తమకు నివేదిక అందిందని ఆయన వివరించారు. ఇక మెదక్‌జిల్లా మునుపల్లి గ్రామంలో ఏడు నెమళ్లు చనిపోగా, అధికారులు పోస్టుమార్టం చేయించారని.. వాటి కడుపులో ఎక్కువ మొత్తంలో వడ్లు కనిపించాయని, పురుగు మందు మోతాదు ఎక్కువగా ఉన్న వడ్ల కారణంగానే నెమళ్లు చనిపోయినట్లు తేలిందని రాంచందర్ వెల్లడించారు. కాగా, రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ ప్రవేశించలేదని, ఆందోళన చెందవద్దని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. అనవసరపు ప్రచారాల గురించి భయపడొద్దని, పశుసంవర్థక శాఖ అప్రమత్తంగా ఉందని శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top