ZOOలో జంతువులను దత్తత తీసుకుంటారా?

Animal Adoption Scheme: Nehru Zoological Park Hyderabad - Sakshi

వన్యప్రాణులు, పక్షుల దత్తతపై పలువురి ఆసక్తి

ఇప్పటికే ఎస్‌బీఐ, గ్రాండ్‌ ఫార్మా ఆధ్వర్యంలో పులుల సంరక్షణ

అడాప్షన్‌ స్కీమ్‌లో చేరిన ఉపాసన, మహేష్‌బాబు కూతురు సితార

పక్షుల సేవకు ముందుకొచ్చిన బేబీ సహస్ర శ్రీ, మాస్టర్‌ చర్విక్‌

జంతు ప్రేమికులకు ఆహ్వానం పలుకుతున్న జూ అధికారులు 

సాక్షి, హైదరాబాద్‌: వన్యప్రాణులకు తమవంతు సేవ చేయాలనుకునే వారికి నెహ్రూ జూలాజికల్‌ పార్కు స్వాగతం పలుకుతోంది. వన్యప్రాణులను దత్తత తీసుకోవాలనుకునేవారికి ఎర్రతివాచీ పరుస్తోంది. జూపార్కును తిలకించేందుకు వస్తున్న సందర్శకులు తమకు నచ్చిన జంతువును లేదా పక్షిని ఎంచుకుని వాటి ఆలనా పాలనకయ్యే ఖర్చులను చెల్లించి దత్తత స్కీమ్‌లో చేరుతున్నారు.  


ఇటీవల ఓ కుటుంబంలోని చిన్నారులు అయిదు పక్షులను మూడు నెలల పాటు దత్తతకు స్వీకరించడమే ఉదాహరణగా చెప్పవచ్చు. ఇందుకు సంబంధించిన చెక్కును కుటుంబ సభ్యులతో కలసి క్యూరేటర్‌ వీవీఎల్‌ సుభద్రా దేవికి అందజేశారు. వన్యప్రాణుల దత్తత ద్వారా ఏడాదికి జూకు కోటి రూపాయల ఆదాయం వస్తోంది. ఏడాది జూ బడ్జెట్‌ రూ.15 కోట్లుగా ఉంది. 

పుట్టిన రోజు సందర్భంగా..
పక్షులను దత్తతకు స్వీకరించిన బేబీ సహస్ర శ్రీ, మాస్టర్‌ చర్విక్‌ తమ పుట్టిన రోజు వేడుకకు ఖర్చు చేసే మొత్తాన్ని పక్షుల ఆహారం కోసం ఇచ్చారు. సాధారణ సందర్శకులతో  పాటు మెగా కోడలు కొణిదెల ఉపాసన, మహేష్‌బాబు కుమార్తె ఘట్టమనేని సితార, మాజీ ఐపీఎస్‌ అధికారి ఎన్‌ఎస్‌ రామ్‌జీ, తుమ్మల రచన చౌదరి, గ్లాండ్‌ ఫార్మా కంపెనీ యానిమల్‌ అడాప్షన్‌ స్కీమ్‌లో చేరారు. ఎస్‌బీఐ ఇప్పటికే ఇక్కడి పెద్ద పులులను దత్తతకు వరుసగా ప్రతి ఏడాది స్వీకరిస్తూ వస్తోంది. ఫార్మారంగ దిగ్గజం గ్లాండ్‌ ఫార్మాతోపాటు సినీనటుల కుటుంబ సభ్యులు, అవిశ్రాంత ఉద్యోగులు, ఐటీరంగ నిపుణులు ఉన్నారు.

దత్తత ఇలా.. 
జూలోని వన్యప్రాణులను దత్తత తీసుకోవాలంటే జూ పార్కుకు వెళ్లి క్యూరేటర్‌ను సంప్రదించాలి. జూలోని మీకు నచ్చిన జంతువు లేదా పక్షులను ఎంపిక చేసుకోవాలి. దత్తత తీసుకున్న వన్యప్రాణి నివసించే ప్రదేశంలో మీరు దత్తత తీసుకున్నట్లు పేరు వివరాలు బోర్డుపై రాసి పెడతారు. దత్తత తీసుకున్న వన్యప్రాణిని చూడడానికి మీకు జూలో అనుమతి ఉంటుంది. సంప్రదించాల్సిన నంబర్లు: 040– 24477355, 94408 10182.


ఎంతో సంతృప్తిగా ఉంది

వ్యప్రాణుల పట్ల చిన్నప్పటి నుంచే సేవ చేయాలని ఉండేది. అమ్మానాన్నల ప్రోత్సాహంతో జూలోని పక్షులను దత్తత తీసుకొవాలని నిర్ణయించాం. పుట్టిన రోజుకు అయ్యే ఖర్చుతో మూగ జీవాల ఆలనపాలన చూసుకునే అవకాశం లభించడం ఆనందంగా ఉంది.
– సహస్ర శ్రీ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top