
తుంగభద్ర నదిపై సుంకేశుల బరాజ్ ఎగువభాగంలో 20 టీఎంసీలతో ఏపీ ప్రతిపాదించిన గుండ్రేవుల రిజర్వాయర్
గోదావరి– కావేరి అనుసంధానం తొలిదశ కింద ప్రతిపాదించిన ఏపీ
ఇంట్రా లింకు ప్రాజెక్టులుగా చింతలపూడి, ఉత్తరాంధ్ర, పల్నాడు, గుండ్రేవుల రిజర్వాయర్లు
ఏపీ ప్రతిపాదనలపై అధ్యయనానికి డీపీఆర్ సమర్పించాలని కోరిన ఎన్‌డబ్ల్యూడీఏ
ఇచ్చంపల్లి వద్ద బరాజ్ నిర్మాణానికి తెలంగాణ ఓకే.. ఏపీ ఇంట్రా లింకులపై అభ్యంతరాలు
ఈ నెల 22, 27న జరగనున్న ఎన్‌డబ్ల్యూడీఏ సమావేశాల్లో జరగనున్న వాడీవేడి చర్చ
సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాలుగు కొత్త ప్రతిపాదనలను తెరపైకి తీసుకొచ్చింది. గోదావరి–కావేరి అనుసంధాన ప్రాజెక్టు తొలిదశలో భాగంగా తమ రాష్ట్రంలోని చింతలపూడి ఎత్తిపోతల పథకం, బాబూజగ్జీవన్‌రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, వైఎస్సార్ పల్నాడు కరువు నిర్మూలన ప్రాజెక్టులతోపాటు కొత్తగా కట్టాల్సిన గుండ్రేవుల రిజర్వాయర్ ..అనే నాలుగు కొత్త ఇంట్రా స్టేట్ లింక్ ప్రాజెక్టులను నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ)కి ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఒక రాష్ట్రం అంతర్గతంగా చేపట్టే నదుల అనుసంధాన ప్రాజెక్టులనే ఇంట్రా స్టేట్‌లింక్ ప్రాజెక్టులుగా పరిగణిస్తారు.
గోదావరి–కావేరి అనుసంధాన ప్రాజెక్టుపై 2023 డిసెంబర్ 18న విజయవాడలో ఏపీతో ఎన్‌డబ్ల్యూడీఏ నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నాలుగు ఇంట్రా స్టేట్ లింక్ ప్రాజెక్టుల ప్రతిపాదనలు చేసింది. దీనిపై అధ్యయనం చేసేందుకు సంక్షిప్త నోట్/సవివర పథక నివేదిక(డీపీఆర్)ను సమర్పించాలని నాటి సమావేశంలో ఎన్‌డబ్ల్యూడీఏ ఏపీకి సూచించింది.
2024 జూలై 8న ఈ ప్రాజెక్టులకు సంబంధించిన కాన్సెప్టువల్ నోట్స్‌ను ఎన్‌డబ్ల్యూడీఏకి ఏపీ సమర్పించగా, డీపీఆర్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నెల 22న హైదరాబాద్‌లోని జలసౌధలో గోదావరి–కావేరి అనుసంధాన ప్రాజెక్టుపై నిర్వహించనున్న 6వ సంప్రదింపుల సమావేశ ఎజెండాలో ఈ విషయాన్ని ఎన్‌డబ్ల్యూడీఏ పొందుపరచడంతో తొలిసారిగా ఏపీ ప్రతిపాదనలు వెలుగులోకి వచ్చాయి.
ఆ ఇంట్రా లింక్ ప్రతిపాదనలు ఇవే
» పోలవరం ప్రాజెక్టుకు దిగువన గోదావరి ఎడమగట్టుపై చింతలపూడి వద్ద నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకాన్ని తొలి ఇంట్రా లింక్ ప్రాజెక్టుగా ఏపీ కొత్తగా ప్రతిపాదించింది. 53 టీఎంసీల గోదావరి వరద జలాలను తరలించి నాగార్జునసాగర్ ఎడమకాల్వ ఆయకట్టును స్థిరీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
» పోలవరం ప్రాజెక్టుకు దిగువన గోదావరిపై కుడిభాగం నుంచి 63 టీఎంసీల వరద జలాలను తరలించడానికి చేపట్టిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఎత్తిపోతల పథకాన్ని ఏపీ రెండో ఇంట్రా లింక్ ప్రాజెక్టు కింద కొత్తగా ప్రతిపాదించింది. దీని ద్వారా గోదావరి వరద జలాలను పోలవరం ఎడమ ప్రధాన కాల్వలోకి 162 కి.మీ.ల వద్ద ఎత్తిపోసి ఉత్తరాంధ్ర జిల్లాలకు తరలించడానికి ఈ ప్రాజెక్టును చేపట్టింది. పర్యావరణ అనుమతులు లేకుండా చేపట్టడంతో ఈ రెండు ప్రాజెక్టుల పనులపై ఇప్పటికే ఎన్జీటీ స్టే విధించడంతోపాటు రూ.200 కోట్ల జరిమానా సైతం విధించింది.
» గోదావరి–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా ఏపీ ప్రతిపాదించిన వైఎస్సార్ పల్నాడు కరువు నిర్మూలన పథకాన్ని మూడో ఇంట్రా లింక్ ప్రాజెక్టుగా ఏపీ చూపింది. పోలవరం కుడి ప్రధాన కాల్వ నుంచి తరలించిన నీటిని ప్రకాశం బరాజ్‌కు ఎగువన కృష్ణానదిలో వేసి అక్కడి నుంచి లిఫ్టు ద్వారా పల్నాడు జిల్లాకు తరలించడానికి ఈ ప్రాజెక్టును చేపట్టింది. రూ.6 వేల కోట్లతో ఈ ప్రాజెక్టుకు గతంలో ఏపీ పరిపాలనాపర అనుమతులు జారీ చేయగా, ఇప్పటికే రూ.1,000 కోట్ల విలువైన పనులూ పూర్తయ్యాయి.
» నాలుగో ఇంట్రా లింక్ ప్రాజెక్టుగా 20 టీఎంసీల సామర్థ్యంతో సుంకేశుల జలాశయానికి 19 కి.మీ.ల ఎగువన తుంగభద్ర నదిపై గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణాన్ని ఏపీ ప్రతిపాదించింది. గుండ్రేవుల రిజర్వాయర్‌లో నిల్వ చేసిన నీటిని కేసీ కాల్వ కింద కడప జిల్లాలో ఉన్న చివరి ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని ఏపీ పేర్కొంది. ఈ ప్రాజెక్టుతో ఏపీతోపాటు తెలంగాణలో మొత్తం 3,003.24 హెక్టార్ల భూసేకరణ చేపట్టాల్సి ఉంటుందని తెలిపింది.
తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పెద్దధన్వాడ, వెనిసోమపురం, కేశవపురం గ్రామాలు పూర్తిగా, కుటుకునూరు, కిసాన్‌సాగర్ గ్రామాలు పాక్షికంగా ముంపునకు గురవుతాయని కాన్సెప్టువల్ నోట్స్‌లో ఏపీ వెల్లడించింది. గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మించాలని ఏళ్లుగా ఏపీలో డిమాండ్ ఉందని తెలిపింది.
ఇచ్చంపల్లికి ఓకే.. ఇంట్రా లింకులకు నో
గోదావరి–కావేరి అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా గోదావరిపై ఇచ్చంపల్లి వద్ద బరాజ్ నిర్మించి నీటిని తరలించాలని ఎన్‌డబ్ల్యూడీఏ చేసిన ప్రతిపాదనలకు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సమ్మతి తెలిపింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ ప్రతిపాదనలకు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతోపాటు ఇప్పటికే తాము చేపట్టిన సమ్మక్క బరాజ్ నుంచి నీటిని తరలించాలని డిమాండ్ చేసింది. తాజాగా ప్రభుత్వ వాదనలో మార్పు వచ్చిన నేపథ్యంలో ఇచ్చంపల్లి వద్ద బరాజ్ నిర్మాణానికి ఈ నెల 22న జరగనున్న ఎన్‌డబ్ల్యూడీఏ సంప్రదింపుల సమావేశంలో సమ్మతి తెలపాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెల 27న ఢిల్లీలో ఎన్‌డబ్ల్యూడీఏ పాలకమండలి సమావేశం సైతం జరగనుంది.
ఈ రెండు సమావేశాల్లో ఇచ్చంపల్లి వద్ద బరాజ్ నిర్మాణానికి సమ్మతి తెలపడంతోపాటు ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన నాలుగు ఇంట్రా లింక్ ప్రాజెక్టులను తీవ్రంగా వ్యతిరేకించాలని తెలంగాణ నిర్ణయించింది. వారం రోజుల వ్యవధిలో ఎన్‌డబ్ల్యూడీఏ నదులు అనుసంధానంపై రెండు కీలక సమావేశాలు నిర్వహించనుండడంతో ఈ మేరకు తమ వాదనలు వినిపించేందుకు రాష్ట్ర నీటిపారుదల శాఖ ముమ్మర కసరత్తు చేస్తోంది.