ఇక ప్రతి నెలా తెలంగాణకు అమిత్‌ షా! | Amit Shah to tour Telangana every month to strengthen BJP | Sakshi
Sakshi News home page

ఇక ప్రతి నెలా తెలంగాణకు అమిత్‌ షా!

Jul 22 2022 2:07 AM | Updated on Jul 22 2022 10:57 AM

Amit Shah to tour Telangana every month to strengthen BJP - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా త్వరలోనే రాష్ట్రానికి రానున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసే దాకా ప్రతి నెలా రెండు రోజులు రాష్ట్రానికి కేటాయిస్తూ షెడ్యూల్‌ వేసుకున్నానని ముఖ్య నేతలకు అమిత్‌ షా వెల్లడించినట్లు సమాచారం. ఇందులో భాగంగా ఈ నెలాఖరులోగా షా మరోసారి తెలంగాణకు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరో ఏడాదిన్నరలోగా రాష్ట్రంలో ఎన్నికలుంటాయనే అంచనాల నేపథ్యంలో ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి అమిత్‌ షాలతో కూడిన అగ్రనాయకత్వం పూర్తిగా రాష్ట్ర రాజకీయాలపై దృష్టిసారించడం తెలిసిందే.

ఇందులో భాగంగానే హైదరాబాద్‌లో ఈ నెల 2, 3 తేదీల్లో జరిగిన జాతీయ కార్యవర్గ భేటీలోనూ ‘మిషన్‌ తెలంగాణ’ రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేశారు. అధికార టీఆర్‌ఎస్‌ అనుసరిస్తున్న అప్రజాస్వామిక, నియంతృత్వ విధానాలు, కుటుంబపాలన, పాలనా వైఫల్యాలు, ప్రధాన హామీల అమల్లో వైఫల్యం వంటి అంశాలను ఎండగడుతూ అన్నిస్థాయిల్లో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, నిరంతరం ప్రజల్లోనే ఉండాలని జాతీయ నాయకత్వం రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేసింది. దాన్ని మరింత పటిష్టంగా క్షేత్రస్థాయిలో అమలు చేసే చర్యల్లో భాగంగా రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాలు, వ్యూహాలన్నీ పూర్తిగా జాతీయ నాయకత్వం, అమిత్‌ షా కనుసన్నల్లోనే సాగుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అమిత్‌ షా రాష్ట్ర పర్యటనలకు ప్రాధాన్యత ఏర్పడింది.

వరంగల్‌ సభకు అమిత్‌ షా! 
వచ్చే నెల 2 నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆధ్వర్యంలో మూడో విడత ప్రజాసంగ్రామ యాత్రను ఉమ్మడి నల్లగొండ, వరంగల్‌ జిల్లాల పరిధిలోని 13–14 నియోజకవర్గాల్లో 20–25 రోజులపాటు నిర్వహించనున్నారు. ఈ పాదయాత్ర ముగింపు సందర్భంగా వరంగల్‌లో నిర్వహించే బహిరంగ సభకు అమిత్‌ షా ముఖ్యఅతిథిగా పాల్గొనే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సంజయ్‌ పాదయాత్రతోపాటు రాష్ట్రం మొత్తం చుట్టివచ్చేలా బైక్‌ ర్యాలీలు చేపట్టాలంటూ గతంలోనే షా రాష్ట్ర పార్టీని ఆదేశించారు. అందుకు అనుగుణంగానే గురువారం నుంచి 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముఖ్యనేతల బైక్‌ ర్యాలీలను రాష్ట్ర పార్టీ ప్రారంభించింది.

త్వరలోనే మరో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ ర్యాలీలు మొదలుపెట్టనుంది. ఈ ఏడాది చివర్లోగా ఐదారు విడతల్లో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలను చుట్టివచ్చేలా బైక్‌ ర్యాలీలను చేపట్టనున్నారు. జాతీయ పార్టీ ఆదేశాల మేరకు నెలలో 20 రోజులు బండి సంజయ్‌ పాదయాత్ర, 10 రోజులు బైక్‌ ర్యాలీలు నిరంతరం నిర్వహిస్తూ గ్రామస్థాయి వరకు టీఆర్‌ఎస్‌ వ్యతిరేక ప్రచారం, మోదీ సర్కార్‌ విజయాలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తీసుకెళ్లాలని నిర్ణయించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement