దశాబ్ది ఉత్సవాలకు సర్వం సిద్ధం! | All Arrangements Set For Decade Celebrations Of Telangana | Sakshi
Sakshi News home page

దశాబ్ది ఉత్సవాలకు సర్వం సిద్ధం!

Published Sun, Jun 2 2024 4:11 AM | Last Updated on Sun, Jun 2 2024 4:12 AM

All Arrangements Set For Decade Celebrations Of Telangana

ఉదయం 9.30 గంటలకు అమరవీరుల స్తూపం వద్ద నివాళులు 

తర్వాత పరేడ్‌ గ్రౌండ్స్‌లో వేడుకలు.. తెలంగాణ రాష్ట్ర గీతం ఆవిష్కరణ 

అనంతరం సీఎం, ఇతర ప్రముఖుల ప్రసంగాలు 

వివరాలను వెల్లడించిన సమాచార శాఖ కమిషనర్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ వేడుకలకు సంబంధించిన షెడ్యూల్, ఇతర వివరాలను రాష్ట్ర సమాచారశాఖ కమిషనర్‌ హనుమంతరావు శనివారం వెల్లడించారు. దశాబ్ది ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణంలో ఉత్సవాలు జరగనున్నాయని చెప్పారు. కార్యక్రమాలు ఉదయం 9.30 గంటలకు గన్‌పార్క్‌ వద్ద మొదలై.. రాత్రి 9 గంటలకు ట్యాంక్‌బండ్‌పై ముగుస్తాయని తెలిపారు. ట్యాంక్‌ బండ్‌పై నిర్వహించే వేడుకలకు వచ్చే ప్రజలు సాయంత్రం 5 గంటలోపే చేరుకోవాలని సూచించారు. 

సర్వాంగ సుందరంగా ట్యాంక్‌బండ్‌ 
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల కోసం పరేడ్‌ గ్రౌండ్స్‌లో, ట్యాంక్‌బండ్‌పై చేస్తున్న ఏర్పాట్లను మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, ఇతర నేతలు పరిశీలించారు. పరేడ్‌ గ్రౌండ్స్‌లో వేదికలు, హాజరయ్యే వారికోసం సిద్ధం చేస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. ఇక దశాబ్ది ఉత్సవాల కోసం ట్యాంక్‌బండ్‌ను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. రంగురంగుల విద్యుద్దీపాలను ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికపై జరిగే కార్యక్రమాలను వీక్షించడానికి పలుచోట్ల ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. 80కిపైగా ఫుడ్, వస్తువుల స్టాల్స్‌ ఏర్పాటు చేశారు.

మంచినీటిని అందుబాటులో పెట్టారు. పదేళ్ల తర్వాత ప్రజాస్వామిక తెలంగాణ వచ్చిందని ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ పేర్కొన్నారు. నాడు సోనియా గాంధీ ఒక అడుగు వెనక్కి వేసి ఉంటే తెలంగాణ రాకపోయేదన్నారు. తెలంగాణ ఏర్పాటులో బీజేపీ నేత సుష్మాస్వరాజ్‌ పాత్రను మరవలేమన్నారు. ఇక ప్రత్యేక తెలంగాణ కోసం ప్రపంచం గరి్వంచదగ్గ ఉద్యమం జరిగిందని.. కానీ ఆ ఉద్యమానికి అనుగుణంగా గత పదేళ్లలో పాలన జరగలేదని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. ఈ పరిశీలనలో మంత్రుల వెంట ఎంపీ అనిల్‌కుమార్‌ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, మేయర్‌ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ఉత్సవాల షెడ్యూల్‌ ఇలా..
ఉదయం 9.30 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్దకు చేరుకుంటారు. అమరులకు నివాళులు అర్పిస్తారు. 
 9.55 గంటలకు పరేడ్‌ గ్రౌండ్స్‌కు సీఎం చేరుకుంటారు. 
10.00 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం సాయుధ బలగాల కవాతు, గౌరవ వందనం ఉంటాయి. 
10.15 నుంచి 10.35 వరకు బలగాల మార్చ్‌ ఫాస్ట్‌ ఉంటుంది. 
10.35 గంటలకు ‘జయ జయహే తెలంగాణ’రాష్ట్ర గీతాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరిస్తారు. 
10.38 కార్యక్రమానికి సోనియా గాంధీ హాజరైతే ఆమె తొలుత ప్రసంగిస్తారు. తర్వాత సీఎం రేవంత్‌ ప్రసంగం ఉంటుంది. సోనియా రాకుంటే నేరుగా సీఎం ప్రసంగిస్తారు. 
11.08 గంటలకు పోలీసు, ఉత్తమ కాంటింజెంట్ల అవార్డుల ప్రదానం. 
11.20కు పరేడ్‌ ముగింపు కోసం పరేడ్‌ కమాండర్‌కు అనుమతి 
11.25 గంటలకు అవార్డుల స్వీకర్తలతో ఫొటో సెషన్‌ 
11.30 గంటలకు పరేడ్‌ గ్రౌండ్స్‌లో కార్యక్రమం ముగింపు.

సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై కార్యక్రమాలివీ..
6.50 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి ట్యాంక్‌బండ్‌కు చేరుకుంటారు. 
 7.00 గంటలకు అక్కడ ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాళ్లను సందర్శిస్తారు 
7.20 గంటలకు కార్నివాల్‌ మొదలవుతుంది. 
 7.30 నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు.. కళాకారుల నృత్యాలు, ఆటపాటలు 
8.30కు ఫ్లాగ్‌ వాక్‌.. జయ జయహే తెలంగాణ గేయం 13.5 నిమిషాల పూర్తి వెర్షన్‌ విడుదల. 
8.44 గంటలకు గేయ రచయిత అందెశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణికి సన్మానం 
 8.50 గంటలకు ఆకట్టుకునేలా బాణసంచా 
 9.00గంటలకు ట్యాంక్‌బండ్‌పై కార్యక్రమం ముగింపు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement