వీబాక్స్, సీఐఐ సర్వేలో నెంబర్‌ 1 గా నిలిచిన హైదరాబాద్‌

After Rajasthan Telangana Women Has More Employable Akills  - Sakshi

ఉద్యోగార్హ మహిళల్లో తెలంగాణ నంబర్‌ 2

మొదటి స్థానంలో నిలిచిన రాజస్తాన్‌

పట్టణాల పరంగా హైదరాబాదే టాప్‌

ఉద్యోగార్హ నైపుణ్యాల్లో మహిళలే ఎక్కువ..

వివిధ రంగాల్లో 36 శాతానికి వారి భాగస్వామ్యం

ఇండియా స్కిల్‌  రిపోర్టు–2021లో వెల్లడి  

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవడంలో మహిళలే ముందంజలో ఉన్నారు. ఇటు ఉద్యోగాల్లోనూ మహిళల భాగస్వామ్యం పెరుగుతోంది. 2021లో ఉద్యోగార్హ నైపుణ్యాలు కలిగిన మహిళలు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో రాజస్తాన్‌ మొదటి స్థానంలో.. తెలంగాణ రెండో స్థానంలో ఉండనుంది. వీబాక్స్, కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (సీఐఐ) కలసి దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించి రూపొందించిన ఇండియా స్కిల్‌ రిపోర్టు–2021 ఈ విషయాన్ని స్పష్టం చేసింది.

ఈ సర్వేలో గత గణాంకాలను పరిగణనలోకి తీసుకుని 2021లో ఉద్యోగార్హ నైపుణ్యాలు కలిగిన మహిళల పెంపును అంచనా వేసింది. ఇక పట్టణాల పరంగా ఉద్యోగార్హ నైపుణ్యాలు కలిగిన మహిళలు అత్యధికంగా ఉన్న వాటిల్లో హైదరాబాద్‌ మొదటి స్థానంలో.. బెంగళూరు రెండో స్థానంలో ఉండనుంది. వివిధ రంగాల్లో ఉద్యోగం చేస్తున్న మహిళల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోందని తెలిపింది.  

46.8 శాతానికి పెరుగుదల.. 
దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో పనిచేస్తున్న మహిళల భాగస్వామ్యం గణనీయంగా పెరుగుతోంది. 2020లో ఉద్యోగార్హ నైపుణ్యాలు కలిగిన మహిళలు 41.25 శాతం ఉంటే 2021లో 46.8 శాతానికి పెరగనుందని నివేదిక అంచనా వేసింది. పురుషుల కంటే ఉద్యోగార్హ నైపుణ్యాలున్న మహిళల సంఖ్య కూడా ఎక్కువగానే ఉండనుందని వెల్లడించింది. 2021లో ఉద్యోగార్హ నైపుణ్యాలు కలిగిన పురుషులు 45.91 శాతం మాత్రమే ఉంటారని, మహిళలు 46.8 శాతం ఉండనున్నట్లు వివరించింది. 

తగ్గుతున్న పురుష ఉద్యోగులు.. 
ఇక వివిధ రంగాల్లో పనిచేసే మహిళా ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 2020లో ఉద్యోగం చేసే మహిళలు 23 శాతం మంది ఉంటే ఈసారి వారి సంఖ్య 36 శాతానికి పెరగనుందని అంచనా. ఇక వివిధ రంగాల్లో పనిచేస్తున్న పురుషులు 2020లో 77 శాతం మంది ఉంటే ఇప్పుడు వారి సంఖ్య 64 శాతానికి తగ్గనున్నట్లు నివేదిక వివరించింది. దేశంలో ఉన్నత విద్యను అభ్యసించే మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గతంలో కంటే ఈసారి వారి సంఖ్య అధికంగా ఉండనుందని, తద్వారా ఉద్యోగార్హ నైపుణాలు కలిగిన మహిళల సంఖ్య పెరుగుతుందని పేర్కొంది. 2021లో రాజస్తాన్‌లో ఉద్యోగార్హ నైపుణ్యాలు కలిగిన మహిళల సంఖ్య 46.18 శాతానికి పెరగనున్నట్లు పేర్కొంది.

అదే తెలంగాణలో ఉద్యోగార్హ నైపుణ్యాలున్న మహిళల సంఖ్య 32.71 శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది. మరోవైపు ఇంటర్నెట్‌ బిజినెస్‌లో పురుషుల కంటే మహిళా ఉద్యోగులే అత్యధికంగా ఉన్నారు. అలాగే ఐటీ సెక్టార్‌లోనూ 38 శాతం మహిళా ఉద్యోగులే ఉన్నట్లు వెల్లడించింది. 2015 నుంచి ఇప్పటివరకు ఉద్యోగార్హ నైపుణ్యాలున్న వారిలో పురుషుల సంఖ్య పెద్దగా పెరగకపోగా మహిళల శాతం క్రమంగా పెరుగుతూ వస్తోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top