ఆర్టీసీకి అదనపు ఆదాయం

Additional Revenue For TSRTC Through Cargo Services In Telangana - Sakshi

సొంతగా పార్శిల్, కొరియర్‌ సేవలు

కరోనా కష్టకాలంలోనూ నెలకు రూ.2 కోట్ల ఆదాయం

ఏపీ ఆర్టీసీ తరహాలో పటిష్ట పరిచే ప్లాన్‌

రూ.100 కోట్ల వార్షికాదాయానికి చాన్స్‌

సాక్షి, హైదరాబాద్‌: ఇంతకాలం అప్పులు, నష్టాలు కొండలా పేరుకుపోయినా, చేష్టలుడిగి చూసిన ఆర్టీసీ ఇప్పుడు ప్రత్యామ్నాయ ఆదాయాన్ని పొందటంలో చురుగ్గా వ్యవహరిస్తోంది. దండిగా ఆదాయం పొందే అవకాశం ఉన్నా, దాన్ని ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతూ వింతగా వ్యవహరించి ఎట్టకేలకు ఇప్పుడు తప్పు దిద్దుకుంటోంది. ఇన్నేళ్లకు సొంతంగా పార్శిల్, కొరియర్‌ సర్వీ సు ప్రారంభించి దినదినాభివృద్ధి చేసుకుంటోంది. కరోనాతో కార్యకలాపాలు స్తంభించిపోయిన తరుణంలోనూ సగటు న నెలకు రూ.2 కోట్ల ఆదాయాన్ని పొందుతోంది. దాన్ని మరో వారంలో రెట్టింపు చేసుకునేందుకు సిద్ధమైంది.

కరోనా సమసిపోయి వ్యాపార కార్యకలాపాలు పుంజుకుంటే సాలీనా రూ.80 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు ఆదాయం పొందే అవకాశం కనిపిస్తోంది. ఈ సేవలను పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో అక్కడి ఆర్టీసీ గతంలో ప్రారంభించి ప్రస్తుతం వార్షికంగా రూ.80 కోట్ల ఆదాయాన్ని పొందుతోంది. ఆ మొత్తాన్ని మరింత పెంచుకునేందు కు కసరత్తు చేస్తోంది. టీఎస్‌ఆర్టీసీ ప్రయత్నిస్తే అంతకంటే ఎక్కువ ఆదాయం పొందటం కష్టం కాబోదని తెలుస్తోంది. 

కార్గోతో కలుపుకొంటే రెట్టింపు ఆదాయం..
టీఎస్‌ఆర్టీసీ పూర్తిగా నిర్వీర్యమైన సంగతి తెలిసిందే. దీంతో ప్రత్యామ్నాయ ఆదాయంపై దృష్టిసారించే క్రమంలో సంస్థ సరుకు రవాణా వ్యవస్థను కొత్తగా ప్రారంభించింది. పాత బస్సులను కార్గో బస్సులుగా మార్చి వాటిల్లో, ధాన్యం, పుస్తకాలు, రేషన్‌ సరుకులు, మందులు, మద్యం.. ఇలా ప్రభుత్వ కార్పొరేషన్లకు సంబంధించిన అన్ని రకాల సరుకులు తరలించటం ద్వారా సాలీనా రూ.300 కోట్ల మేర ఆదాయాన్ని పొందొ చ్చని అప్పట్లో అంచనా వేసింది. కానీ ఆ ఏర్పాట్లు చేయటంలో సంబంధిత అధికారులు జాప్యం చేయటంతో అది వెంటనే పట్టాలెక్కలేదు.

ఈలోపు కరోనా సమస్య రావటంతో ఇబ్బందులేర్పడ్డాయి. దీంతో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ వెంటనే పార్శిల్, కొరియర్‌ సేవలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. పాత బస్సుల బాడీ మార్చి సరుకు రవాణా (కార్గో)కు వీలుగా ప్రత్యేక బస్సులు రూపొందిస్తున్నా, ప్రజలు కొరియర్‌ ద్వారా పంపే చిన్నచిన్న వస్తువులు, కవర్లు పంపేందుకు వీలుగా ప్రయాణికుల బస్సులే వినియోగించాలని నిర్ణయించారు. మంత్రి చొరవతో వెంటనే అది అమలులోకి వచ్చింది. అయితే ప్రారంభంలో ఉండే ఇబ్బందుల వల్ల అనుకున్న స్థాయిలో వెంటనే పుంజుకోలేదు.

ఇటీవల జరిగిన ఓ సమీక్షలో సీఎం కేసీఆర్‌ దీన్ని తీవ్రంగా పరిగణించి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అప్పటివరకు బాధ్యతలు చూసే అధికారిని తప్పించి రవాణాశాఖ మంత్రి ఓఎస్డీగా ఉన్న కృష్ణకాంత్‌ను దీనికి ప్రత్యేకాధికారిగా నియమించారు. ఆయన తొలి రోజు నుంచే మార్కెట్‌లో తిరుగుతూ ఆర్డర్లు వచ్చేలా చూశారు.  గత వారం రోజులుగా సగటున నిత్యం రూ.6.5 లక్షల ఆదాయం వస్తోంది. దశాబ్దాలుగా కొరియర్, పార్శిల్‌ సర్వీసు నిర్వహిస్తున్న పేరు న్న పెద్ద ప్రైవేట్‌ సంస్థలకు కూడా కరోనా కష్టకాలంలో రోజు వారి ఆదాయం రూ. 15 లక్షలకు మించటం లేదు. అలాంటిది అనతి కాలం లోనే ఆర్టీసీ పుంజుకోవటం విశేషం. 

ఇంతకాలం ప్రైవేటు సంస్థల జేబుల్లోకి..
ఆర్టీసీ బస్సుల్లో పార్శిళ్ల తరలింపు చాలాకాలంగా జరుగుతోంది. కానీ సొంతంగా నిర్వహించకుండా ప్రైవేటు సంస్థలకు ఆ బాధ్యత అప్పగిస్తూ వచ్చారు. ఆ సంస్థలు భారీగా ఆదాయం పొందుతూ ఆర్టీసీకి మాత్రం నామమాత్రపు చార్జీ చెల్లించేవారు. రవాణా మంత్రి ఆ విధానాన్ని మార్చి ఆర్టీసీనే సొంతంగా నిర్వహించేలా చొరవ తీసుకున్నారు. ఏపీలో సంస్థ భారీగా ఆదాయాన్ని పొందుతున్నట్టుగానే ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీ కూడా ఆదాయాన్ని పొందేం దుకు వీలు చిక్కుతోంది. 

మూడు రోజుల్లో కొత్త ధరలు
‘‘పార్శిల్, కొరియర్‌ సేవల రూపంలో వస్తున్న రోజువారీ ఆదాయాన్ని రెట్టింపు చేసుకునే దిశగా రాష్ట్రవ్యాప్తంగా ఏజెంట్లతో ఒప్పందాలు చేసుకుంటున్నాం. ఎవరైనా పార్శిల్‌ బుక్‌ చేస్తే వారి ఇంటికే వచ్చి వస్తువులు తీసుకుని, గమ్యస్థానంలోని ఇంటి వరకు చేరవేస్తాం. ఇప్పటికే 300 మంది ఏజెంట్లు, మా సొంత సిబ్బందిని నియమించుకునే పని కొలిక్కి వచ్చింది. మూడ్రోజుల్లో సరుకు రవాణ కోసం కార్గో ధరలను సవరించి కొత్తవి అందుబాటులోకి తెస్తాం. ఇల్లు ఖాళీ చేసేవారు మొదలు ధాన్యం లాంటి పెద్ద సరుకు తరలింపు వరకు కార్గో బస్సులు ప్రజలకు అందుబాటులో ఉంచుతాం. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ లాంటి ఈ–కామర్స్‌ సంస్థలతో కూడా ఒప్పం దం చేసుకుంటున్నాం. వారి వస్తువులు గ్రామీణ ప్రాంతాలకు మేమే చేరవేసేలా చూస్తున్నాం. ఇప్పటికే 150 కార్గో బస్సులు సిద్ధం చేశాం’. – కార్గో విభాగం ప్రత్యేకాధికారి కృష్ణకాంత్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top