రూ.1.50 లక్షల ఫీజు ఎలా కట్టాలి..?

Active Parents Forum Comments On Private School Fees - Sakshi

సాక్షి, పంజాగుట్ట: హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ బాడీని రద్దు చేసి కొత్త బాడీని ఎంపిక చేయాలని, 2014 నుంచి లేకుండా పోయిన టీచర్స్, పేరెంట్స్‌ కమిటీని వెంటనే నియమించాలని యాక్టివ్‌ పేరెంట్స్‌ ఫోరం డిమాండ్‌ చేసింది. కరోనా నేపథ్యంలో 4 గంటల పాటు ఆన్‌లైన్‌ విద్యను బోధించి, ఎల్‌కేజీ విద్యార్థికి రూ.1.50 లక్షల ఫీజు కట్టమని ఒత్తిడి తెస్తున్నారని, ఇదేమిటని ప్రశ్నిస్తే టీసీ ఇస్తామనడంతో పాటు ఆన్‌లైన్‌ క్లాస్‌లకు లాగిన్‌ ఇవ్వకుండా వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం విలేకరులతో ఫోరం ప్రతినిధులు అశోక్, ఆనంద్‌రెడ్డి, మహేందర్, శిరీష, గజేందర్‌ మాట్లాడారు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో సదరు పాఠశాలకు 90 ఎకరాల స్థలాన్ని ఎకరానికి రూపాయి చొప్పున ఇచ్చారని గుర్తుచేశారు.

గతంలో ప్రభుత్వ ఆధీనంలో పాఠశాల నడిచేదని, ప్రభుత్వ ఆదీనంలో ఉంటే సీబీఎస్‌ఈ ఇవ్వరనే నిబంధన ఉన్నందున ప్రభుత్వమే ఒక సొసైటీ ఏర్పాటు చేసి దానికి విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి చైర్మన్‌గా వ్యవహరిస్తూ సీబీఎస్‌ఈ విద్యను బోధిస్తోందన్నారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్నప్పటికీ ఎల్‌కేజీకి రూ.1.5 లక్షలు ఉండేదన్నారు. కరోనా కాలంలో పూర్తి ఫీజు చెల్లించమని ఒత్తిడి తెస్తున్నారని, తాము ప్రభుత్వ నిబంధనల ప్రకారం 65 శాతం ఫీజు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ బోర్డులో ఐదుగురు సభ్యులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఫీజు కట్టకపోతే టీసీ ఇచ్చేస్తామని, వచ్చే విద్యా సంవత్సరానికి ప్రమోట్‌ చేయమని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top