789 టీఎంసీలు మాకే కావాలి | 789 tmcs should be allocated in Krishna waters: telangana | Sakshi
Sakshi News home page

789 టీఎంసీలు మాకే కావాలి

Mar 25 2024 3:57 AM | Updated on Mar 25 2024 3:01 PM

789 tmcs should be allocated in Krishna waters: telangana - Sakshi

కృష్ణాజలాల్లో ఉమ్మడి ఏపీకి కేటాయించిన 1,050 టీఎంసీలపై తెలంగాణ వాదన

సాక్షి, హైదరాబాద్‌: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కృష్ణా జలాల్లో ఉన్న 1,050 టీఎంసీల్లో 798 టీఎంసీలను తమకు కేటాయించాలని జస్టిస్‌ బ్రిజేష్‌కుమార్‌ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్‌–2కి తెలంగాణ విజ్ఞప్తి చేసింది. వినియోగంలో ఉన్న ప్రాజెక్టులకు 299 టీఎంసీలు, నిర్మాణంలోని ప్రాజెక్టులకు 238 టీఎంసీలు, భవిష్యత్‌లో కట్టబోయే ప్రాజెక్టులకు 216 టీఎంసీలు, తాగునీటి అవసరాలకు 36 టీఎంసీలు కలిపి మొత్తం 789 టీఎంసీలు కేటాయించాలని నివేదించింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి బచావత్‌ ట్రిబ్యు­నల్‌(కృష్ణా ట్రిబ్యునల్‌–1) గంపగుత్తగా కేటాయించిన 811 టీఎంసీలతో పాటు ఇతర కేటాయింపులను.. ఏపీ, తెలంగాణల మధ్య పునః పంపిణీకి కృష్ణా ట్రిబ్యు­న­ల్‌–2కు అదనపు విధివిధా­నాలు (టీఓఆర్‌) జారీ చేస్తూ 2023 అక్టోబర్‌ 10న కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయాన్ని గుర్తు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ కృష్ణా జలాల పంపిణీపై తమ వాదనలతో స్టేట్‌ ఆఫ్‌ కేసు (ఎస్‌ఓసీ) దాఖలు చేయాలని రెండు రాష్ట్రాలను ఆదేశించింది.

ఈ నెల 20తో గడువు ముగియగా, అదేరోజు తమకు 798 టీఎంసీలను కేటాయించాలని కోరుతూ తెలంగాణ ఎస్‌ఓసీ దాఖలు చేసింది. నది పరీవాహక ప్రాంతం(బేసిన్‌)ను ప్రామాణికంగా తీసుకుంటే 68 శాతం క్యాచ్‌మెంట్‌ ఏరియా తమ రాష్ట్రం పరిధిలో ఉందని తెలంగాణ స్పష్టం చేసింది. బేసిన్‌ పరిధిలో 2 కోట్ల జనాభాతో పాటు అత్యధిక శాతం కరువు పీడిత ప్రాంతాలున్న అంశాన్ని పరిగణనలోకి తీసుకొని న్యాయమైన వాటాగా 789 టీఎంసీలు కేటాయించాలని విజ్ఞప్తి చేసింది. కనీస మొత్తంగా 75 శాతం లభ్యత(డిపెండబిలిటీ) ఆధారంగా 555 టీఎంసీలు, 65 శాతం లభ్యత ఆధారంగా 575 టీఎంసీలు తెలంగాణకు కేటాయించాలని నివేదించింది.

భవిష్యత్‌లో కట్టే ప్రాజెక్టులకు 216 టీఎంసీలు
భవిష్యత్‌లో కోయిల్‌కొండ, గండీడ్, జూరాల ఫ్లడ్‌ ఫ్లో కెనాల్‌ వంటి ప్రాజెక్టుల నిర్మాణం జరగాల్సి ఉందని, వీటికి 216 టీఎంసీల నీటిని కేటాయించాలని ట్రిబ్యునల్‌ను తెలంగాణ కోరింది. 

1050 టీఎంసీల్లో సగానికి పైగా...
ఉమ్మడి ఏపీకి బచావత్‌ ట్రిబ్యునల్‌ గంపగుత్తగా 811 టీఎంసీల కృష్ణా జలాలను కేటాయించింది. బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ అదనంగా 194 టీఎంసీలు కేటాయించడంతో ఉమ్మడి ఏపీకి 1005 టీఎంసీల కేటాయింపులున్నాయి. ఇవికాక పోలవరం ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్టా సిస్టమ్‌ (కేడీఎస్‌)కు తరలించే 80 టీఎంసీల గోదావరి జలాలకు బదులుగా, నాగార్జునసాగర్‌ ఎగువన ఉండే రాష్ట్రాలకు 80 టీఎంసీల కృష్ణా జలాలను వినియోగించుకునే వెసులుబాటు గతంలోనే బచావత్‌ ట్రిబ్యునల్‌ కల్పించింది. అందులో ఉమ్మడి ఏపీకి దక్కిన 45 టీఎంసీలు కలుపుకొని మొత్తం 1050 టీఎంసీలను తెలుగు రాష్ట్రాలకు బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయాల్సి ఉంది.

ట్రిబ్యునల్‌ నివేదికకు 15 నెలల గడువు
అంతరాష్ట్ర నదీ జలాల వివాద చట్టం–1956లోని సెక్షన్‌–3 కింద విచారణ జరిపి, నివేదిక ఇచ్చేందుకు బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ గడువును ఇటీవల కేంద్రం మరో 15 నెలలు పొడిగించింది. 2025 జూలై 31లోపు ట్రిబ్యునల్‌ నివేదిక అందించాలి. ఏపీ సైతం తమ స్టేట్‌ ఆఫ్‌ కేస్‌ను దాఖలు చేస్తే ట్రిబ్యునల్‌ విచారణ ముందుకు సాగనుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్‌–89 ప్రకారం ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులపై ట్రిబ్యునల్‌ విచారణ చేసినందున, తీర్పు కూడా 15 నెలల్లోపే వస్తుందనే ఆశతో తెలంగాణ ఉంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement