సింగరేణి ‘సెగ’పట్లు | 60 coal mines in the country will be auctioned today | Sakshi
Sakshi News home page

సింగరేణి ‘సెగ’పట్లు

Published Fri, Jun 21 2024 1:28 AM | Last Updated on Fri, Jun 21 2024 1:28 AM

60 coal mines in the country will be auctioned today

నేడు దేశంలోని 60 బొగ్గు గనుల వేలం

ప్రారంభించనున్న కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి

ఇందులో సింగరేణి ఏరియాలోని శ్రావణపల్లి బ్లాకు సైతం ఉండటంతో రాజకీయ దుమారం 

సింగరేణి ప్రైవేటీకరణకు కుట్ర అంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ ఆరోపణ

ప్రైవేటీకరణ ప్రశ్నే ఉత్పన్నం కాదన్న కేంద్ర మంత్రి

గత సర్కారు సింగరేణిని వేలంలో పాల్గొనకుండా చేసి నష్టం కలిగించిందంటూ కిషన్‌రెడ్డి విమర్శలు 

బీఆర్‌ఎస్‌ పెద్దలు అనుయాయులకే సింగరేణి గనులు 

దక్కేలా చేసుకున్నారని ఉప ముఖ్యమంత్రి భట్టి ఫైర్‌ 

రాజకీయ విమర్శల నేపథ్యంలో వేలానికి సింగరేణి దూరం?

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర రాజకీయాల్లో సింగరేణి బొగ్గు గనుల అంశం మంటలు రేపుతోంది. సింగరేణి ప్రాంతం పరిధిలోని ఓ బొగ్గు గని వేలానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధం కావడంతో దుమారం చెలరేగింది. కేంద్రం, రాష్ట్రంలోని అధికార, విపక్ష పార్టీల నేతలు పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలకు దిగడంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. 

ఒకవైపు సింగరేణి సంస్థను ప్రైవేటీకరించే ప్రశ్నే ఉత్పన్నం కాదని చెప్తున్న కేంద్ర ప్రభుత్వం.. మరోవైపు దేశంలోని 60 బొగ్గు గనుల వేలం ప్రక్రియను శుక్రవారం తెలంగాణ గడ్డ నుంచే ప్రారంభిస్తుండటం, ఇందులో సింగరేణి ఏరియా పరిధిలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాకు కూడా ఉండటం చర్చనీయాంశంగా మారింది. 

శ్రావణపల్లి బ్లాకులో 11.99 కోట్ల టన్నుల బొగ్గు నిక్షేపాలున్నట్టు గతంలో సింగరేణి నిర్వహించిన భూగర్భ సర్వేలో తేలింది. సింగరేణి ఏరియాలో ఉన్న ఈ బొగ్గు బ్లాకును వేలం వేయకుండా, నేరుగా సింగరేణికే కేటాయించాలని గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం డిమాండ్‌ చేసినా.. కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది.  

సింగరేణి ఏరియాలోని బొగ్గు బ్లాకులపై.. 
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లో 10వ విడత బొగ్గు గనుల వేలం ప్రక్రియను ప్రారంభించనున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సైతం ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. దీనిపై ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ తీవ్రంగా మండిపడుతోంది. సింగరేణి సంస్థను కాపాడుతామని పైకి చెప్తున్న కేంద్రం.. సింగరేణి ఏరియా పరిధిలోని బొగ్గు బ్లాకులకు వేలం నిర్వహిస్తుండటం ఏమిటని ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. 

పైగా ఈ వేలంలో పాల్గొని బ్లాకులను దక్కించుకోవాలని సింగరేణి సంస్థను కోరుతుండటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నిజానికి కేంద్రం ఇంతకుముందు పలు దఫాలుగా సింగరేణి ఏరియాలోని కల్యాణఖని, శ్రావణపల్లి, కోయగూడెం, సత్తుపల్లి బొగ్గుబ్లాకులకు వేలం నిర్వహించింది. అప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ సర్కారు ఆ వేలాన్ని తీవ్రంగా వ్యతిరేకించి, దూరంగా ఉంది. 

మీదే తప్పంటే మీదేనంటూ.. 
గతంలో బీఆర్‌ఎస్‌ సర్కారు బొగ్గు గనుల వేలంలో పాల్గొనకుండా అడ్డుకోవడం ద్వారా సింగరేణి సంస్థకు అపార నష్టం కలిగించిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. దీనిపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్రంగా మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ సింగరేణి సంస్థను ప్రైవేటీకరించే దిశగా కలసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. సింగరేణి ప్రాంతంలోని బొగ్గు గనులను వేలంలో ఎవరు దక్కించుకున్నా మళ్లీ తాము అధికారంలోకి వచ్చాక తిరిగి స్వాదీనం చేసుకుంటామని పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ సైతం ఈ వ్యవహారంలో తీవ్రంగా స్పందించింది. 

బొగ్గు గనుల వేలాన్ని తప్పనిసరి చేస్తూ 2015లో కేంద్రం తెచ్చిన చట్టానికి పార్లమెంట్‌లో బీఆర్‌ఎస్‌ మద్ధతు తెలిపిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు. బీఆర్‌ఎస్‌ పెద్దలు గతంలో జరిగిన వేలంలో సింగరేణి పాల్గొనకుండా చేసి, వారి అనుయాయులకు సత్తుపల్లి, కోయగూడెం బొగ్గు బ్లాకులు దక్కేలా చేసుకున్నారని ఆరోపించారు. సింగరేణి ఏరియాలోని గనులను ఆ సంస్థకే కేటాయించాలని కేంద్రాన్ని కోరుతామని చెప్పారు. మొత్తంగా మూడు ప్రధాన పక్షాలు కూడా పరస్పర ఆరోపణలు చేసుకుంటుండటంతో ‘సింగరేణి’ అంశం చర్చనీయాంశంగా మారింది. 

వేలానికి సింగరేణి దూరమే? 
– రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కోసం చూస్తున్నామన్న అధికారులు 
సింగరేణి (కొత్తగూడెం): శ్రావణపల్లి బొగ్గు బ్లాకు వేలం ప్రక్రియలో పాల్గొనాలని తొలుత సింగరేణి యాజమాన్యం భావించినట్టు తెలిసింది. కానీ ప్రస్తుత రాజకీయ విమర్శలు, ఆరోపణల నేపథ్యంలో వేలానికి దూరంగా ఉండాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామని సంస్థ అధికార వర్గాలు తెలిపాయి. నిజానికి శ్రావణపల్లి బొగ్గు బ్లాకును దక్కించుకుని, తవ్వకాలు చేపట్టే విషయంలో చాలా పెద్ద ప్రక్రియ ఉంటుందని అంటున్నాయి. 

శ్రావణపల్లి బ్లాక్‌లో జీ–10 గ్రేడ్‌ బొగ్గు 11.9 కోట్ల టన్నుల మేర ఉన్నట్టు అంచనా వేశారు. టన్నుకు ఇంత అనే లెక్కన కొంత సొమ్ము ముందే చెల్లించి వేలంలో పాల్గొనాలి. వేలంలో దక్కించుకున్నా.. నిర్దేశిత ప్రాంతం ప్రైవేట్‌ భూమా, అటవీ భూమినా అన్నది తేల్చుకోవాలి. సహాయ, పునరావాస ప్యాకేజీ చెల్లించాలి, ప్రజాభిప్రాయ సేకరణ సభలు నిర్వహించి ఇతర అనుమతులు తీసుకోవాలి. ఇదంతా సాఫీగా సాగకుంటే వేలంలో చెల్లించిన సొమ్ము తిరిగొచ్చే పరిస్థితి ఉండదు. 

ఇప్పటికే సింగరేణి సంస్థ బొగ్గు తవ్వకాలపై రాయల్టీల పేరిట ఏటా రూ.వందల కోట్లు చెల్లిస్తోంది. వేలంలో పాల్గొని బొగ్గు బ్లాక్‌ దక్కించుకుంటే మరింత ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది. తద్వారా కంపెనీకి వచ్చే లాభం తగ్గుతుంది. ఇప్పటికే వీకే–7 గని అనుమతుల ప్రక్రియ మూడేళ్లుగా కొనసాగుతుండటంతో.. శ్రావణపల్లి వేలం విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నట్టు సమాచారం.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement