ఎంఎస్‌.. చలో యూఎస్‌ | Students are aiming to do MS course in America | Sakshi
Sakshi News home page

ఎంఎస్‌.. చలో యూఎస్‌

Jun 3 2023 5:48 AM | Updated on Jun 3 2023 5:48 AM

Students are aiming to do MS course in America - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ కోర్సులు పూర్తి చేసిన తర్వాత చాలా మంది విద్యార్థులు అమెరికాలో ఎంఎస్‌ కోర్సు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. అమెరికా వెళ్తే చదువుకుంటూనే ఉపాధి సైతం పొందవచ్చని భావిస్తున్నారు. కోవిడ్‌ కాలంలో అమెరికా వెళ్లాలనే ఆకాంక్ష విద్యార్థుల్లో కాస్త తగ్గినా గతేడాది నుంచి మళ్లీ ఆసక్తి పెరిగింది. ఆర్థిక మాంద్యంతో అక్కడ ఉపాధి అవకాశాలు తగ్గినా విద్యార్థులు మాత్రం దీన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు.

ఎంఎస్‌ పూర్తయ్యే నాటికి పరిస్థితులు సాధారణ స్థాయికి చేరుకుంటాయని ఆశిస్తున్నారు. దీంతో అప్పులు చేసి మరీ విదేశీ చదువుల కోసం పరుగులు పెరుగుతున్నారు. రాష్ట్రంలో 2020లో దాదాపు 40 వేల మంది విద్యార్థులు అమెరికా వెళ్లగా 2022లో ఈ సంఖ్య 52 వేలకు పెరిగిందని, ఈ ఏడాది ఆగస్టు నాటికి వారి సంఖ్య 60 వేల వరకు ఉండొచ్చని ఓ కన్సల్టెంట్‌ తెలిపారు. దేశం నుంచి ఈ ఏడాది దాదాపు 7 లక్షల మంది విద్యార్థులు ఆగస్టులో అమెరికా, ఆ్రస్టేలియా ఇతర దేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారన్నారు. 

జాబ్‌ వచ్చే కోర్సులే గురి... 
దేశంలో ఏ కోర్సులో ఇంజనీరింగ్‌ చేసినా అమెరికాలో ఎంఎస్‌ మాత్రం సాఫ్ట్‌వేర్‌ అనుబంధ రంగాల్లోనే చేయాలని విద్యార్థులు లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా డేటా సైన్స్‌ వైపు మొగ్గుచూపుతున్నారు. డిజిటల్‌ ఎకానమీలో అత్యధికంగా ఉదోగాలు ఉండటం, నైపుణ్య విభాగాలైన బిజినెస్, టెక్నాలజీ, డేటా సైన్స్‌కు భవిష్యత్తులోనూ మంచి డిమాండ్‌ ఉంటుందని భావిస్తున్నారు. ఈ అంచనాలతోనే ఎక్కువ మంది డేటా సైన్స్‌లో విదేశీ విద్య పూర్తి చేయాలని భావిస్తున్నారు.

ఇప్పటివరకు అందిన నివేదికల ప్రకారం డేటా అనాలసిస్‌లో 23 శాతం, డేటా విజువలైజేషన్‌లో 10 శాతం, ప్రాబబిలిటీ అండ్‌ స్టాటిస్టిక్స్‌లో 26 శాతం, మెషీన్‌ లెరి్నంగ్‌లో 41 శాతం మంది భారతీయ విద్యార్థులు విదేశాల్లో చదువుతున్నారు. వారి లక్ష్యం మాత్రం ఈ కోర్సుల డిమాండ్‌ను అందిపుచ్చుకోవడమే. దేశంలో 2020–21 మధ్య డేటా సైన్స్‌లో ఉద్యోగాలు 47.10 శాతం మేర పెరిగాయి. ఎంఎస్‌ పూర్తి చేసిన వారికి ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు వస్తున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. 

రంగంలోకి కన్సల్టెన్సీలు... 
విదేశాలకు వెళ్లే విద్యార్థులను వెతికి పట్టుకొనేందుకు కన్సల్టెన్సీలు పోటీపడుతున్నాయి. వాస్తవానికి విదేశాల్లో ఎంఎస్‌ కోర్సు చేసేందుకు ట్యూషన్‌ ఫీజు, ఇతర ఖర్చులు, విమాన ప్రయాణ చార్జీలు కలిపి రూ. 30 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు ఖర్చవుతుంది. చదువుతూ ఉద్యోగం చేయడానికి చాలా దేశాలు ఒప్పుకోవు. కాబట్టి అక్కడ చవివే సమయంలో కావల్సిన మొత్తం తమ వద్ద ఉందని విద్యార్థి వెళ్లే ముందే ఆధారాలు చూపించాలి. ఈ ప్రక్రియలో కన్సల్టెన్సీలు అవసరమైన తోడ్పాటు అందిస్తున్నాయి.

విద్యార్థి ఖాతాలో డబ్బులు వేయడం, అతను విదేశాలకు వెళ్లిన తర్వాత తిరిగి తీసుకోవడం సర్వసాధారణంగా జరిగిపోతున్నాయి. విదేశాల్లో విద్యార్థులు చదువును త్వరగా పూర్తి చేసి వీసా గడువులోగా ఎక్కువ ఉపాధి మార్గాలపై దృష్టి పెడుతున్నారు. ఇలాంటి వారికి కన్సల్టెన్సీలు ఏదో ఒక ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇస్తున్నాయి. ఎం.ఎస్‌. పూర్తి చేశాక కూడా ఉద్యోగం ఇస్తామని ఒప్పందం చేసుకుంటున్నాయి. విదేశాలకు విద్యార్థులు వెళ్లాక ఏదో ఒక పార్ట్‌టైం ఉద్యోగం చేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఇవన్నీ సానుకూల మార్గాలు కావడంతో ఎక్కువ మంది వెళ్ళేందుకు ఇష్టపడుతున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement