విదేశీయులకు షాకిచ్చిన కువైట్‌..  66 వేల డ్రైవింగ్‌ లైసెన్స్‌లు రద్దు 

Kuwait Cancels More Than 66000 Driving Licences For Expats - Sakshi

మోర్తాడ్‌ (బాల్కొండ): వలస కార్మికులకు విస్తృతమైన ఉపాధి అవకాశాలను కల్పించిన కువైట్‌.. డ్రైవింగ్‌ లైసెన్స్‌ల విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ట్రాఫిక్‌ రద్దీని నియంత్రించడానికి విదేశీయులకు జారీ చేసిన లైసెన్స్‌లలో ఏకంగా 66 వేల లైసెన్స్‌లను రద్దు చేసింది. ఇంకా అనేక మంది లైసెన్స్‌లు రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త నిబంధనలతో ఇతరులతో పాటు తెలుగు రాష్ట్రాల వలస కారి్మకులకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడనున్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

రెండు రాష్ట్రాలకు చెందిన అనేకమంది అరబ్బులకు డ్రైవర్లుగా పని చేస్తున్నారు. అలాగే సేల్స్‌మెన్‌ కమ్‌ డ్రైవర్లుగా కూడా అనేక మంది వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఇలాంటి వారికి జారీ చేసిన లైసెన్స్‌ల విషయంలో కువైట్‌ ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. సేల్స్‌మెన్‌లు కేవలం అదే పని చేయాలని, డ్రైవింగ్‌ ఎలా చేస్తారని ప్రశి్నస్తూ గతంలో జారీ చేసిన లైసెన్స్‌లను బ్లాక్‌ లిస్ట్‌లో ఉంచారని సమాచారం.

మరోవైపు కంపెనీలను నిర్వహిస్తున్నవారు సొంతంగా వాహనాలను కొనుగోలు చేసి డ్రైవింగ్‌ లైసెన్స్‌లను పొందారు. వీరి ఆదాయం కూడా పరిగణనలోకి తీసుకుని సంతృప్తికరంగా ఉంటేనే లైసెన్స్‌లను కొనసాగించనున్నారు. కొన్నేళ్ల కిందట డ్రైవింగ్‌ లైసెన్స్‌లను విచ్చలవిడిగా జారీ చేయడంతో కొన్ని దుష్పరిణామాలు చోటు చేసుకున్నాయని గుర్తించిన కువైట్‌ ఇప్పుడు దిద్దుబాటు చర్యలు తీసుకుందని అక్కడ నివసిస్తున్న తెలంగాణ వాసులు కొందరు వెల్లడించారు.

దిద్దుబాటులో భాగంగా సొంత కారు ఉండి డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందాలంటే మన కరెన్సీలో కనీసం రూ.1.50 లక్షల వేతనం ఉండాలనే నిబంధన అమలులోకి తీసుకువచ్చారు. తక్కువ వేతనం అందుకుంటున్నవారికి డ్రైవింగ్‌ లైసెన్స్‌ జారీ చేసి ఉంటే దానిని రద్దు చేశారు. కాగా తప్పుడు ఆధారాలతో డ్రైవింగ్‌ లైసెన్స్‌లు పొందినవారు కూడా ఇప్పుడు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.  
చదవండి: అప్సర కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం.. నేడు కోర్టుకు సాయికృష్ణ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top