టెక్స్‌టైల్‌ పార్క్‌కు సహకరించడం లేదు  | BRS Not contributing to the textile park says Kishan reddy | Sakshi
Sakshi News home page

టెక్స్‌టైల్‌ పార్క్‌కు సహకరించడం లేదు 

Jun 11 2023 2:36 AM | Updated on Jun 11 2023 2:36 AM

BRS Not contributing to the textile park says Kishan reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో టెక్స్‌టైల్‌ పార్క్‌ ఏర్పాటు ఎంవోయూకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ముందుకు రావడం లేదని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. కేంద్రంలోని పెద్దలను తాను అనేక సార్లు అభ్యర్థించి రాష్ట్రానికి టెక్స్‌ టైల్‌ పార్కును తీసుకొస్తే ఇక్కడి సర్కారు నుంచి స్పందన లేక పోగా ఏ మాత్రం సహకరించడం లేదని ఆరోపించారు. శనివారం హైదరాబాద్‌లో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.

వ్యవసాయానికి మోదీ ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తోందని, పెద్ద ఎత్తున ఎరువుల సబ్సిడీ ఇస్తోందన్నారు. పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పనే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు. తాజాగా పెంచిన పంటల మద్దతు ధర ఈ ఖరీఫ్‌ సీజన్‌నుంచే అమల్లోకి వస్తుందని, రైతులకు మేలు చేసేలా కేంద్రం గొప్ప నిర్ణయం తీసుకుందన్నారు. 

భారత్‌ బ్రాండ్‌ పేరుతో యూరియా  
నానో యూరియాతో పాటు భారత్‌బ్రాండ్‌ పేరుతో యూరియా ప్రవేశ పెడుతున్నట్టు, ఇందుకు 8 ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్టు కిషన్‌రెడ్డి తెలిపారు. 2014లో దేశ వ్యవసాయ బడ్జెట్‌ రూ.21,933 కోట్లు ఉంటే, తొమ్మిదేళ్లలో రూ.లక్షా 25 వేల 33 కోట్లకు పెరిగిందని వివరించారు. కిసాన్‌క్రెడిట్‌కార్డుల ద్వారా రూ.28,590 కోట్ల వ్యవసాయ రుణాల మంజూరు, 23 కోట్ల సాయిల్‌హెల్త్‌ కార్డులను రైతులకు అందజేసినట్టు తెలియజేశారు.

ఒకప్పుడు రూ.లక్ష కోట్ల విలువైన నూనెల దిగుమతి ఉండేదని, ఇప్పుడు రైతుల నుంచి నూనె గింజల సేకరణ 1,500 శాతం పెరిగిందని తెలిపారు. గుడ్ల ఉత్పత్తిలో మూడో స్థానం, మాంసం ఉత్పత్తిలో 8వ స్థానం, పప్పుదినుసుల సేకరణలో కూడా కేంద్రం 7300 శాతం వృద్ధి సాధించిందన్నారు. ఎరువుల రాయితీ గత ఏడాదికి ఈ ఏడాదికి పోలిస్తే 500 శాతం పెరిగిందని చెప్పారు. 

రూ.20 లక్షల కోట్లు రుణ వితరణ లక్ష్యంగా.. 
ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగానికి రూ.20 లక్షల కోట్లు రుణ వితరణ లక్ష్యంగా కార్యాచరణను కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తోందని కిషన్‌రెడ్డి వివరించారు. ప్రస్తుతమున్న ఈ–నామ్‌మార్కెట్లు 1260 బాగా నడుస్తున్నాయని తెలిపారు. 

9 ఏళ్ల పాలనలో తెలంగాణకు చేకూరిన ప్రయోజనాలను గురించి కిషన్‌రెడ్డి వివరించారు. అవేంటంటే...
♦ తెలంగాణలో 39 లక్షల మంది రైతులకు పీఎం కిసాన్‌ సమ్మాన్‌యోజన ద్వారా ఏటా రూ.6 వేలు అందజేత 
 రూ.6,300 కోట్లతో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభం.
♦ సించాయ్‌యోజన కింద చిన్న సాగునీటి ప్రాజెక్టుల పూర్తి.
♦ దీని కింద తెలంగాణలో 11 ప్రాజెక్టులను గుర్తించి, వాటిని పూర్తి చేసుకోవడం కోసం ఇప్పటి వరకు రూ.1,248 కోట్లు కేటాయింపు.
♦  రూ.23,948 కోట్లతో ఎల్‌సీడీసీ ద్వారా గొర్రెల పెంపకం, ఇతర వ్యవసాయ కార్యక్రమాలకు రుణాల మంజూరు.
♦ ఆయిల్‌ పామ్‌ మిషన్‌ కింద రూ.214 కోట్లు.
♦ ఒక్క ఎరువుల మీద రూ.27 వేల కోట్ల రూపాయల సబ్సిడీ.
♦ రైతులకు మేలు చేసే ‘వేపపూత’ యూరియాను అందుబాటులోకి తీసుకొచ్చారు 
 తెలంగాణలో ఎఫ్‌సీఐ ద్వారా ధాన్యం సేకరణకు కేంద్రం ఒకప్పుడు రూ.3,307 కోట్లు ఖర్చు చేస్తే ఇప్పుడు రూ.26,307 కోట్లు వెచ్చిస్తోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement