సాక్షి, చైన్నె: నగరాలు, పట్టణాల్లో వెలుస్తున్న అక్రమ, అనధికార నిర్మాణాలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు ఆ యన అన్ని కార్పొరేషన్లు, మున్సిపల్ క మిషనర్లకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశా రు.అనధికార నిర్మాణాలు, భవన నిబంధనల ఉల్లంఘనలను నిలిపివేయాలని దాఖలైన కేసులో సుప్రీంకోర్టు ఇటీవల వివరణాత్మక ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని అనుసరించి, గృహ, పట్టణాభివృద్ధి శాఖ 20 22లో జారీ చేసిన ప్రకటన, అలాగే 2023 మార్గదర్శకాలకు లోబడి కమిషనర్లందరూ సుప్రీంకోర్టు ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేయాలని డైరెక్టర్ స్పష్టం చేశారు.
క్షేత్రస్థాయి తనిఖీలు, కఠిన చర్యలు
భవన నిర్మాణ ప్రణాళికలు (బిల్డింగ్ ప్లాన్స్) మంజూరైన అన్ని ప్రాంగణాల్లో క్షేత్ర , ప్రాంతీయ అధికారులు తప్పనిసరిగా తనిఖీలు నిర్వహించాలి. ఆమోదించబడిన డ్రాయింగ్‌లకు విరుద్ధంగా నిర్మాణాలు జరిగినా లేదా అనధికార నిర్మాణాలు గుర్తించినా ఎటువంటి ఆలస్యం చేయకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలి.ఈ ఆదేశాల అమలు తీరుపై కమిషనర్లు తమ కార్యాలయాల్లో పక్కా రికార్డులను నిర్వహించాలి. సర్వే చేసిన స్థలాల సంఖ్య, ప్లాన్ ఆమోదాలు, జారీ చేసిన నోటీసులు, తీసుకున్న తుది చర్యల వివరాలను ప్రతి నెలా నిర్ణీత తేదీలోగా ఉన్నతాధికారులకు నివేదించాలి. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అమలు చేయడంలో విఫలమైతే సంబంధిత కమిషనర్లు, క్షేత్రస్థాయి సిబ్బంది , సర్వేయర్లే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని లేఖలో హెచ్చరించారు.


