తిరువొత్తియూరు: చైన్నె తిరువొత్తియూరులో వెలిసిన వడివుడయమ్మన్ ఆలయంలో ఆదిపురీశ్వరర్ శివ లింగంపై సంవత్సరం పొడవునా కప్పి వుంచిన కవచం ఈనెల 24వ తేదీన తెరుస్తారు. భక్తు లు 3 రోజుల పాటు భక్తులు శివలింగాన్ని పూర్తి గా దర్శనం చేసుకోవచ్చు. తిరువొత్తియూర్‌లో ఉన్న త్యాగరాజ స్వామి సమేత వడివుడయమ్మన్ (త్రిపుర సుందరి)ఆలయం ఎంతో విశిష్టమైంది. ఈ ఆలయంలోని మూలవిరాట్టు ఆదిపురీశ్వరర్‌పై ఉన్న బంగారు పూత పూసిన వెండి నాగకవచం తెరిచే కార్యక్రమం మంగళవారం 24వ తేదీ జరగనుంది. తదుపరి 25వ తేదీ, 26వ తేదీలతో కలి పి మొత్తం 3 రోజుల పాటు ప్రజలు ఆదిపురీశ్వరర్‌ను కవచం లేకుండా విశ్వరూప దర్శనం దర్శించుకోవచ్చు. సంవత్సరంలో కేవలం 3 రోజులు మాత్రమే కవచం లేకుండా ఆదిపురీశ్వరర్‌ను దర్శించుకునే అవకాశం ఉండటంతో, ఇందులో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించిన ముందస్తు ఏర్పాట్లపై ఆలయ సహాయ కమిషనర్ నర్సోనై అధ్యక్షతన సమీక్ష జరిగింది. 3 రోజుల పాటు జరిగే ఈ వేడుకలో పాల్గొనే లక్షలాది మంది భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణమంతా షెడ్లు, తాగునీరు, మరుగుదొడ్లు, దివ్యాంగులకు ప్రత్యేక క్యూ లైన్ వంటి వసతులు కల్పించడానికి ప్రణాళికలు రూపొందించారు. ఆలయ ప్రాంగణంలో నిఘా కెమెరాలు అమర్చినట్లు సహాయ కమిషనర్ నర్సోనై తెలిపారు.
తక్షణమే కరువు సాయం ప్రకటించాలి
సాక్షి, చైన్నె: సీఎం విజయ్ ప్రచార పిచ్చి కారణంగానే డెల్టా ప్రాంతంలో భారీగా పంట నష్టం వాటిల్లిందని ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ తీవ్రంగా ఆరోపించారు. కష్టాల్లో ఉన్న అన్నదాతలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ఆలస్యం లేకుండా వెంటనే కరువు సహాయాన్ని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ విషయమై ఉదయనిధి స్టాలిన్ సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. జూన్ 12న మెట్టూరు డ్యామ్‌ను తెరవకపోవడం వల్ల తొలుత కురువై సాగు దెబ్బతిందని ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత సాంబ సాగు కోసం సరైన సమయంలో నీటిని విడుదల చేయాలని రైతులు, డీఎంకే సహా ప్రతిపక్ష పార్టీలు కోరినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. కేవలం రీల్స్ మోజులో పడి, సీఎం సెప్టెంబర్ 1న ముందుగానే నీటిని విడుదల చేయడం వల్లే ప్రస్తుతం డెల్టాలో సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆరోపించారు.
ముందస్తు హెచ్చరికలను పెడచెవిన పెట్టారు
రాబోయే నీటి ఎద్దడిని ఊహించి, ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తాము గత నెలలో రెండుసార్లు, అంతకుముందు కూడా ప్రభుత్వాన్ని హెచ్చరించామని ఉదయనిధి గుర్తుచేశారు. అయితే, ప్రతిపక్షాల సూచనలను వినడానికి నిరాకరించిన పాలకుల అహంకారం వల్లే రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారని విమర్శించారు. గతంలో పూర్తి పంట రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి రైతులను మోసం చేసినట్లుగా ఈసారి కూడా వ్యవహరించకూడదని ఆయన హితవు పలికారు. దెబ్బతిన్న పంటలపై తక్షణమే పారదర్శకమైన క్షేత్రస్థాయి సర్వే నిర్వహించాలని, రైతుల కన్నీళ్లు తుడిచేందుకు ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే కరువు సహాయం అందించాలని ఉదయనిధి స్టాలిన్ స్పష్టం చేశారు.
వచ్చే ఏడాది ఏప్రిల్‌లో సీ అంబులెన్స్ పథకం ప్రారంభం
సాక్షి, చైన్నె: మత్స్యకారుల సంక్షేమం, అత్యవసర వైద్య సేవల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సీ అంబులెన్స్ (సముద్ర అంబులెనన్స్) ప్రాజెక్టును వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ప్రారంభించేందుకు చురుగ్గా పనులు సాగుతున్న తమిళనాడు మత్స్య, మత్స్యకారుల సంక్షేమ శాఖ మంత్రి శ్రీనాథ్ ప్రకటించారు. తూత్తుకుడిలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మత్స్యకారులు , వారి కుటుంబాలకు అండగా నిలిచే పలు కొత్త పథకాల అమలుపై నాలుగు రోజుల క్రితమే సీఎం తనతో చర్చించారని మంత్రి తెలిపారు. సముద్రంలో వేటకు వెళ్లిన సమయంలో ప్రమాదాలకు గురయ్యే లేదా అస్వస్థతకు లోనయ్యే మత్స్యకారులను తక్షణమే ఒడ్డుకు చేర్చి ప్రాణాలు కాపాడేందుకు ఈ సీ అంబులెనన్స్ పథకం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కాసిమేడు మత్స్యకారుల నిరసనలపై మంత్రి స్పందిస్తూ, కొన్ని దుష్ట శక్తుల ప్రేరేపణతోనే అక్కడ చిన్నపాటి నిరసనలు జరుగుతున్నాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పట్టుబడిన కాసిమేడు మత్స్యకారుల పడవల విడుదల కోసం సీఎం స్వయంగా ఏపీ ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపారు. ఇందులో భాగంగా తమిళనాడు మత్స్యశాఖ డైరెక్టర్ సోమవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలవనున్నారని, త్వరలోనే పడవలన్నీ విడుదలవుతాయని హామీ ఇచ్చారు. మత్స్యకారులు ఎవరూ వదంతులను నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.తూత్తుకుడి తీరప్రాంతంలోని థర్మల్ పవర్ ప్లాంట్ల నుండి వెలువడే బూడిద నిల్వల తొలగింపు విషయమై సాంకేతిక కమిటీతో సంప్రదింపులు జరుపుతున్నామని, వచ్చే ఏడాది ఏప్రిల్‌లో దీనికి సంబంధించిన పనులను చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు.


