సాక్షి, చైన్నె : అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామికి, మాజీ మంత్రి ఎస్పీ వేలుమణికి మధ్య నెలకొన్న విభేదాలు బహిర్గతమయ్యాయి. పార్టీలోని రెండు కోట్ల మంది కార్యకర్తలు ఏం చెబుతున్నారో ఒక్కసారి చెవి పెట్టి వినాలని పళనిస్వామికి వేలుమణి సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు.రెండు కోట్లమందిలో ఎస్పీ వేలుమణి కూడా ఒక్కరే అని ఎడప్పాడి పళణిస్వామి చేసిన వ్యాఖ్య ఇద్దరి మధ్య మరింత దుమారం రేపుతోంది. వివరాలు.. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామికి వ్యతిరేకంగా సీనియర్ నేత, మాజీమంత్రి ఎస్పీ వేలుమణి వ్యవహరిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలో ఒక వివాహ వేడుకలో మంత్రి కె.ఎ. సెంగోట్టయ్యన్, మాజీ మంత్రి ఎస్.పి. వేలుమణి కలిసి కనిపించిన వీడియోతో వివాదం ముదిరింది. అసెంబ్లీ వేదికగా సీఎం విజయ్‌కు మద్దతుగా ఎస్పీ వేలుమణితో పాటుగా కీలక ఎమ్మెల్యేలు వ్యవహరించిన నేపథ్యంలో తాజా భేటి చర్చకు దారి తీసింది. అదే సమయంలో ఆ సమయంలో వ్యతిరేకంగా ఉన్న ఎమ్మెల్యేలు ఆరుగురు రాజీనామా చేసి టీవీకేలో చేరారు. ఈ పరిస్థితులలో కోయంబత్తూరు విమానాశ్రయంలో విలేకరులు ఎడప్పాడి పళనిస్వామిని ఈ భేటి గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనిపై పళనిస్వామి స్పందిస్తూ.. పార్టీని వీడిన వారి గురించి ఆయా పార్టీలనే అడగాలని, ఎస్.పి. వేలుమణి అన్నాడీఎంకే లోని రెండు కోట్ల మంది సభ్యులలో ఒకరు మాత్రమేనని, ఆయన గురించి ప్రశ్నలు వేయవద్దని పేర్కొన్నారు. ఇందుకు ఎస్.పి. వేలుమణి సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్టు ద్వారా ఆదివారం స్పందించారు.
పళని స్వామి, ఎస్పీ వేలుమణి
తనను అవమానించాలనే ఉద్దేశంతో ప్రధా న కార్యదర్శి అలా అన్నా కూడా, అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం (ఏఐఏడీఎంకే) సాధారణ కార్యకర్తగా ఉండటమే తనకు దక్కిన అతిపెద్ద గౌరవమని ఆయన పేర్కొన్నారు. ఆ రెండు కోట్ల మంది కార్యకర్తల వల్లే పళనిస్వామి నేడు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారని గుర్తుచేశారు.గతంలో ఎంజీఆర్, జయలలిత సామాన్య కార్యకర్తల గొంతుకకు ఎంతో విలువ ఇచ్చేవారని వేలుమణి తెలిపారు. పార్టీని ప్రేమించే ప్రతి ఒక్కరూ విభేదాలు లేకుండా కలిసి పనిచేయాలని కోరుకుంటున్నారని చెప్పారు. గతంలో వి.కె. శశికళ, టి.టి.వి. దినకరన్ పార్టీలో కలిసి పనిచేయడానికి ముందుకు వచ్చారని, అలాగే ఓ. పన్నీర్‌సెల్వం, ఆర్. వైద్యంగం డీఎంకేలో చేరడానికి ముందు అన్నాడీఎంకే ఉద్యమంలో కొనసాగేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారని గుర్తుచేశారు. కె.ఎ. సెంగోట్టయ్యన్, జె.సి.టి. ప్రభాకర్ వంటి నేతలు కూడా పార్టీలో చేరేందుకు ప్రయత్నించినప్పటికీ, పళనిస్వామి మొండిపట్టుదల వల్లే వారంతా తమిళగ వెట్రి కళగంలోలో చేరాల్సి వచ్చిందని వేలుమణి వివరించారు. . సొంత వారిని నిర్లక్ష్యం చేయడం వల్లే నేడు పార్టీ ఈ పరిస్థితికి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.అమ్మ (జయలలిత) తరఫు శక్తులన్నీ ఏకమై ముందుకు సాగితేనే రేపటి విజయం తమదవుతుందని, కాబట్టి తనతో సహా రెండు కోట్ల మంది కార్యకర్తల మనోభావాలను ప్రధాన కార్యదర్శి పరిగణనలోకి తీసుకోవాలని వేలుమణి తన పోస్టులో కోరారు.
కార్యకర్తగా ఉండటమే గర్వం..


