సాక్షి, చైన్నె: తమిళనాడులో ఈశాన్య రుతుపవనాలు ప్రారంభమైనప్పటికీ వర్షాలు ఆశించిన స్థాయిలో కురవడం లేదు. బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నాబ్, మురసు, అక్వాన్ తుఫానులు ఆంధ్రప్రదేశ్, ఒడిశా వైపు కదిలి తీరం దాటడంతో వాతావరణంలో ఆకస్మిక మార్పులు చోటుచేసుకున్నాయి. దీని ప్రభావంతో ఆదివారం ఉదయం చైన్నె నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్మేసింది. నగరంలోని చేట్ పట్ ఎకో పార్క్ సరస్సు పరిసరాలు పొగమంచుతో కప్పబడి ఆహ్లాదకరంగా కనిపించినప్పటికీ, రహదారులపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
శివారు ప్రాంతాల్లో మంచు దుప్పటి
చైన్నె శివారులలోని రెడ్‌హిల్స్, పుళల్, అంబత్తూరు, వడపెరుంబాక్కం, విళంగాడుపాక్కం, మాధవరం, తాంబరం, గూడువాంజేరి, పడప్‌పై , మణివాక్కం పరిసర ప్రాంతాల్లో భారీగా పొగమంచు కురిసింది. చెంగల్పట్టు పట్టణం మీదుగా వెళ్లే చైన్నె–తిరుచ్చి జాతీయ రహదారితో పాటు తిరుక్కళికుండ్రం, తిరుపోరూర్, మహాబలిపురం, కల్పక్కం ప్రాంతాల్లో రహదారులు పొగమంచుతో నిండిపోయాయి. తిరువళ్లూరు, ఈక్కాడు, పూండి, కనకమ్మ చత్రం, చైన్నె–తిరుపతి జాతీయ రహదారి, తిరువళ్లూరు–శ్రీపెరంబుదూర్ హైవేలపై కూడా దట్టమైన మంచు అలముకుంది. ఇక ఉదయం 8.30 –9.00 గంటల వరకు పొగమంచు కొనసాగడంతో ఎదురుగా వస్తున్న వాహనాలు కూడా సరిగ్గా కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రమాదాలు జరగకుండా వాహనదారులు ఉదయం పూట కూడా హెడ్‌లైట్లు వేసుకుని అతి నెమ్మదిగా ప్రయాణించాల్సి వచ్చింది. వర్షం కురుస్తుందని భావించిన ప్రజలు, ఒక్కసారిగా వాతావరణం చల్లబడి పొగమంచు కమ్మేయడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. విమాన ,రైలు సేవలకు కాస్త ఆటంకం తప్పలేదు. కాగా, అక్వాన్ తుపాను ప్రభావంతో చైన్నె, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే, అది బెడిసి కొట్టింది. తాజాగా మంచుకురుస్తుండంతో ఇక వర్షాలు పడేనా? అన్న ఆందోళన తప్పడం లేదు.


