సాక్షి, చైన్నె: రాష్ట్రంలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం 10 రోజుల పాటు కార్తీక దీపం ఉత్సవాన్ని అత్యంత వైభవంగా జరుపుతుంటారు. ఇందులో సుబ్రహ్మణ్య స్వామి ఆరు పడైవీడులలో మొ దటిదైన తిరుపరకుండ్రం ఆలయంలో కార్తీక దీపం ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఈ నెల 16న ధ్వజారోహణంతో ప్రారంభమైన ఈ పది రోజుల ఉత్సవాల్లో భాగంగా, సోమవారం సాయంత్రం 7.25 గంటలకు స్వామివారి పట్టాభిషేకం, మంగళవారం ఉదయం కార్తీక రథోత్సవం, సాయంత్రం కొండపై మహాదీపం వెలిగించే కార్యక్రమం జరగనున్నాయి. అయితే, కొండపై ఉన్న పురాతన దీపస్తంభం వద్ద దీపం వెలిగించే అంశంపై న్యాయపరమైన, రాజకీయపరమైన ఉత్కంఠ నెలకొని ఉంది.
సుప్రీంకోర్టు ఆదేశాలు
– ప్రభుత్వ రివ్యూ పిటిషన్
తిరుపరకుండ్రం కొండ శిఖరంపై ఉన్న ఉచ్చిపిళ్ళైయా ర్ ఆలయ మండపం వద్ద ఏటా సంప్రదాయబద్ధంగా మహాదీపాన్ని వెలిగిస్తారు. అయితే, కొండపై ఉన్న దీ పస్తంభం వద్ద కూడా దీపం వెలిగించడానికి అనుమతి ఇవ్వాలంటూ హిందూ సంస్థలు సుదీర్ఘకాలంగా డిమాండ్ చేస్తున్నాయి. గత ఏడాది హైకోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ అధికారులు అమలు చేయకపోవడంతో, తాజాగా ఈ నెల 24న ఒక్కరోజు మాత్రమే దీపస్తంభం వద్ద దీపం వెలిగించేందుకు సుప్రీంకోర్టు అనుమతి మంజూరు చేసింది. అయితే, ఆ ప్రాంతంలోకి సాధారణ ప్రజల ప్రవేశాన్ని నిషేధించాలని, తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది.మరోవైపు, సుప్రీంకోర్టు తీర్పుపై సమీక్ష కోరుతూ (రివ్యూ పిటిషన్) తమిళనాడు ప్రభుత్వం శనివారం రాత్రి అత్యవసరంగా పిటిషన్ దాఖలు చేసింది. దీనిని విచారణకు జాబితా చేయకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. సుప్రీంకోర్టు ఆదేశాలపై ప్రభుత్వంధృఢంగా వ్యవహరించాలని సంకీర్ణ, ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.
ఆలయ వర్గాల సన్నాహాలు:
సంప్రదాయ మహాదీపం కోసం సుమారు 70 కిలోల బరువున్న రాగి గంగాళాన్ని సిద్ధం చేస్తున్నారు. 150 మీటర్ల నూలు వత్తి, స్వచ్ఛమైన నెయ్యి, కర్పూరంతో దీనిని వెలిగిస్తారు. అయితే, సుప్రీంకోర్టు ఆదేశించిన దీపస్తంభం వద్ద దీపాన్ని రాగి పాత్రతో వెలిగించాలా లేక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలా అనే విషయంపై న్యాయ నిపుణులు, ఉన్నతాధికారులతో సంప్రదించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని ఆలయ వర్గాలు వెల్లడించాయి.ఉత్సవాల నేపథ్యంలో తిరుపర కుుండ్రం కొండ పరిసరాలను పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పాత మెట్ల మార్గం, అండవర్ కోవిల్ వీధి వద్ద వెదురు కంచెలను ఏర్పాటు చేశారు. గతంలో పండుగకు రెండు రోజుల ముందే భక్తులను కొండపైకి అనుమతించేవారు కాదు. అయితే, ఈ ఏడాది భక్తుల ఆధార్ కార్డు నంబర్, చిరునామాను తనిఖీ చేసి, వారి వద్ద ఉన్న వస్తువులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే కొండపైకి అనుమతిస్తున్నారు. కొండపై ఉన్న కొత్త మెట్లు, దర్గా, దీపస్తంభం ప్రాంతాల్లో వందలాది మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.


