సాక్షి, చైన్నె: చైన్నె నగరంలో ఇటీవల కాలంగా వాహనాల రద్దీ తీవ్రంగా పెరిగింది. కాలుష్యం సైతం క్రమంగా పెరుగుతోంది. భవిష్యత్తులో ఢిల్లీలోని పరిస్థితుల తరహాలో ఇక్కడ కూడా వాతావరణం ఎదురయ్యే అవకాశాలు ఉండవచ్చేమో అన్న ఆందోళనా తప్పడం లేదు. పచ్చదనం అన్నది క్రమంగా నగరంలో కొరవడుతుండటంతో మొక్కల పెంపకం, ఖాళీ స్థలాలలో మడ అడవుల పెంపకం దిశగా ప్రయత్నాలు ముమ్మరంచేశారు. ఈ పరిస్థితులో నగర వీధులను పచ్చదనంతో , చల్లటి వాతావరణంలో తీర్చిదిద్దేందుకు బృహత్తర ప్రాజెక్టుకు సిద్ధమయ్యారు.
ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం
నగరంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే రద్దీ ప్రాంతాల వలన ఆర్థికంగా వెనుకబడిన , బలహీన వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిని దృష్టి లో ఉంచుకుని, చైన్నెలోని రద్దీగా ఉండే వీధులను ఎంపిక చేసి, వాటిని మరింత చల్లగా, పచ్చగా, పాదచారులకు అనుకూలంగా మార్చేందుకు ఈ కార్యక్రమం ద్వారా డిజైన్ పరిష్కారాలను రూపొందిస్తున్నారు.
బృందాల భాగస్వామ్యతో కార్యాచరణ
వాస్తుశిల్పులు, పట్టణ రూపకర్తలు, జీఐఎస్, వాతావరణ డేటా నిపుణులు, విద్యార్థులు, పౌర సమాజ ప్రతినిధులు, స్థానిక నివాసితులు ఈ ప్రాజెక్టుకు భాగస్వాములయ్యారు. 3 నుండి 5 మంది సభ్యులతో కూడిన బృందాలు చైన్నెలోని గుర్తించబడిన నిర్దిష్ట ప్రాంతాలను ఎంచుకుని, క్షేత్ర అధ్యయనాలు, ఉష్ణ్ణోగ్రత డేటా ఆధారంగా సహజసిద్ధమైన పరిష్కారాలతో నమూనాలను సిద్ధం చేస్తున్నాయి.
ఇది గొప్ప వేదిక..
ఈ ప్రాజెక్టు గురించి కమిషనర్ సమీరన్ మాట్లాడుతూ, స్థానిక వాతావరణానికి అనుగుణంగా ఆచరణాత్మకమైన డిజైన్ పరిష్కారాలను రూపొందించేందుకు ఇది ఒక గొప్ప వేదిక అని పేర్కొన్నారు. వీధుల రూపకల్పనలో వాతావరణ మార్పులను తట్టుకోగల మౌలిక సదుపాయాలు, సుస్థిర రవాణా వ్యవస్థలు, అందరూ సమానంగా ఉపయోగించుకోగల ప్రజా ప్రదేశాలను ఏకీకతం చేయాల్సిన అవసరాన్ని ఆయన చెప్పారు. బృందాలు ప్రతిపాదించిన వినూత్న ఆలోచనలను పరిగణించి ఉన్నామన్నారు.
కమిషనర్ సమీరన్
రూపకల్పనలో కీలక అంశాలు
స్థానిక వాతావరణానికి అనువైన చెట్ల జాతులను నాటి నీడను పెంచడం, పట్టణ జీవవైవిధ్యాన్ని కాపాడటం. నీటిని భూమిలోకి ఇంకింపజేసే పేవ్‌మెంట్లు, వేడిని ప్రతిబింబించే మరియు తక్కువ ఉద్గారాలు వెలువరించే రహదారి పదార్థాలను వినియోగించడం. దివ్యాంగులతో సహా అందరికీ అనుకూలంగా ఉండేలా ఫుట్‌పాత్‌లు, సురక్షితమైన పాదచారుల దాటే మార్గాలను మెరుగుపరచడం లక్ష్యంగా ముందుకెళ్లనున్నారు.


