దీపంకు గ్రీన్‌ సిగ్నల్‌! | - | Sakshi
Sakshi News home page

దీపంకు గ్రీన్‌ సిగ్నల్‌!

Nov 21 2026 2:26 AM | Updated on Nov 21 2026 2:26 AM

తిరుప్పరకుండ్రం వివాదంలో సుప్రీం కోర్టు తీర్పు

కఠిన షరతులతో వెలిగించేందుకు అనుమతి

పునర్‌ సమీక్షకు సీపీఎం డిమాండ్‌

హిందూ సంఘాల సంబరాలు

సాక్షి, చైన్నె : మదురైలోని తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న ప్రాచీన రాతి స్తంభంపై కార్తీక దీపాన్ని వెలిగించాలని దశాబ్దాలుగా హిందూ సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. దీనికోసం న్యాయ పోరాటం చేస్తున్నారు. కొండపై దీపం వెలిగించేందుకు అనుమతిస్తూ మద్రాస్‌ హైకోర్టు గతంలో తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం, కొండపై ఉన్న సికందర్‌ బాదుషా దర్గా యాజమాన్యం సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. మరోవైపు, కార్తీక మాసంలో కొండపై దీపాలు వెలిగించేందుకు భక్తులను అనుమతించాలని, అలాగే పురావస్తు శాఖ నుంచి తప్పనిసరి అనుమతి తీసుకోవాలనే నిబంధనను తొలగించాలని కోరుతూ రామ రవికుమార్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్‌ అరవింద్‌ కుమార్‌, జస్టిస్‌ విపుల్‌ ఎం.పంచోలితో కూడిన ధర్మాసనం మూడు రోజులుగా విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సికందర్‌ దర్గా సమీపంలో దీపం వెలిగించకూడదని సీనియర్‌ న్యాయవాది గట్టిగా వాదించారు. గతంలో 1862, 1902 సంవత్సరాల్లో మత సామరస్యానికి భంగం కలిగించే ఉద్దేశంతో కొందరు దర్గా సమీపంలో దీపం వెలిగించేందుకు ప్రయత్నించగా అధికారులు అడ్డుకున్నారని గుర్తుచేశారు. 1994లో ఇదే అంశంపై దాఖలైన కేసులో దర్గా వద్ద దీపం వెలిగించడం సంప్రదాయం కాదని మద్రాస్‌ హైకోర్టు స్పష్టం చేసిందని తెలిపారు. కొండపై ఉన్న ఆలయం వద్ద 150 ఏళ్లుగా దీపం వెలిగించే ఆనవాయితీ ఉందని, దర్గా సమీపంలోని రాతి స్తంభంపై దీపం వెలిగించిన చరిత్ర లేదని పేర్కొన్నారు. ఇప్పుడు ఇక్కడ దీపం వెలిగించడానికి అనుమతిస్తే, భవిష్యత్తులో అక్కడ ప్రత్యేక పూజలు చేసుకునేందుకు కూడా అనుమతివ్వాలని డిమాండ్లు వస్తాయని, తద్వారా శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.

సుప్రీంకోర్టు ప్రధాన షరతులు

వాదనలు ముగిసిన అనంతరం న్యాయమూర్తులు ఈ నెల 24వ తేదీన దీపం వెలిగించేందుకు అనుమతి ఇస్తూ మధ్యంతర ఉత్తుర్వులు ఇచ్చారు. అలాగే పలు షరతులు విధించారు. ఇది తుది తీర్పుగా గానీ, భవిష్యత్తులో ఒక ఆదర్శంగా గానీ భావించకూడదని స్పష్టం చేశారు. దీనివల్ల ఎవరికీ ఎలాంటి చట్టపరమైన హక్కులు సంక్రమించవని తేల్చిచెప్పారు. ఒక్కరోజు మాత్రమే దీపం వెలిగించేందుకు అనుమతి ఇస్తున్నామన్నారు. దీపం వెలిగించేందుకు కమిటీ సభ్యులను ఆలయ నిర్వాహకవర్గమే ఎంపిక చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమ బాధ్యతలను మదురై జిల్లా కలెక్టర్‌ పర్యవేక్షించాలని, మదురై పోలీస్‌ కమిషనర్‌ కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని సూచించారు. అవసరమైతే కేంద్ర రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ను మోహరించాలని కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది. అదే సమయంలో ఊరేగింపులు, నినాదాలు, బహిరంగ సమావేశాలపై పూర్తి నిషేధం ఉంటుందని స్పష్టం చేశారు. అధీకృత వ్యక్తులను మాత్రమే స్తంభం వద్దకు అనుమతించాలని, దీపం వెలిగించిన వెంటనే ఆ బృందం అక్కడి నుంచి వెళ్లిపోవాలని తెలిపారు. ఆ ప్రాంతంలో ఎలాంటి తాత్కాలిక లేదా శాశ్వత నిర్మాణాలు చేపట్టరాదని స్పష్టం చేశారు. కొండపై ఉన్న సికందర్‌ దర్గాతో సహా ఏ మతపరమైన చిహ్నానికీ నష్టం కలగకూడదని, దర్గాకు వచ్చే భక్తుల ఆరాధనకు ఎలాంటి ఆటంకం కలిగించరాదని ఆదేశించారు. ఈ కార్యక్రమం ముగిసిన మూడు రోజుల్లోగా జిల్లా కలెక్టర్‌ కోర్టుకు నివేదిక సమర్పించాలని సూచించారు. విభిన్న మతాల ప్రజలు పరస్పర గౌరవంతో తమ హక్కులను ఆచరించాలని తెలిపారు. తదుపరి విచారణను 2027 జనవరికి వాయిదా వేశారు. అదే సమయంలో ఈ ఆదేశాలకు వ్యతిరేకంగా అప్పీలు పిటిషన్‌ దాఖలు చేయాలని లేదా, పునర్‌ సమీక్షా పిటిషన్‌ను దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి షణ్ముగం డిమాండ్‌ చేశారు. ఇక సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో హిందూ సంఘాలు స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నాయి. సుప్రీం కోర్టు ఆదేశాలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్‌నాగేంద్రన్‌ ఆహ్వానించారు.

ఆలయ భూమిలోనే రాతి స్తంభం

దర్గా తరపు వాదనలను పిటిషనర్‌ రామ రవికుమార్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది వల్లియప్పన్‌, న్యాయవాది లక్ష్మణ్‌ రాజా తీవ్రంగా తిప్పికొట్టారు. కొండపై ఉన్న భూమి వివరాలను కోర్టు ముందుంచారు. మెట్లు, ధ్వజస్తంభం, కొత్త మండపంతో కలుపుకుని దర్గాకు 86 సెంట్ల భూమి మాత్రమే ఉందని తెలిపారు. మిగిలిన 171.17 ఎకరాల భూమి ఆలయానికే చెందుతుందని స్పష్టం చేశారు. వివాదాస్పద రాతి స్తంభం పూర్తిగా ఆలయ భూమిలోనే ఉందని పేర్కొన్నారు. రాతి స్తంభం పైభాగంలో నెయ్యి పోసి వత్తి వెలిగించేందుకు వీలుగా గుంట (బోలు నిర్మాణం) ఉందని వివరించారు. ఇందులో దీపం వెలిగిస్తే గాలికి ఆరిపోకుండా సరిగ్గా రెండు గంటల పాటు వెలుగుతుందని తెలిపారు. తమిళనాడులోని మరుదమలై, స్వామిమలై, పళనిమలై మురుగన్‌ ఆలయాల్లోనూ ఇదే పద్ధతిలో దీపాలు వెలిగిస్తారని కోర్టుకు నివేదించారు. ఏడాది పొడవునా కాకుండా, ఒక్క రోజు రెండు గంటల పాటు ఆలయ భూమిలో దీపం వెలిగిస్తే ఎవరికి నష్టం కలుగుతుందని పిటిషనర్‌ తరఫు న్యాయవాదులు ప్రశ్నించారు.

అది సర్వే రాయి మాత్రమే

మదురై జిల్లా కలెక్టర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది గోపాల్‌ శంకరనారాయణన్‌ వాదిస్తూ దర్గా సమీపంలో ఉన్న స్తంభం దీపస్తంభం కాదని, అది బ్రిటీష్‌ కాలంలో భూమి కొలతల కోసం ఏర్పాటు చేసిన సర్వే రాయి అని పేర్కొన్నారు. ‘ఆ రాతి స్తంభం ఉన్న స్థలం ఆలయ పరిపాలనకు చెందినదా, కాదా? అని ధర్మాసనం సూటిగా ప్రశ్నించడంతో, ఆ భూమి ఆలయ విభాగానికే చెందుతుందని న్యాయవాది అంగీకరించారు.

తమిళనాడులోని తిరుప్పరకుండ్రం కొండపై ఉన్న ప్రాచీన రాతి స్తంభం వద్ద కార్తీక దీపం వెలిగించే వివాదంలో సుప్రీంకోర్టు శుక్రవారం

కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ స్తంభంపై కార్తీక దీపం రోజున మాత్రమే దీపం వెలిగించేందుకు అనుమతి ఇచ్చింది. ఇందుకు

కఠిన షరతులను విధించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ అరవింద్‌ కుమార్‌, జస్టిస్‌ విపుల్‌ ఎం.పంచోలిలతో కూడిన ధర్మాసనం

ఆదేశాలు ఇచ్చింది. దీంతో దశాబ్దాల వివాదం కొలిక్కి వచ్చినట్టు అయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement