సాక్షి, చైన్నె : కావేరి నదీ జలాల పంపిణీ విషయంలో తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. లోటుగా ఉన్న 11.719 టీఎంసీల నీటిని తక్షణమే విడుదల చేసేలా కర్ణాటకను ఆదేశించాలని కోరుతూ తమిళనాడు దాఖలు చేసిన పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం కొట్టివేసింది. ఈ మేరకు జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్‌తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులను జారీ చేసింది. తమిళనాడు ప్రభుత్వం తన వాదనలను వినిపిస్తూ పిలిగుండులు వద్ద కొలతల ప్రకారం తమిళనాడుకు రావాల్సిన వాటాలో 11.719 టీఎంసీల నీటి కొరత ఏర్పడిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. జలాశయాల్లో తగినంత నీటి నిల్వలు ఉన్నప్పటికీ కర్ణాటక ఉద్దేశపూర్వకంగానే నీటిని నిలిపివేస్తోందని ఆరోపిస్తూ రెండు వేర్వేరు పిటిషన్లను దాఖలు చేసింది. సకాలంలో నీరు అందకపోవడంతో తమ రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయని, రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేసింది. తమిళనాడు ఆరోపణలను కర్ణాటక ప్రభుత్వం తన అఫిడవిట్‌లో తీవ్రంగా ఖండించింది. తమ రాష్ట్రంలోనూ తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని, తాగునీటి అవసరాలకే ఇబ్బందులు ఎదురవుతు న్నాయని స్పష్టం చేసింది. పిలిగుండులు వరకు అందుబాటులో ఉన్న మొత్తం 483 టీఎంసీల నీటిలో, ఇప్పటికే 404.25 టీఎంసీల నీటిని తమిళనాడుకు విడుదల చేశామని గణాంకాలతో సహా కోర్టుకు నివేదించింది. ఇరుపక్షాల వాదనలు, గణాంకాలను పరిశీలించిన ధర్మాసనం, ఈ దశలో కర్ణాటకకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేయలేమని స్పష్టం చేస్తూ తమిళనాడు పిటిషన్లను తోసిపుచ్చింది. సుప్రీంకోర్టు తీర్పుతో తమిళనాడు డెల్టా రైతుల్లో నిరాశ వ్యక్తమవుతోంది. ప్రభుత్వం బలమైన వాదనలు కోర్టు ముందు ఉంచడంలో విఫలమైందని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి.


