క్వారీ స్కాంలో టార్గెట్‌ మూర్తి! | - | Sakshi
Sakshi News home page

క్వారీ స్కాంలో టార్గెట్‌ మూర్తి!

Nov 21 2026 2:26 AM | Updated on Nov 21 2026 2:26 AM

● డీఎంకే మాజీ మంత్రి ఇంటిలో ఐదు గంటల సోదాలు ● స్టాలిన్‌ ఫోన్‌ పరామర్శ, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

సాక్షి, చైన్నె : అక్రమ క్వారీ తవ్వకాల కుంభకోణం కేసులో మాజీ మంత్రి, డీఎంకే సీనియర్‌ నేత పి.మూర్తి నివాసం సహా ఆయన బంధువుల ఇళ్లపై మదురై జిల్లా సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున మెరుపు దాడులు చేశారు. గత డీఎంకే ప్రభుత్వ హయాంలో వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రిగా పనిచేసిన పి.మూర్తి, తన అధికారాన్ని దుర్వినియోగం చేసి నిబంధనలకు విరుద్ధంగా క్వారీ తవ్వకాలు జరిపారన్నది ప్రధాన ఆరోపణ. మదురై జిల్లా అలంగనల్లూరు, పాలమేడు, వాడిపట్టి తాలూకా కోటడ్సియార్‌ ప్రాంతాల్లో అనుమతించిన పరిమితికి మించి ఎర్రమట్టి, షేల్‌ రాళ్లు, కంకరను అక్రమంగా తవ్వడం వల్ల ప్రభుత్వ ఖజానాకు మొత్తం రూ.5.39 కోట్ల (వేర్వేరుగా రూ.2.32 కోట్లు, రూ.3.07 కోట్లు) ఆదాయ నష్టం వాటిల్లిందని ఖనిజ వనరుల శాఖ నివేదిక ఇచ్చింది. దీని ఆధారంగా క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు.

సోదాలు–కీలక పత్రాలు స్వాధీనం

కోర్టు అనుమతితో డీఎస్పీ పొన్నరసు నేతృత్వంలోని పోలీసు బృందం మదురై అయ్యర్‌ బంగ్లాలోని ఎలిల్‌ నగర్‌, రోజా వీధిలో ఉన్న పి.మూర్తి ఇంట్లో తెల్లవారుజామున సోదాలు ప్రారంభించింది. ఆ సమయంలో బయటి వ్యక్తులెవరినీ ఇంట్లోకి అనుమతించలేదు. క్వారీ టెండర్‌ వివరాలు, ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కీలక పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మూర్తి పోలీసులకు పూర్తిగా సహకరించినట్లు సమాచారం. ఏకకాలంలో ఎలిల్‌ నగర్‌లోని మరో ఇంటితో పాటు పాలమేడులోని బంధువు ధనరాజ్‌, అలంగనల్లూరులోని పొన్రామ్‌, పూవంతిలోని రాజమణి ఇళ్లలోనూ పోలీసులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు.

ఇంటి వద్ద ఉద్రిక్తత.. కార్యకర్తలను వారించిన మూర్తి

సోదాల విషయం తెలియగానే తిరుమంగళం ఎమ్మెల్యే ఎల్‌.ఎ.మణిమారన్‌, మాజీ ఎమ్మెల్యే వెంకటేశన్‌తో పాటు వందలాది మంది డీఎంకే కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ అదనపు పోలీసు బలగాలను మోహరించారు. నినాదాలు చేస్తున్న కార్యకర్తలను మాజీ మంత్రి మూర్తి స్వయంగా వారించి, ఎవరినీ తప్పుగా విమర్శించవద్దని స్పష్టం చేశారు. తాను ఈ తప్పు చేయలేదని, చట్టపరంగా ఎలాంటి కేసునైనా ఎదుర్కొంటానని స్పష్టం చేశారు.

డ్రగ్స్‌ కేసు నుంచి దృష్టి మరల్చేందుకే దాడులు

మాజీ మంత్రి మూర్తి ఇంటిపై దాడుల నేపథ్యంలో డీఎంకే అధ్యక్షుడు ఎం.కె.స్టాలిన్‌ ఫోన్‌లో ఆయనతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అనంతరం సోషల్‌ మీడియా వేదికగా సీఎం విజయ్‌ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తమిళనాడులో జరుగుతున్న దేశంలోనే అతిపెద్ద మాదకద్రవ్యాల అక్రమ రవాణా గుట్టును కేంద్ర ఏజెన్సీలు రట్టు చేస్తున్నాయని తెలిపారు. దీని నుంచి ప్రజలు, మీడియా దృష్టిని మళ్లించేందుకే ప్రభుత్వం మాజీ మంత్రి మూర్తిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోందని ఆరోపించారు. శాంతిభద్రతలను గాలికొదిలేసి, రాజకీయ కక్షతో డీఎంకే మాజీ మంత్రులపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారన్నారు. ఈ అక్రమ కేసులను తాము న్యాయపరంగా ఎదుర్కొని గెలుస్తామన్నారు. సీఎం విజయ్‌ ఇకపై డీఎంకేను బూచిగా చూపి తమిళనాడు ప్రజలను మోసం చేయలేరని స్టాలిన్‌ ధ్వజమెత్తారు. కాగా, ఇప్పటికే డీఎంకే సీనియర్‌ నేతలు, మాజీ మంత్రి దురై మురుగన్‌, ఏవీ వేలు, సెంథిల్‌బాలాజీ, కేఎన్‌నెహ్రూ తదితరులను పలు వివాదాస్పద అంశాలతో టీవీకే పాలకులు టార్గెట్‌ చేసిన విషయం తెలిసిందే. అలాగే, ఇప్పటికే మాజీ మంత్రి అన్బిల్‌ మహేష్‌ను పాఠశాలలకు గుర్తింపు కేసులో అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement