●పోలీసులను నిలదీసిన మద్రాస్ హైకోర్టు
సాక్షి, చైన్నె: కోయంబత్తూరులోని పెరియార్ విజ్ఞాన కేంద్రం, గ్రంథాలయం పుస్తకాల కొనుగోలులో జరిగిన అవకతవకలకు బాధ్యులైన అధికారులపై ఇంతవరకు ఎందుకు కేసులు నమోదు చేయలేదని మద్రాస్ హైకోర్టు పోలీసు శాఖను తీవ్రంగా ప్రశ్నించింది. జస్టిస్ వి.లక్ష్మీనారాయణన్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం ఈ పిటిషన్పై విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా పోలీసుల దర్యాప్తు తీరుపై న్యాయమూర్తి పలు కీలక ప్రశ్నలు సంధించారు. ప్రభుత్వ అధికారులు, ఐఏఎస్ అధికారుల సహాయం లేకుండా రాజకీయ నాయకులు మాత్రమే లంచాలు ఎలా తీసుకోగలరు? అని నిలదీశారు. గుర్తుతెలియని ప్రచురణకర్తల నుంచి పుస్తకాలు కొనుగోలు చేయాలని ఎవరు ఆదేశాలు జారీ చేశారో తేల్చాలని ఆదేశించారు. ఈ కుంభకోణంలో ప్రమేయం ఉన్న రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులపై కేసులు ఎందుకు పెట్టలేదని, అదే ప్రతిపక్ష పా ర్టీలకు చెందిన వారైతే పోలీసు శాఖ వెంటనే రంగంలోకి దిగి చర్యలు తీసుకుంటుంది కదా! అని అసహనం వ్యక్తం చేశారు. దీనిపై పోలీసు శాఖ తరఫు న్యాయవాది స్పందిస్తూ పుస్తకాల కొనుగోలు అక్రమాలకు సంబంధించి కీలక సాక్ష్యాధారాలను సేకరిస్తున్నామని తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో సోమవారం నివేదిక దాఖలు చేస్తామని చెప్పారు. దీంతో విచారణను న్యాయమూర్తి వాయిదా వేశారు.
సినిమా షూటింగ్లకు
ఆన్లైన్లో అనుమతులు
సాక్షి, చైన్నె : తమిళనాడులో సినిమా షూటింగులకు అనుమతి ఇచ్చే ప్రక్రియను సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త పైలెట్ ప్రాజెక్టును ప్రారంభించింది. తద్వారా చిత్ర నిర్మాతలు, నిర్మాణ సంస్థలు అవసరమైన అనుమతులను పూర్తిగా ఆన్లైన్లోనే సులభంగా, వేగంగా పొందే వీలు కలుగుతుంది. గతంలోలా అనుమతుల కోసం వివిధ శాఖల అధికారుల వద్ద తిరగాల్సిన ఇబ్బంది లేకుండా, పైలెట్ ప్రాజెక్ట్ ద్వారా సమన్వయంతో, వేగంగా అనుమతులు జారీ చేసేలా వ్యవస్థను రూపొందించారు. చైన్నె తారామణిలోని ఎంజీఆర్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లొకేషన్లలో చిత్రీకరణ అనుమతులు కూడా ఇందులో భాగంగా ఉన్నాయి.
దరఖాస్తు – పరిశీలన
షూటింగ్ జరిగే ప్రదేశం, తేదీ, సమయం వివరాలతో సమాచారం అందిన వెంటనే సంబంధిత అధికారులకు పంపుతారు. చైన్నెలో గ్రేటర్ చైన్నె కార్పొరేషన్ కమిషనర్, చైన్నె మెట్రోపాలిటన్ పోలీస్ కమిషనర్, ఆవడి, తాంబరం పోలీస్ కమిషనరేట్ అధికారులు పరిశీలిస్తారు. ఇతర జిల్లాల్లో జిల్లా కలెక్టర్ల జనరల్ డివిజన్ అధికారులు ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తారు. సంబంధిత అధికారుల ఆమోదం లభించిన తర్వాత, సమాచార, ప్రజా సంబంధాల శాఖ అధికారికంగా షూటింగ్కు అనుమతి మంజూరు చేస్తుంది. ఎలాంటి జాప్యం, సమాచార అంతరాలు జరగకుండా అలర్ట్ నోటిఫికేషన్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు.
ఘనంగా నాగూర్ దర్గా 470వ కందూరి ఉత్సవం
సాక్షి, చైన్నె : ప్రపంచ ప్రసిద్ధ నాగూర్ దర్గాలో జరుగుతున్న 470వ కండూరి ఉత్సవాల్లో అత్యంత ప్రధాన ఘట్టమైన చందనం అభిషే కం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. షాహుల్ హమీద్ దర్గా సమాధి వద్ద శుక్రవారం జరిగిన ఈ వేడుకలో తమిళనాడు నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నాగపట్టణం నుంచి ప్రారంభమైన గంధం ఊరేగింపు సంప్రదాయ వాయిద్యాలు, తారై తపట్టైల మధ్య నాగూర్ దర్గా వద్దకు చేరుకుంది. గంధపు కుండలను దించి దర్గా నిర్వాహకుల ఆధ్వర్యంలో సమాధి వద్ద చందనం అభిషేకం చేశారు. అనంతరం ఆ గంధాన్ని భక్తులకు ప్రసాదంగా పంచిపెట్టారు. ఉత్సవాలకు ప్రభుత్వం కల్పించిన సదుపాయాలు, ఏర్పాట్లపై దర్గా ముఖ్య కార్యనిర్వహణాధికారి కృతజ్ఞతలు తెలిపారు.


