పరందూర్‌ ప్రాజెక్టు రద్దుపై త్వరలో జీవో! | - | Sakshi
Sakshi News home page

పరందూర్‌ ప్రాజెక్టు రద్దుపై త్వరలో జీవో!

Nov 21 2026 2:26 AM | Updated on Nov 21 2026 2:26 AM

● మద్రాస్‌ హైకోర్టుకు ప్రభుత్వం వివరణ ● న్యాయమూర్తుల ప్రశ్నల వర్షం

సాక్షి, చైన్నె: చైన్నెకి రెండో విమానాశ్రయంగా నిర్మించతలపెట్టిన పరందూర్‌ విమానాశ్రయ ప్రాజెక్టును పూర్తిగా విరమించుకుంటూ త్వరలోనే అధికారిక ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తమిళనాడు ప్రభుత్వం మద్రాస్‌ హైకోర్టుకు స్పష్టం చేసింది. చైన్నె మీనంబాక్కం విమానాశ్రయంలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు, గత డీఎంకే ప్రభుత్వ హయాంలో రూ.27 వేల కోట్ల అంచనాతో పరందూర్‌ వద్ద కొత్త విమానాశ్రయం నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం సుమారు రూ.680 కోట్లు వెచ్చించి 1,700 ఎకరాల (మొత్తం అవసరమైన భూమిలో 48 శాతం) భూమిని కూడా సేకరించారు. విమానాశ్రయానికి వ్యవసాయ భూములను తీసుకోవడంతో రైతుల జీవనోపాధి దెబ్బతింటోందన్న కారణంతో ఈ ప్రాజెక్టును రద్దు చేస్తున్నట్లు సీఎం విజయ్‌ ఆగస్టు 24న శాసనసభలో ప్రకటించారు.

హైకోర్టులో పిల్‌

ఎలాంటి సాంకేతిక, ఆర్థిక అధ్యయనాలు లేకుండానే ప్రాజెక్టును రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ చైన్నెకి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌, పబ్లిషర్‌ గౌతమన్‌ మద్రాస్‌ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. శాసనసభ నిబంధనలు 110 కింద సీఎం చేసిన ప్రకటన అమలుపై స్టే విధించాలని కోరారు. ఇప్పటికే సేకరించిన 1,700 ఎకరాల భూమిని తిరిగి యజమానులకు అప్పగించకుండా అడ్డుకోవాలని, ప్రాజెక్టు రద్దు నిర్ణయాన్ని పునఃపరిశీలించేలా ఆదేశించాలని అభ్యర్థించారు.

ధర్మాసనం సూటి ప్రశ్నలు

ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధర్మాధికారి, జస్టిస్‌ అరుళ్మురుగంతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుపై న్యాయమూర్తులు కీలక ప్రశ్నలు సంధించారు. ఇప్పటికే రూ.680 కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి 1,700 ఎకరాల భూమిని సేకరించిన తర్వాత ప్రాజెక్టును మధ్యలోనే ఎలా వదిలేస్తారు? అని అసహనం వ్యక్తం చేశారు. గతంలో అన్ని సాంకేతిక అధ్యయనాలు నిర్వహించి ఆమోదించిన తర్వాత, ఇప్పుడు ఆ ప్రాంతం అనుకూలం కాదని ఎలా చెబుతారని నిలదీశారు. దీనిపై అడ్వకేట్‌ జనరల్‌ స్పందిస్తూ విమానాశ్రయం కోసం ఎంపిక చేసిన పరందూర్‌ ప్రాంతంలో పెద్ద ఎత్తున జలాశయాలు, పంట భూములు ఉన్నాయని తెలిపారు. దీనివల్ల పర్యావరణ అనుమతులు పొందడం అత్యంత సంక్లిష్టంగా మారిందని పేర్కొన్నారు. గతంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాలను సరిదిద్దడంలో భాగంగానే ప్రాజెక్టును విరమించుకోవాలని ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుందని వివరించారు. ఇందుకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను సిద్ధం చేస్తున్నామని, త్వరలోనే వాటిని జారీ చేస్తామని కోర్టుకు నివేదించారు. ప్రభుత్వ వివరణను నమోదు చేసుకున్న ధర్మాసనం, ఈ పిటిషన్‌పై నాలుగు వారాల్లోగా పూర్తిస్థాయి కౌంటర్‌ దాఖలు చేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని, ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement