సాక్షి, చైన్నె : అనారోగ్యంతో బాధపడుతూ మృతిచెందిన కొలత్తూరు ఎమ్మెల్యే వి.ఎస్.బాబు అంత్యక్రియలు శుక్రవారం సాయంత్రం ముగిశాయి. పలువురు రాజకీయ ప్రముఖులు, మంత్రులు, వేలాది మంది కార్యకర్తలు, ప్రజల అశ్రునయనాల మధ్య తిరువీకానగర్ కార్పొరేషన్ శ్మశానవాటికలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. మరోవైపు, ఆయన మరణంపై అనుమానాలు ఉన్నాయంటూ సెంబియంకు చెందిన వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ప్రముఖుల నివాళి
కొళత్తూరు, పెరంబూరు పరిధిలోని వి.ఎస్.బాబు నివాసం వద్దకు ప్రజలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో, పలువురు రాష్ట్ర మంత్రులు, వివిధ పార్టీల నేతలు ఆయన పార్థివదేహంపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. మంత్రి రాజమోహన్ మాట్లాడుతూ ఎమ్మెల్యే వి.ఎస్.బాబును కాపాడేందుకు సీఎం విజయ్ అన్ని విధాలా ప్రయత్నించారని తెలిపారు. తమ ప్రియతమ నేతకు నివాళిగా పెరంబూర్, కొలత్తూరు ప్రాంతాల్లోని చిన్న దుకాణాల నుంచి పెద్ద వాణిజ్య సంస్థలను వ్యాపారులు స్వచ్ఛందంగా మూసివేశారు. సాయంత్రం ఆయన పార్థివదేహాన్ని ఊరేగింపుగా తిరువికానగర్ విద్యుత్ శ్మశానవాటికకు తీసుకెళ్లి అంత్యక్రియలు జరిపారు. అంతిమ ఊరేగింపులో సీఎం విజయ్ నడుచుకుంటూ వచ్చారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు, టీవీకే ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. అంతకుముందు సీఎం విజయ్ కొంతదూరం వీఎస్ బాబు పాడెను మోశారు.
ఆస్పత్రి యాజమాన్యంపై ఫిర్యాదు
ఎమ్మెల్యే వి.ఎస్.బాబు మరణం వెనుక అనుమానాలు ఉన్నాయంటూ సెంబియం ప్రాంతానికి చెందిన దేవరాజ్ చైన్నె పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెప్టెంబర్ 2వ తేదీ రాత్రి గుండెపోటుతో చైన్నెలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన బాబుకు ట్రాకియోస్టమీ శస్త్ర చికిత్స జరిగినట్లు వార్తలు వచ్చాయని తెలిపారు. దీనిపై ప్రభుత్వం, ఆస్పత్రి వర్గాలు అధికారిక ప్రకట న చేయలేదని ఆరోపించారు. శ్వాసకోశ ఇబ్బందితో ఐసీయూలో చేరిన ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఒకట్రెండు రోజుల్లో డిశ్చార్జ్ అవుతారని ఆస్పత్రి యాజమాన్యం ప్రకటించిన కొద్ది రోజులకే ఆయన మరణించారన్న వార్త దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు.
హత్య కేసు నమోదుకు డిమాండ్
ప్రజాప్రతినిధి ఆరోగ్య పరిస్థితి తెలుసుకునే హక్కు ఓటర్లకు ఉందని, దీనిపై తాను ఇప్పటికే కోర్టును కూడా ఆశ్రయించానని దేవరాజ్ తెలిపారు. వీఎస్ బాబు రక్త నమూనాలు, వైద్య నివేదికలు, చికిత్స అందించిన వీడియోలను భద్రపరచాలని, ప్రభుత్వ వైద్యుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆయన మరణంపై అనుమానం ఉన్నందున ఆస్పత్రి యాజమాన్యం, వైద్యులపై హత్య కేసు నమోదు చేసి విచారణ జరపాలని తన ఫిర్యాదులో కోరారు.


