సాక్షి, చైన్నె: గత డీఎంకే ప్రభుత్వ హయాంలో ఖనిజ వనరుల దోపిడీ జరిగిందంటూ మంత్రి డి.కె.ప్రభు చేసిన ఆరోపణలపై విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. తమిళనాడు శాసనసభలో ఖనిజ వనరుల శాఖ మంత్రి డి.కె.ప్రభు మాట్లాడుతూ గత డీఎంకే పాలనలో ఖనిజ వనరులను అక్రమంగా తవ్వడం వల్ల ప్రభుత్వానికి భారీ నష్టం కలిగిందని, పర్యావరణం దెబ్బతినిందని ఆరోపించారు. మంత్రి వ్యాఖ్యల ఆధారంగా, విల్లుపురం జిల్లా అరగందనల్లూరుకు చెందిన న్యాయవాది రాజన్ మద్రాస్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంపై విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని కోరుతూ ఆగస్టులో రాష్ట్ర ముఖ్య కార్యదర్శికి వినతి పత్రం ఇచ్చినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు.
ధర్మాసనం తీవ్ర ఆగ్రహం
ఈ పిటిషన్‌ను శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధర్మాధికారి, జస్టిస్ అరుళ్మురుగనంతో కూడిన ధర్మాసనం విచారించింది. పిటిషన్‌లో నిర్దిష్టమైన వివరాలు లేకపోవడంపై న్యాయమూర్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అక్రమంగా ఖనిజాలను ఎక్కడ తవ్వారు? అసలు దర్యాప్తు ఎక్కడ జరపాలి? వంటి కనీస ఆధారాలు లేకుండా పిల్ దాఖలు చేస్తే జరిమానాతో కొట్టివేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఖనిజ వనరులను చట్టవిరుద్ధంగా ఎక్కడ వెలికితీశారో కనీసం ఒక్క ఉదాహరణ అయినా చూపగలిగితే, తాము విచారణకు ఆదేశించడానికి సిద్ధంగా ఉన్నామని చేశారు. శాసనసభలో జరిగిన చర్చలు, ప్రసంగాల ఆధారంగా కోర్టులు ఉత్తర్వులు జారీ చేయగలవా అని ప్రశ్నిస్తూ, అసలు ఈ పిటిషన్ విచారణకు అర్హమైనదేనా అని నిలదీశారు. కోర్టు అడిగిన ప్రశ్నలకు పిటిషనర్ తరఫున సరైన సమాధానం రాకపోవడంతో, ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కొట్టివేస్తూ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.


