ఇద్దరు చీఫ్‌ లైబ్రేరియన్లు సహా ఐదుగురిపై వేటు | - | Sakshi
Sakshi News home page

ఇద్దరు చీఫ్‌ లైబ్రేరియన్లు సహా ఐదుగురిపై వేటు

Nov 17 2026 1:08 AM | Updated on Nov 17 2026 1:08 AM

ముమ్మర దర్యాప్తు

అగల్‌ విలక్కు పబ్లిషర్లపై గురి

ప్రధాన పబ్లిషర్‌ మోహన్‌ అరెస్టు

తమిళనాడులోని ప్రభుత్వ గ్రంథాలయాలకు పుస్తకాల కొనుగోలులో భారీ అవకతవకలు జరిగినట్లు తేలడంతో పబ్లిక్‌ లైబ్రరీ శాఖ కఠిన చర్యలకు ఉపక్రమించింది. నకిలీ రచయితల పేర్లతో పుస్తకాలను కొనుగోలు చేసి రూ. కోట్లలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో, ఇద్దరు చీఫ్‌ లైబ్రేరియన్లతో సహా ఐదుగురు కీలక అధికారులను పబ్లిక్‌ లైబ్రరీ శాఖ ఇన్‌ఛార్జ్‌ డైరెక్టర్‌ ఆర్‌.వి. షజీవన బాధ్యతల నుండి తొలగించారు. కోయంబత్తూరులోని పెరియార్‌ విజ్ఞాన కేంద్రం, గ్రంథాలయంతో పాటు చైన్నెలోని అన్నా శతాబ్ది గ్రంథాలయం, కన్నిమర గ్రంథాలయం, మదురైలోని కళైజ్ఞర్‌ శతాబ్ది గ్రంథాలయాలలో పుస్తకాల సేకరణలో భారీ అవినీతి జరిగినట్లు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 8వ తేదీన పబ్లిక్‌ లైబ్రరీ శాఖ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఐఏఎస్‌ అధికారిణి ఎస్‌. జయంతిని ఆ బాధ్యతల నుండి రిలీవ్‌ చేసి, తమిళనాడు టెక్స్‌ట్‌బుక్‌ కార్పొరేషన్‌ ఎండీ ఆర్‌.వి. సజీవకు అప్పగించారు. అనంతరం అవినీతి నిరోధక విభాగం అధికారులు రాష్ట్రవ్యా ప్తంగా ఉన్న ప్రధాన గ్రంథాలయాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో అగల్‌ విళక్కు, ఫీనిక్స్‌ పబ్లికేషన్స్‌ తదితర సంస్థలు నకిలీ రచయితల పేర్లతో ముద్రించి సరఫరా చేసిన 70,674 పుస్తకాలను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 7 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఈ కుంభకోణంపై మంత్రి రాజ్‌మోహన్‌ స్పందిస్తూ, రాష్ట్రవ్యాప్తంగా గ్రంథాలయాలకు పుస్తకాల కొనుగోలు ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రక టించారు. తమిళనాడులోని అన్ని గ్రంథాలయాల్లో సమగ్ర విచారణ జరుపుతామని తెలిపారు.

తమిళనాడు వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గ్రంథాలయాల పుస్తకాల కొనుగోలు కుంభకోణం కేసులో అవినీతి నిరోధక శాఖ (డీవీఏసీ ) పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. ఇందులో భాగంగా కోయంబత్తూరులోని ప్రతిష్ఠాత్మక పెరియార్‌ విజ్ఞాన కేంద్రం, గ్రంథాలయంపై సోమవారం రెండోసారి ఆకస్మిక దాడులు నిర్వహించారు. అలాగే, అగల్‌ విలక్కు పబ్లిషర్లను సైతం టార్గెట్‌ చేశారు. చైన్నెతో పాటుగా మరో ఆరు చోట్ల కూడా సోదాలు జరుగుతున్నాయి.

విజ్ఞాన కేంద్రంలో సోదాలు

సాక్షి, చైన్నె : కోయంబత్తూరు గాంధీపురంలోని నంజప్ప రోడ్డులో సెంట్రల్‌ బస్టాండ్‌కు ఎదురుగా సుమారు రూ. 300 కోట్ల వ్యయంతో గ్రౌండ్‌ ఫ్లోర్‌ , ఏడు అంతస్తులతో పెరియార్‌ విజ్ఞాన కేంద్రాన్ని నిర్మించారు. గ్రంథాలయాలు, శాసీ్త్రయ మౌలిక సదుపాయాలు, సమావేశ మందిరాలు కలిగిన ఈ కేంద్రాన్ని గత నెలలోనే ప్రారంభించారు. ప్రారంభమైన కొద్ది రోజులకే ఈ గ్రంథాలయం కోసం అగల్‌ విళక్కు, ఫీనిక్స్‌ పబ్లిషింగ్‌ హౌస్‌ సంస్థల నుండి నకిలీ రచయితల పేర్లతో ముద్రించిన పుస్తకాలను అధిక ధరలకు కొనుగోలు చేశారంటూ ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపడంతో ఇటీవలే ఈ గ్రంథాలయం నుండి 2,000కు పైగా వివాదాస్పద పుస్తకాలను తొలగించారు. అనంతరం ఈ నెల 10వ తేదీన ఏసీబీ అధికారులు మొదటిసారి తనిఖీలు నిర్వహించగా, తాజాగా సోమవారం రెండోసారి సోదాలు చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.కోయంబత్తూరు అవినీతి నిరోధక విభాగం డీఎస్పీ ఇమ్మాన్యుయేల్‌ జ్ఞానశేఖర్‌ నేతృత్వంలోని 10 మంది సభ్యుల ప్రత్యేక బృందం ఈ సోదాల్లో పాల్గొంది. భవనంలోని 4వ అంతస్తులో ఉన్న తమిళ పుస్తకాల విభాగం కార్యాలయంలో అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అక్కడ నిల్వ ఉంచిన పుస్తకాలు, వాటి ముద్రణ, ప్రచురణ వివరాలకు సంబంధించిన రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. అలాగే, అగల్‌ విలక్కు పబ్లిషర్లను గురి పెట్టి సోదాలు జరుగుతున్నాయి. ఈ నిర్వాహకులు నివాసం, కార్యాలయాలలో సోదాలు జరుగుతున్నాయి. అలాగే, అన్నా శతజయంతి స్మారక గ్రంథాలయంతో పాటుగా మరో ఆరు చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి.

ప్రచురణ సంస్థలపై దర్యాప్తు

ఈ అక్రమాల్లో ప్రమేయమున్న ఫీనిక్స్‌, సిగ్మా, అగల్‌ విళక్కు వంటి సంస్థలు దక్షిణ భారత పుస్తక విక్రేతలు మరియు ప్రచురణకర్తల సంఘంలో సభ్యులు కాదని సంఘం అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌. షణ్ముగం నేతృత్వంలోని కమిటీ మంత్రికి వివరించింది. వివాదాస్పద అగల్‌ విళక్కు ప్రచురణకర్తపై అవినీతి నిరోధక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.పుస్తకాల కొనుగోలు అవకతవకలకు బాధ్యులుగా చేస్తూ ఈ ఐదుగురు అధికారులను పబ్లిక్‌ లైబ్రరీ శాఖ ఇన్‌ఛార్జ్‌ డైరెక్టర్‌ సజీవ తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో అన్నా శత జయంతిస్మారక గ్రంథాలయం చీఫ్‌ లైబ్రేరియన్‌ ఎస్‌. కామాక్షి, సమాచార అధికారిఎస్‌. చందన కార్తికేయన్‌, కలైంజ్ఞర్‌ శత జయంతి స్మారక గ్రంథాలయం చీఫ్‌ లైబ్రేరియన్‌ దినేష్‌కుమార్‌, కోయంబత్తూరు పెరియార్‌ విగ్రహాన కేంధ్రం అధికారి వి చందన కృష్ణన్‌, ప్రజా గ్రంథాలయ శాఖ చీఫ్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ జె. జూలియట్‌లు ఉన్నారు. మరోవైపు, కోయంబత్తూరు లైబ్రరీ కేసులో కేవలం పరిపాలనాపరమైన విధులు మాత్రమే నిర్వర్తించిన గ్రంథపాలకులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయవద్దని గ్రంథాలయ ఉద్యోగుల సంక్షేమ సంఘం మంత్రిని కోరింది. కాగా సోమవారం రాత్రి అగల్‌ విళక్కు ప్రధాన పబ్లిషన్‌ మోహన్‌ను పోలీసులు అరెస్టు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

పెరియార్‌ విజ్ఞాన కేంద్రంలో మళ్లీ డీవీఏసీ సోదాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement