వేలూరు: తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయ కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజైన సోమవారం ఉదయం పంచ మూర్తులను బంగారు సూర్యప్రభ వాహనంలో మాడ వీధుల్లో ఊరేగించారు. అరుణాచలేశ్వరాలయంలో పది రోజుల పాటు జరిగే కార్తీక బ్రహ్మోత్సవాలు ఆదివారం ఉదయం ధ్వజా రోహణంతో ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి వినాయకుడు, చంద్రశేఖర స్వామి వారిని మాడవీధుల్లో ఊరేగించారు. అనంతరం అధికార నంది వాహనంలో భక్తుల హరోంహర.... నామ స్మరణ మధ్య పంచమూర్తులను ఊరేగించారు. సోమవారం ఉదయం 9 గంటలకు పంచమూర్తులలైన వినాయకుడు , చంద్రశేఖరుడు, మురుగన్, అన్నామలైయార్, ఉన్నామలై, చండీకేశ్వరర్ స్వామి వార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, పుష్పలంకరణ చేసి దీపారాధన పూజలు చేశారు. అనంతరం పంచమూర్తులకు పుష్పాలంకరణ చేసి మాడ వీధుల్లో మూసిక వాహనం, హంస వాహనం, వెండి అధికార నంది వాహనం, సింహ వాహనంలో ఊరేగించారు. ఈ ఉత్సవాల్లోని స్వామి వారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కర్పూర హారతులు పట్టి మొక్కులు చెల్లించుకున్నారు. బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడంతో తిరువణ్ణామలైకి భక్తులు పోటెత్తారు.
మాడ వీధుల్లో భక్తులకు
దర్శనమిస్తున్న పంచమూర్తులు


