సాక్షి, చైన్నె: సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వ పనితీరుపై డీఎంకే అధ్యక్షుడు ఎం.కె. స్టాలిన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో త్వరలోనే ఒక మంచి పరిస్థితి ఏర్పడబోతోందని, అందుకు డీఎంకే కార్యకర్తలు ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.మంచి రోజులు రానున్నాయంటూ పరోక్షంగా డీఎంకే పాలన కు రావడం ఖాయం అన్నట్టు కేడర్‌కు సంకేతాన్ని ఇచ్చారు. సోమవారం ఉదయం చైన్నె నీలంకరై ఈస్ట్ కోస్ట్ రోడ్డులోని ఆర్‌కె కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన డీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి కె.ఎన్. నెహ్రూ కుటుంబ వివాహ వేడుకకు స్టాలిన్ అధ్యక్షత వహించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అందరికీ స్వాగతం పలికారు. వివాహ వేడుకలో వధూవరులను ఆశీర్వదించిన అనంతరం స్టాలిన్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రస్తుత అధికార పార్టీ పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
తెరపై హీరో.. నిజ జీవితంలో విలన్
తమిళనాడులో ఒక క్రూరమైన పాలన నడుస్తోందని, ఇది ప్రజలకు తీవ్ర నిరాశను కలిగించిందని స్టాలిన్ అన్నారు. తెరపై హీరోగా నటించిన వ్యక్తి, ఇప్పుడు నిజ జీవితంలో విలన్‌గా వ్యవహరిస్తున్నారని సీఎంను ఉద్దేశించి విమర్శించారు.: గత ఆరు నెలలుగా తమిళనాడులో కొనసాగుతున్నది ప్రభుత్వం కాదని, అది కేవలం ఒక ప్రదర్శన మాత్రమేనని విమర్శించారు. మార్పు అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన వారు తమిళనాడు ప్రజలకు తీవ్ర నిరాశను మిగిల్చారని పేర్కొన్నారు. తెరపై హీరోగా నటించి, నిజ జీవితంలో ప్రతినాయకుడిలా వ్యవహరించే వ్యక్తి నేడు రాష్ట్రంలో సీఎంగా ఉన్నారని మండి పడ్డారు.
మంత్రుల విరుద్ధ ప్రకటనలపై ఆగ్రహం
ఇటీవల డిప్యూటీ స్పీకర్ ఒక పిటిషనర్‌పై దాడి చేసిన వీడియోతో పాటు కళ్లకురిచి మహిళా కలెక్టర్ వ్యవహారాన్ని స్టాలిన్ గుర్తు చేశారు. ఈ విషయాన్ని పార్టీ ఎంపీ కనిమొళి మొదటగా ప్రజల ముందుకు తీసుకువచ్చారని తెలిపారు. ఈ ఘటనలపై సీఎం నోరు విప్పడానికి నిరాకరిస్తుండగా, న్యాయశాఖ మంత్రి అసలు ఏమీ జరగలేదని అంటున్నారని మండిపడ్డారు. మరికొందరు మంత్రులు ఫిర్యాదు చేస్తే చర్య తీసుకుంటామని పొంతన లేని ప్రకటనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కె.ఎన్. నెహ్రూ కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న స్టాలిన్, తాము అధికారంలో ఉన్నా లేకపోయి నా ప్రజల గుండెల్లో నిలిచి ఉంటామని పేర్కొన్నా రు. రాష్ట్రంలో కొనసాగుతున్న ఈ అరాచక పాలనకు ముగింపు పలికేందుకు త్వరలోనే ఒక మంచి వాతావరణం ఏర్పడుతుందంటూ పరోక్షంగా డీఎంకే ప్రభుత్వం రాబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ వివాహ వేడుకకు డీఎంకే ప్రధాన కార్య దర్శి దురై మురుగన్, కోశాధికారి టి.ఆర్. బాలు, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్.ఎస్. భారతి, ఉప ప్రధాన కార్యదర్శులు పొన్ముడి, కనిమొళి ఎంపీ, టి.కె.ఎస్. ఇళంగోవన్, మాజీ మంత్రులు ఇ.వి. వేలు, ఎం.ఆర్.కె. పన్నీర్ సెల్వం, ఆవడి నాసర్‌లతో పాటు ద్రవిడర్ కజగం అధ్యక్షుడు కె. వీరమణి, సీపీఐ సీనియర్ నేత ముత్తరసన్, తమీమున్ అన్సారీ, జవహిరుల్లా తదితర కూటమి పార్టీల నేతలు హాజరయ్యారు.


