దూసుకొస్తున్న అక్వాన్‌ | - | Sakshi
Sakshi News home page

దూసుకొస్తున్న అక్వాన్‌

Nov 17 2026 1:08 AM | Updated on Nov 17 2026 1:08 AM

● ఆంధ్రా వైపుగా తీరం దాటే అవకాశం ● 18,19 తేదీలలో 4 జిల్లాలకు అలర్ట్‌ ● నేటి నుంచి వానలు

సాక్షి, చైన్నె: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం క్రమంగా తుపానుగా బలపడుతున్న నేపథ్యంలో చైన్నె వాతావరణ శాఖ తాజా హెచ్చరికలు జారీ చేసింది. దీని ప్రభావంతో 18, 19 తేదీల్లో చైన్నె, తిరువళ్లూరు, చెంగల్పట్టు, కాంచీపురం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుండి అతి భారీ వర్షాలు, బలమైన గాలులు వీస్తాయని పేర్కొంది. మరోవైపు, అక్వాన్‌ 20వ తేదీ మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్‌ తీరాన్ని అతి తీవ్రమైన తుపానుగా దాటే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆగ్నేయ , దానిని ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆదివారం రాత్రి తీవ్ర అల్పపీడనంగా బలపడి, సోమవారం ఉదయం అదే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర–వాయువ్య దిశగా కదులుతూ సోమవారం సాయంత్రానికి దక్షిణ, పశ్చిమ–మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారింది. మంగళవారం సాయంత్రానికి మరింత బలపడి తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందుతుంది. అనంతరం పశ్చిమ–వాయువ్య దిశగా పయనిస్తూ నవంబర్‌ 20 మధ్యాహ్నం నెల్లూరు, తుని మధ్య ఆంధ్రప్రదేశ్‌ తీరాన్ని దాటనుంది. దీనికి తోడు ఆగ్నేయ అరేబియా సముద్రం, ఉత్తర కేరళ తీరంపై సుమారు 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం నెలకొని ఉంది.

విస్తారంగా వర్షాలకు అవకాశం

మంగళవారం పశ్చిమ కనుమల జిల్లాలు, తీరప్రాంత తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్‌ ప్రాంతాల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయి. మిగిలిన ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుంది. చైన్నెలో ఆకాశం మేఘావతమై అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. 18, 19 తేదీలలో చైన్నె, తిరువళ్లూరు, చెంగల్పట్టు,కాంచీపురం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుండి అతి భారీ వర్షాలతో పాటు గంటకు 40–50 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. రాణిపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పశ్చిమ కనుమలు, ఇతర ఉత్తర కోస్తా తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్‌ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడతాయి. 20 నుంచి 22వ తేదీ వరకు పశ్చిమ కనుమల జిల్లాలు, ఉత్తర కోస్తా తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్‌ ప్రాంతాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

మత్స్యకారులకు హెచ్చరిక

సోమవారం నుండి 18వ తేదీ వరకు ఉత్తర తమిళనాడు తీరం వెంబడి గంటకు 40–50 కి.మీ. (గరిష్టంగా 60 కి.మీ.) వేగంతో, 19వ తేదీన గంటకు 50–60 కి.మీ. (గరిష్టంగా 70 కి.మీ.) వేగంతో బలమైన గాలులు వీస్తాయి. అలాగే అండమాన్‌ సముద్ర ప్రాంతంలోనూ గంటకు 60 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున, ఈ రోజుల్లో మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇక, బంగాళాఖాతంలో తుఫాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో మత్స్య శాఖ మంత్రి శ్రీనాథ్‌ సోషల్‌ మీడియా వేదికగా మత్స్యకారులను అప్రమత్తం చేశారు. తీవ్ర అల్పపీడనం తుఫానుగా బలపడుతున్నందున, తమిళనాడు తీర జిల్లాల నుండి లోతైన సముద్రంలోకి వేటకు వెళ్లిన భారీ పడవలు, ఇతర చేపల వేట బోట్లు అన్నీ తక్షణమే ఒడ్డుకు తిరిగి రావాలని పిలుపు నిచ్చారు. మత్స్యకార సంక్షేమ శాఖ నుండి తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు తూర్పు తీర ప్రాంతంలో ఎవరూ సముద్రంలోకి వెళ్లకూడదని హెచ్చరించారు. పడవలను సురక్షిత ప్రాంతాల్లో నిలిపి, ప్రభుత్వ భద్రతా చర్యలకు సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement