● 19న 1,100 మందికి స్టైపెండ్ ● మంత్రి అధవ్ అర్జున వెల్లడి
సాక్షి, చైన్నె: తమిళనాడులో క్రీడలను ప్రోత్సహించేందు కు, క్రీడాకారులకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోందని క్రీడా శాఖ మంత్రి అధవ్ అర్జున ప్రకటించారు. ఇకపై ఏటా 400 మంది ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. తమిళనాడు ఒలింపిక్ అసోసియేషన్ కార్యనిర్వాహక కమిటీ , సర్వసభ్య కమిటీ సమావేశం అనంతరం మంత్రి అధవ్ అర్జున మాట్లాడారు. గతానికి భిన్నంగా ప్రస్తుతం క్రీడా సంఘాలు, ప్రభుత్వం సమన్వయంతో కలిసి పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. 2005–2026 మధ్యకాలంలో కేవలం 305 మంది క్రీడాకారులకు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు లభించాయని,అయితే, ఇప్పుడు ఏటా 300 నుండి 400 మంది క్రీడాకారులకు ప్రభుత్వ ఉపాధి కల్పించేలా ప్రణా ళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు ఇకపై ప్రతి మూడు నెలలకు ఒకసారి స్టైపెండ్ అందజేస్తామని చెప్పారు. ఇందులో భాగంగా నవంబర్ 19న 1,100 మంది ఆటగాళ్లకు స్టైపెండ్ పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.
కోచ్‌లకు గుర్తింపు కార్డులు
క్రీడా రంగంలో నకిలీ కోచ్‌ల వల్ల పోక్సో వంటి కేసులు నమోదవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన మంత్రి, ఇలాంటి అవాంఛనీయ ఘటనలను అరికట్టేందుకు శిక్షకులందరికీ ఫోటోలతో కూడిన అధికారిక గుర్తింపు కార్డులు జారీ చేయనున్నట్లు ప్రకటించారు.మహిళల కోసం ప్రత్యేకంగా సీఎం ట్రోఫి పోటీలను నిర్వహించేందుకు యోచిస్తున్నట్లు తెలిపారు. అలాగే యువతలో మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు కళాశాల స్థాయిలో కూడా శారీరక విద్య తరగతులను ప్రవేశపెట్టాలని ప్రణాళిక వేస్తున్నట్లు వివరించారు.
ఉప్పు కార్మికులకు కానుక
సాక్షి, చైన్నె: తమిళనాడులోని ఉప్పు మడులలో పనిచేసే కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. వర్షాకాలంలో ఉప్పు తయారీ పనులు నిలిచిపోయి ఉపాధి కోల్పోయే కార్మికులకు అందిస్తున్న వార్షిక ఆర్థిక సహాయాన్ని రూ. 5,000 నుండి రూ. 7,000కు పెంచుతూ సీఎం విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. వెట్రి తమిళనాడు విజన్ పథకం కింద ఉప్పు మడులలో పనిచేసే కార్మికుల జీవనోపాధిని మెరుగుపరచడానికి , వారి చిరకాల డిమాండ్‌ను నెరవేర్చడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఆగస్టు 25న జరిగిన పరిశ్రమలు, పెట్టుబడి ప్రోత్సాహక , వాణిజ్య శాఖ గ్రాంట్ అభ్యర్థన సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి చేసిన ప్రకటనకు అనుగుణంగా తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయి. కాగా తమిళనాడు మాన్యువల్ లేబరర్స్ సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ బోర్డులో నమోదైన ఉప్పు కార్మికుల కుటుంబాలకు ప్రతి ఏటా ఈ ఆర్థిక సహాయం అందుతుంది. 2026–2027 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 23,979 ఉప్పు కార్మిక కుటుంబాలు ఈ పెంచిన భృతి ద్వారా లబ్ధి పొందనున్నాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 16.78 కోట్ల నిధులను కేటాయించింది.
మంత్రిపై విచారణకు డిమాండ్
సాక్షి,చైన్నె: ముదుమలై అటవీ ప్రాంతంలోకి అక్రమంగా ప్రవేశించి, వన్యప్రాణులకు ముప్పు కలిగించేలా వీడియోలు చిత్రీకరించారన్న ఆరోపణలపై సామాజిక న్యాయ శాఖ మంత్రి వన్నియరసుపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ సీఎం విజయ్‌ను డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం స్పందిస్తూ, ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సామాజిక న్యాయ శాఖ మంత్రి వన్నియరసు ముదుమలై అడవిలోకి ప్రవేశించి, అటవీ శాఖ వాహనంపై కూర్చుని ఒక పులిని వెంబడిస్తూ వీడియో తీశారు. ఈ దృశ్యాలను సోషల్ మీడియాలో రీల్స్ రూపంలో పోస్ట్ చేశారు. అయితే,. మంత్రి తీసుకున్న ఈ చర్య సామాజిక న్యాయ కార్యకర్తలకు తీవ్ర అవమానకరమని ప్రతి పక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ఈ విషయంగా దినకరన్ స్పందిస్తూ అటవీ శాఖతో ఎటువంటి సంబంధం లేని మంత్రి, అత్యంత భద్రత ఉండే అటవీ ప్రాంతంలోకి ఎలా ప్రవేశించగలిగారని దినకరన్ ప్రశ్నించారు. వన్యప్రాణులకు ఇబ్బంది కలిగించే ఇలాంటి చర్యలకు అటవీ అధికారులు ఎలా అనుమతించారని నిలదీశారు. టీవీకే పాలనలో అధికార పార్టీ కార్యకర్తల నుండి ఎమ్మెల్యేలు, చివరకు సీఎం వరకు అందరూ రీల్స్ మోజులో మునిగిపోయారని దినకరన్ ఎద్దేవా చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోని వీసీకే మంత్రి కూడా రీల్స్ కోసం వన్యప్రాణుల సహజ ఆవాసాలకు, శాంతికి భంగం కలిగించారని విమర్శించారు. మంత్రి వన్నియరసుపై చర్యలు తీసుకోవాలని కోరారు.


