సాక్షి, చైన్నె: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం క్రమంగా బలపడుతూ పెను తుపానుగా మారే అవకాశం ఉందని ప్రైవేట్ వాతావరణ శాస్త్రవేత్త సెల్వకుమార్ హెచ్చరించారు. దీని ప్రభావంతో చైన్నె సహా ఉత్తర తమిళనాడులోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆయన స్పష్టం చేశారు. దక్షిణ–మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం ఉత్తరం, వాయువ్యం దిశగా కదులుతోంది. ఇది సోమవారం సాయంత్రానికి తుపానుగా, 17న తీవ్ర తుపానుగా, 18 నాటికి అతి తీవ్ర తుపానుగా రూపాంతరం చెందే అవకాశం ఉంది.
దిశ మార్పు
ఉత్తర తమిళనాడు తీరానికి తూర్పున సుమారు 550 కిలోమీటర్ల దూరంలోకి వచ్చిన తర్వాత, ఈ తుపాను ఉత్తరం వైపు వెళ్లకుండా ఒకే ప్రాంతంలో స్థిరపడే సూచనలు ఉన్నాయి. అనంతరం 18న పశ్చిమం వైపు మళ్లి, 19వ తేదీన మధ్యాహ్నం ఉత్తర తమిళనాడు తీరాన్ని దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. సముద్రంలో ఉన్నప్పుడు గంటకు 145 కిలోమీటర్ల వేగంతో బలపడే ఈ తుపాను, తీరాన్ని తాకే సమయానికి కాస్త బలహీనపడినప్పటికీ గంటకు 120 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని సెల్వకుమార్ తెలిపారు. తూర్పు నుండి నేరుగా పడమర వైపుకు దూసుకురానున్నందున చైన్నె, తిరువళ్లూరు, చెంగల్పట్టు, కాంచీపురం జిల్లాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ విస్తారంగా అతి భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉంది.
నవంబర్ 22న మరో అల్పపీడనం:
ఈ తుపాను వల్ల రాష్ట్రంలోని పశ్చిమ, దక్షిణ జిల్లాలకు ఆశించిన స్థాయిలో వర్షపాతం ఉండకపోవచ్చని, అయితే 22వ తేదీ నుండి బంగాళాఖాతంలో మరో కొత్త అల్పపీడనం ఏర్పడి మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ముందుజాగ్రత్త చర్యగా తమిళనాడు ఓడరేవులలో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రైవేటు శాస్త్ర వేత్తల హెచ్చరికలతో చైన్నె శివారులలో ముందు జాగ్రత్తలు విస్తృతం అయ్యాయి.
అక్వాన్ తుపాను గమనం
ఇక, భారత వాతావరణ శాఖ వర్గాలుపేర్కొంటూ, ప్రస్తుతం తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతున్న ఈ వాతావరణ వ్యవస్థ, ఉత్తర–వాయువ్య దిశగా కదులుతూ సోమవారం సాయంత్రం అక్వాన్ తుఫానుగా రూపాంతరం చెందే అవకాశం ఉంది. అనంతరం 17 నాటికి పశ్చిమ–మధ్య బంగాళాఖాతంలో ఇది అతి తీవ్ర తుఫానుగా బలపడుతుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అల్పపీడన వ్యవస్థ ప్రస్తుతం శ్రీలంకలోని త్రికోనమలైకు తూర్పున 630 కి.మీ., అండమాన్‌లోని శ్రీ విజయపురానికి పశ్చిమ–నైరుతి దిశలో 690 కి.మీ., చైన్నెకి తూర్పు–ఆగ్నేయంగా 840 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.
తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఆదివారం పాంబన్, తూత్తుకుడి, నాగపట్నం, కారైకల్, కడలూరు, పుదుచ్చేరి, కట్టుపల్లి, చైన్నె, ఎన్నూర్ ఓడరేవుల్లో ఒకటో నంబర్ హెచ్చరిక జెండాను ఎగురవేశారు. మరోవైపు రామనాథపురం జిల్లాలో తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంతవరకు మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లరాదని అధికారులు నిషేధం విధించారు. తీర ప్రాంతాల్లో నిలిపి ఉంచిన పడవలు, వలలు, ఇతర వేట పరికరాలను సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని మత్స్య శాఖ స్పష్టమైన సూచనలు జారీ చేసింది.
వర్షం
హార్బర్‌లో సూచీ


