6,496 మందికి వడ్డీ మాఫీ | - | Sakshi
Sakshi News home page

6,496 మందికి వడ్డీ మాఫీ

Nov 14 2026 1:11 AM | Updated on Nov 14 2026 1:11 AM

సాక్షి, చైన్నె : తమిళనాడు హౌసింగ్‌ బోర్డు ద్వారా వాయిదాల పద్ధతిలో ప్లాట్లు, ఇళ్లు, అపార్ట్‌మెంట్లు పొందిన లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. వాయిదాల గడువు ముగిసినప్పటికీ పూర్తి బకాయిలు చెల్లించలేక సేల్‌ డీడ్‌ (అమ్మకపు దస్తావేజు) పొందలేకపోయిన 6,496 మందికి వడ్డీ మాఫీ వర్తింపజేస్తూ సీఎం విజయ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి శాసనసభలో జరిగిన గృహ నిర్మాణ శాఖ పద్దులపై చర్చ సందర్భంగా బకాయిదారులకు వడ్డీ రాయితీ కల్పిస్తామని ఆ శాఖామంత్రి ప్రకటించారు. సీఎం ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక పథకాన్ని ఒక సంవత్సరం పాటు అమలు చేయాలని ప్రభుత్వం ప్రకటించింది. వాయిదాల చెల్లింపు గడువు మార్చి 31తో ముగిసి, పూర్తి మొత్తం చెల్లించలేక సేల్‌ డీడ్‌ పొందలేకపోయిన 6,496 మంది కేటాయింపుదారులు ఈ పథకానికి అర్హులు అని వివరించారు. బకాయి మొత్తంపై విధించిన జరిమానా వడ్డీపై వడ్డీ, అసలు మొత్తంపై వడ్డీ, భూమి తుది ధర వ్యత్యాసంపై వసూలు చేసే వడ్డీని మాఫీ చేస్తారు. దీనితో పాటు ఏడాదికి 5 నెలల వడ్డీ మినహాయింపుతో సేల్‌ డీడ్‌ జారీ చేయనున్నారు. ఈ ప్రత్యేక వడ్డీ మాఫీ పథకం ద్వారా లబ్ధిదారులకు మొత్తం రూ.18.45 కోట్ల మేర ఆర్థిక ఉపశమనం కలగనుంది. ఈ నిర్ణయం వల్ల హౌసింగ్‌ బోర్డుకు రూ.92.39 కోట్ల మేర రాబడి తగ్గుతుందని ప్రభుత్వం పేర్కొంది. ఈ ప్రత్యేక రాయితీ పథకం ఏడాది పాటు మాత్రమే అమల్లో ఉంటుందని, లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఆస్తులకు సంబంధించిన సేల్‌ డీడ్‌లను పొందాలని ప్రభుత్వం సూచించింది.

టీవీకేలోకి ప్రముఖ న్యాయవాది రేవతి మణివన్నన్‌

సాక్షి, చైన్నె: నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ లాయర్స్‌ అసోసియేషన్‌ సంయుక్త కార్యదర్శి, మద్రాస్‌ హైకోర్టు ప్రముఖ న్యాయవాది రేవతి మణివన్నన్‌ అధికార తమిళగ వెట్రి కళగం పార్టీలో చేరారు. రేవతి మణవన్నన్‌కు పార్టీ సంయుక్త ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్యుత్‌, న్యాయ శాఖ మంత్రి సి.టి.ఆర్‌.నిర్మల్‌ కుమార్‌ పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. పర్యావరణ కార్యకర్తగా, సహజ వనరుల పరిరక్షణ కోసం మద్రాస్‌ హైకోర్టులో పలు కీలక కేసులను వాదిస్తున్న రేవతి మణివన్నన్‌ సామాన్యులకు చట్టాలపై అవగాహన కల్పించడంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ప్రముఖ సినిమా సన్నివేశాలను నిజ జీవిత చట్టాలతో పోల్చుతూ, సామాన్యులకు అర్థమయ్యే సులభమైన తమిళంలో రూపొందించే వీడియోలు సోషల్‌ మీడియాలో విశేష ఆదరణ పొందుతున్నాయి. రేవతి మణివన్నన్‌ మాట్లాడుతూ సీఎం విజయ్‌ పరిపాలనా దక్షత, ప్రజలకు చేరువయ్యే ఆయన సంక్షేమ పథకాలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు. చట్టం అనేది కోర్టు గదులకే పరిమితం కాకూడదని, అది ప్రతి వ్యక్తి దైనందిన జీవితంలో భాగం కావాలని పేర్కొన్నారు. తమ హక్కులు తెలియక ఏ ఒక్కరికీ న్యాయం అందకుండా పోకూడదన్నదే తన లక్ష్యమని తెలిపారు. ఇప్పటి వరకు సోషల్‌ మీడియా ద్వారా తాను అందిస్తున్న న్యాయపరమైన అవగాహన కార్యక్రమాలను ఇకపై పార్టీ వేదిక ద్వారా మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తానని స్పష్టం చేశారు.

యువతను ఓటరుగా చేర్చాలి

చైన్నె: తమిళనాడులో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో పార్టీ శ్రేణులు చురుగ్గా పాల్గొనాలని తమిళగ వెట్రి కళగం ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి ఎన్‌.ఆనంద్‌ పిలుపునిచ్చారు. సీఎం విజయ్‌ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా కార్యదర్శులు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, బూత్‌ స్థాయి నిర్వాహకులకు ఆయన శుక్రవారం లేఖ రాశారు. 18 ఏళ్లు నిండిన యువతను కొత్త ఓటర్లుగా నమోదు చేయడంపై దృష్టి సారించాలని స్పష్టం చేశారు. ప్రతి జిల్లాలోనూ 18 ఏళ్లు నిండి మొదటిసారి ఓటు వేయబోతున్న యువతను పోలింగ్‌ బూత్‌ స్థాయి ఏజెంట్లు గుర్తించి, వారి పేర్లు ఓటర్ల జాబితాలో చేర్చేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఇప్పటికే ఓటర్ల జాబితాలో ఉన్నవారి పేర్లు, చిరునామాలను సరిచూసుకోవాలని, ఏవైనా తప్పులు ఉంటే సవరించుకునేందుకు తగిన సహాయం అందించాలని తెలిపారు. ప్రతిరోజూ కొత్తగా నమోదు చేసిన ఓటర్ల దరఖాస్తు పత్రాలను ఫొటో తీసి, వాటిని పీడీఎఫ్‌ ఫైల్‌గా మార్చి, ఏ ఒక్క దరఖాస్తు కూడా మిగిలిపోకుండా పార్టీ అందించిన ప్రత్యేక లింక్‌లో ఎప్పటికప్పుడు అప్‌లోడ్‌ చేయాలని ఆదేశించారు. ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని కోరుతూ షెడ్యూల్‌ వివరాలను పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సమన్వయంతో పనిచేస్తూ, పోలింగ్‌ కేంద్రాల స్థాయిలో పార్టీ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని మంత్రి ఎన్‌.ఆనంద్‌ తన లేఖలో కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement